US Election 2024: ఇది వరకూ ఎప్పుడూ లేనంత ఇంట్రస్టింగ్‌గా అమెరికా ఎన్నికలు మారాయి. ప్రీపోల్ సర్వేలు, ఎర్లీ ఓటింగ్ తర్వాత కూడా అమెరికన్ ఎలక్షన్ ఫైట్ టైట్‌గా కనిపిస్తోంది. అక్టోబర్ 30తో ముగిసిన ప్రచారం మరింత హీట్‌ను పెంచింది. ఇప్పుడు గెలుపు అటా ఇటా..? ఎటో అర్థంకాక విశ్లేషకులు సైతం వెర్రెత్తిపోతున్నారు. ఫైనల్ ఓటింగ్‌కి మరో 5 రోజులే ఉండటంతో రెండు ప్రధాన పార్టీల పల్స్ రేటు పెరిగిపోతోంది. సర్వేలన్నీ వెంట్రుకవాసి మార్జిన్‌లో కమల హారిస్ ముందంజలో ఉన్నాయని చెబుతుంటే.. చాలా మంది ట్రంప్ గెలుస్తాడని అనుకుంటున్నారు. అసలేంటీ కన్ఫూజన్..? అసలు, ఫైనల్ క్యాంపైన్ ఎలా జరిగింది..? ద గ్రేట్ అమెరికన్ ఫైట్‌లో విజయం ఎవర్ని వరించబోతోంది..? ఈ గెలుపును డిసైడ్ చేసేదెవరు..? వాచ్ దిస్ స్టోరీ.
ప్రెసిడెన్షియల్ గెలుపు కోసం టగ్ ఆఫ్ వార్
అగ్ర రాజ్యం అమెరికా ఎన్నికలంటే అన్ని దేశాల్లోనూ ఆసక్తి ఉండటం సహజమే. అయితే, ఈసారి ఎన్నికలు మాత్రం ఇది వరకూ ఎప్పుడు లేనంతగా టెన్షన్ పుట్టిస్తున్నాయి. అమెరికాలో గెలిచేవారిని బట్టి ప్రస్తుతం నడుస్తున్న ప్రపంచ ఉద్రిక్తతలు ఎటు మలుపు తిరుగుతాయో అర్థం చేసుకోవచ్చు. అందుకే, ఈ ఎన్నికలు ఒక్క అమెరికాకే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాలలో ఆసక్తిని రేపుతున్నాయి. ఇక, ప్రెసిడెన్షియల్ గెలుపు కోసం టగ్ ఆఫ్ వార్ జరుగుతోంది. యూఎస్ ఉపాధ్యక్షురాలు, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి, కమల హారిస్… రిపబ్లికన్ల అభ్యర్థి, మాజీ యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మధ్య నెక్ అండ్ నెక్ ఫైట్ కొనసాగుతోంది.
ఫైనల్ పోలింగ్‌కి 5 రోజులే ఉండటంతో.. కీలకమైన రాష్ట్రాలతో సహా పలు ప్రాంతాల్లో కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ దృష్టి పెట్టారు. 16.1 కోటికి పైగా ఉన్న అమెరికాలోని మొత్తం ఓటర్లలో ఇప్పటికే పూర్తయిన ముందస్తు ఓటింగ్‌లో 2 కోట్ల 10 లక్షల మంది తమ నిర్ణయాన్ని చెప్పేశారు. ఇక, నవంబర్ 5న ఓటు వేసే సింహ భాగం ఓటర్లు, ఇప్పటికీ నిర్ణయం తీసుకోని న్యూట్రల్ ఓటర్లు, ముఖ్యంగా స్వింగ్ స్టేట్స్‌లో ఉన్న ఓటర్ల మద్దతు కోసం ఇప్పుడు ఇద్దరు అభ్యర్థులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ట్రంప్‌కు మద్దతు ఇచ్చేవారిని చెత్తతో పోల్చిన బైడెన్
అయితే, ఇప్పటికీ వరకూ ట్రంప్‌పై హారిస్ స్వల్ప తేడాతో ముందంజలో ఉన్నారు. యునైటెడ్ స్టేట్స్‌లోని అన్ని ప్రధాన అధ్యక్ష ఎన్నికల సగటును తీసుకునే పోలింగ్ ట్రాకర్ 538 ప్రకారం… డెమోక్రటిక్ అభ్యర్థి హారిస్, విస్కాన్సిన్‌లో 48.2% ఓట్లను సాధిస్తుంటే.. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌కు 47.4% మద్దతు అందింది. వీరిద్దరి మధ్య 3% నుండి 5% మధ్య ఎర్రర్ మార్జిన్ ఉంది. అందుకే, అభ్యర్థులిద్దరూ నవంబర్ 5 ఎన్నికల్లో ఏం జరుగుతుందో అని తెగ టెన్షన్ పడుతున్నారు. ఈ వేడి అంతా అక్టోబర్ 30 చివరి రోజు ఎన్నికల ప్రచారంలో కనిపించింది.
కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్‌లు కీలక రాష్ట్రమైన విస్కాన్సిన్‌లో చివరి ప్రచారాన్ని నిర్వహించారు. గ్రీన్ బే నగరంలో ట్రంప్ ర్యాలీ నిర్వహించారు. హారిస్, జో బైడెన్‌పై తీవ్రమైన విమర్శలు చేశారు. ఇటీవల, ఓ కార్యక్రమంలో ట్రంప్‌కు మద్దతు ఇచ్చేవారిని బైడెన్ చెత్తతో పోల్చగా.. ట్రంప్, ఆ మాటనే తీసుకొని ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు. 250 మిలియన్ల అమెరికన్లను హారిస్, బైడెన్‌లు చెత్తలా చూస్తున్నారనీ.. ట్రంప్ మద్దతుదారులు బైడెన్, కమల కంటే చాలా ఎక్కువ నాణ్యత గల మనుషులని అన్నారు. అమెరికన్లను ప్రేమించని వారు, అమెరికాను నడిపించలేరని అన్నారు.
Also Read: చెత్త ట్రక్కులో ట్రంప్.. బైడెన్ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్
2024 ఎన్నికలలో కీలకమైన సమస్యల్లో ఒకటి అబార్షన్ హక్కు
ఇక, రాజధాని నగరం మాడిసన్‌లో, హారిస్ తన ముగింపు ప్రచార ర్యాలీని ట్రంప్‌పై వ్యక్తిగతంగా ఎలాంటి పంచ్‌లు వేయలేదు. బదులుగా, ట్రంప్ అమెరికన్లను విభజిస్తున్నారంటూ మండిపడ్డారు. యునైటెడ్ స్టేట్స్‌ను ట్రంప్ ముప్పు నుండి రక్షించాలని పిలుపునిచ్చారు. అమెరికన్ల మధ్య విభేదాలు సృష్టించి, ప్రజలను భయపెట్టేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. డొనాల్డ్ ట్రంప్ పేజీని తిప్పియ కొత్త అమెరికాను ఐక్యం చేయడానికి ఈ ఎన్నికలు మంచి అవకాశమన్నారు.
2024 ఎన్నికలలో కీలకమైన సమస్యల్లో ఒకటైన అబార్షన్, పునరుత్పత్తి హక్కులకు సంబంధించి ట్రంప్‌పై దాడిని కొనసాగించారు. 50 సంవత్సరాల క్రితం అబార్షన్‌ను చట్టబద్ధం చేసిన ఫెడరల్ చట్టాన్ని రద్దు చేయాలనే ఏకైక ఉద్దేశ్యంతో ట్రంప్ మొదటి పదవీకాలంలో ముగ్గురు సంప్రదాయవాద రిపబ్లికన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఎన్నుకున్నారంటూ ట్రంప్‌పై ఆరోపణలు చేశారు. తమ శరీరాలపై మహిళలకు ఎలాంటి హక్కులుండాలో ప్రభుత్వం చెప్పకూడదని హారిస్ తెలిపారు. మరోసారి ట్రంప్ వస్తే దేశవ్యాప్తంగా అబార్షన్‌ను నిషేధిస్తాడని అన్నారు.
