Trump Hindus Minorities| బంగ్లాదేశ్ లో హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతన్న హింసాత్మక దాడులను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ట్రంప్ తాను ఎన్నికల్లో విజయం సాధిస్తే.. అమెరికాలోని హిందువులకు పూర్తి భద్రత కల్పిస్తానని గురువారం చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా హిందువులపై జరుగుతున్న దాడులను ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శలు చేశారు.
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం పరిస్థితి అల్లకల్లోలంగా ఉందని.. తన ప్రత్యర్థి వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్, ఆమె బాస్ ప్రెసిడెంట్ జో బైడెన్ అమెరికా, ప్రపంచంలోని హిందువుల సమస్యలను పట్టించుకోవడం లేదని .. తాను అధికారంలో ఉంటే అది జరిగేది కాదని అన్నారు. ఇజ్రాయెల్, ఉక్రెయిన్ నుంచి అమెరికా దక్షిణ సరిహద్దుల దాకా అన్ని చోట్ల బైడెన్, కమలా హ్యారిస్ పూర్తిగా విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ట్విట్టర్ ఎక్స్ లో ఓ ట్వీట్ చేశారు.
Also Read: అణు ఆయుధాల డ్రిల్ ప్రారంభించిన రష్యా.. అయోమయంలో అమెరికా?..
“బంగ్లాదేశ్ లో హిందువులు, క్రిస్టియన్లు, ఇతర మైనారిటీలపై జరుగుతున్నదాడులను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మైనారిటీలు ఆ దేశంలో నిలువు దోపిడీకి గురవుతున్నారు. బంగ్లాదేశ్ లో హింసచెలరేగతోంది. పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. నేనే అధికారంలో ఉంటే ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రానిచ్చేవాడిని కాదు. అమెరికాతోపాటు ప్రపంచంలోని హిందువులందరినీ కమలా, బైడెన్ పట్టించుకోలేదు. వారు ఉక్రెయిన్, ఇజ్రాయెల్ యుద్ధాలు ఆపడంలో పూర్తిగా విఫలమయ్యారు. చివరికి అమెరికా దక్షిణ సరిహద్దులు కూడా సురక్షితంగా లేవు. కానీ మనమందరం కలిసి మళ్లీ అమెరికాకు బలం చేకూర్చాలి, పూర్తి బలంతో శాంతిని నెలకొల్పాలి.” అని తన ట్వీట్ లో ట్రంప్ రాశారు.
మత వ్యతిరేక లెఫ్టిస్టులకు వ్యతిరేకంగా హిందు అమెరికన్లకు మద్దతుగా తన ప్రభుత్వం కూడా నిరసన చేస్తుందని ఆయన తెలిపారు. తాను అధికారంలోకి వస్తే.. భారతదేశంతో, తన స్నేహితుడు నరేంద్ర మోదీతో సంబంధాలను బలోపేతం చేస్తానని.. హామీ ఇచ్చారు.
కమలా హ్యారిస్ అధికారంలోకి వస్తే.. ఎక్కువ పన్నులు, ఆంక్షలతో చిన్న వ్యాపారాలను నాశనం చేస్తుందని.. కానీ తాను మాత్రం పన్నులు తగ్గించి, నియంత్రణను సరళీకరించడంతో చరిత్రలోనే బలమైన అమెరికా ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇలా ముందు చేశాం. మరోమారు చేసి చూపిస్తామన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన దీపావళి పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలంటూ శుభాకాంక్షలు తెలిపారు.
మరోవైపు నవంబర్ 5న జరుగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు హోరాహోరీగా మారింది. ఒకవైపు ట్రంప్ న్యూమెక్సికో, ఆరిజోనా, నెవాడా ప్రాంతాల్లో ప్రచారం చేస్తే.. కమలా హ్యారిస్ కూడా ఆరిజోనా, నెవాడా ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఆరిజోనా, నెవాడా .. రెండు రాష్ట్రాల్లో కూడా ఇద్దరి మధ్య గట్టి పోటీ నెలకొందని సర్వేలు తెలుపుతున్నాయి. కమలా హ్యారిస్ కు మద్దతుగా ప్రముఖ హాలీవుడ్ నటి, గాయని జెన్నిఫర్ లోపెజ్ లాస్ వెగాస్ లో ప్రచారం చేయడం విశేషం.
ఇప్పటివరకు 6 కోట్ల మంది అమెరికన్లు తమ బాలెట్ ఓట్లను వినియోగించుకున్నట్లు సమాచారం.