జాతీయ సర్వేల సగటును బట్టి ట్రంప్ కంటే కమల ముందంజ
ఇంత హీట్ రేపుతున్న అమెరికా ఎన్నికల్లో ఓటర్లు, తొలి మహిళా అధ్యక్షురాలిని ఎన్నుకుంటుంరా? లేదంటే, రెండోసారి ట్రంప్‌కు అవకాశమిస్తుంరా? అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎన్నికల రోజు సమీపిస్తున్న సమయంలో సర్వేల అంచనాలు, వైట్‌హౌస్ రేసుపై వీరి ప్రచారం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అనే టెన్షన్ మరింత పెరిగింది. జాతీయ సర్వేల సగటును గమనిస్తే ట్రంప్ కంటే కమలా హారిస్ కాస్త ముందంజలో ఉన్నారు. జూలై చివర్లో అధ్యక్ష పదవి రేసులో హారిస్ అడుగుపెట్టినప్పటి నుంచి ఆమెదే పైచేయిగా ఉంది. తాజా గణాంకాల్లో కాస్త మార్పు కనిపించినప్పటికీ, చాలా తక్కువ మార్జిన్‌తో హారిస్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన తొలి వారాల్లో హారిస్ ప్రచారంలో గట్టి ప్రభావమే చూపించారు. ఆగస్టు చివరి నాటికి దాదాపు 4 శాతం పాయింట్ల ఆధిక్యతను సాధించారు. ఇక, సెప్టెంబర్ 10న ఇద్దరి మధ్య డిబేట్ తర్వాత కూడా ఈ నంబర్లలో పెద్ద తేడా కనిపించలేదు. అయితే, గత కొన్నిరోజులుగా వీరిద్దరి మధ్య అంతరం గణనీయంగా తగ్గుతూ వచ్చింది.
ఎన్నికల్లో స్వింగ్ స్టేట్స్‌గా పరిగణిస్తున్న 7 రాష్ట్రాలు
అయితే, ఒక అభ్యర్థికి దేశవ్యాప్తంగా ఎంత ప్రజాదరణ ఉందో తెలుసుకోవడానికి జాతీయ సర్వేలు ఒక గైడ్‌లా ఉపయోగపడతాయి తప్ప.. ఎన్నికల ఫలితాలను అంచనా వేయడానికి ఈ సర్వే ఫలితాలే ప్రామాణికంగా తీసుకోలేము. ఎందుకంటే, అమెరికా ఎన్నికల్లో ఎలక్టోరల్ కాలేజ్ పద్ధతి కీలకంగా ఉంటుంది. ఇందులో భాగంగా యూఎస్‌లో ప్రతి రాష్ట్రానికి దాని జనాభా ఆధారంగా ఓట్ల సంఖ్య ఉంటుంది. ఎలక్టోరల్ కాలేజీలో 538 ఓట్లు ఉంటాయి. వాటిలో 270 ఓట్లు సాధించిన అభ్యర్థి విజయం సాధిస్తారు. అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. వాటిలో చాలా రాష్ట్రాలు ఎక్కువగా ఒకే పార్టీవైపు మొగ్గుచూపుతాయి. దీనితో ఇద్దరు అభ్యర్థులూ గెలిచే అవకాశాలు ఉన్న రాష్ట్రాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. రెండు పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా పోటీపడే అవకాశం ఉన్న ఈ రాష్ట్రాలను బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ లేదా స్వింగ్ స్టేట్స్ అంటారు. సర్వేల సగటు ఆధారంగా చూస్తే.. ఈ ఎన్నికల్లో స్వింగ్ స్టేట్స్‌గా పరిగణిస్తున్న 7 రాష్ట్రాల్లో పోటీ రసవత్తరంగా ఉంది. ఏ ఒక్క అభ్యర్థికి కూడా నిర్ణయాత్మక ఆధిక్యత కనిపించట్లేదు.