Telangana BJP Leaders: ఏమన్నా అంటే అన్నారు అంటారు కానీ.. ఆ పార్టీలో ఎప్పుడూ పంచాయితీలే. ఆ నేత వస్తే ఈయన ఉండరు.. ఈయన వెళ్తే ఆయన మాట్లాడరు. ఇది ఆ పార్టీలో నెలకొన్న ప్రజెంట్ పొలిటికల్ పంచాయితీ. అలాంటి పార్టీ ఇప్పుడు స్థానిక సంస్థలు, ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సిద్ధం అవుతోంది. సింగిల్ పాయింట్ ఎజెండానే ప్రధానాస్త్రంగా ఆ పార్టీ ముందుకెళ్లాలని డిసైడ్ అయిందట. హైడ్రా మొదలుకొని మొన్నటి ముత్యాలమ్మ టెంపుల్ ఘటన వరకు మైలేజ్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న ఆ పార్టీ ఎంచుకున్న బ్రహ్మాస్త్రం ఏంటి?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తై సంవత్సరం, పార్లమెంట్ ఎన్నికలు పూర్తై ఐదు నెలలు కావొస్తుంది. ఎన్నికలప్పుడు ప్రజాక్షేత్రంలో కనిపించిన కమలం పార్టీ నేతలు ఆ తర్వాత అడ్రస్ లేకుండా ఉన్నారట. నేతల మధ్య పంచాయితీలకే టైం సరిపోవడం లేదట.. అలాంటి వాళ్లు ప్రజాపోరాటాలకు ఏం టైమ్ ఇస్తారని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది. రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ పునరుజ్జీవం, హైడ్రా వంటి ప్రాజెక్ట్ లపై బీజేపీ పోరాటాలు పెద్దగా ఫలించలేదనే టాక్ ఆ పార్టీలోనే వినిపిస్తోంది.
ప్రజాపోరాటాల్లో ఆశించినంత స్థాయిలో మైలేజ్ రాకపోతుండటంతో ఆపార్టీలో అసంతృప్తి రాగాలు సైతం గట్టిగానే వినిపిస్తోన్నాయి. అందుకే ప్రజాపోరాటాలు కాదు.. హిందూత్వ ఎజెండాను నమ్ముకుందామంటోంది బీజేపీ. అందులో భాగంగానే రాష్ట్ర నాయకత్వంతో పాటు, ఢిల్లీ పెద్దలు సైతం హిందుత్వ ఎజెండానే కీలకమనే అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తోంది. హిందుత్వ ఎజెండాతోనే అడుగులు వేస్తే కచ్చితంగా వచ్చేకాలంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని కాషాయ వర్గాలు భావిస్తున్నాయి. అందులో భాగంగానే మొన్న జరిగిన ముత్యాలమ్మ ఎపిసోడ్ లో రచ్చరచ్చ చేయాలని ఆ పార్టీ నేతలు చూశారు.
పొలిటికల్ మైలేజ్ కోసం ముత్యాలమ్మ మాదిరి పంచాయితీలు సృష్టించడం కరెక్టేనా అనే బేసిక్ విషయాన్ని ఆ పార్టీ నేతలు మర్చిపోతున్నారు. నేతల మధ్య విభేదాలు కొనసాగుతుండగానే రాష్ట్రంలో త్వరలో జరిగే స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఎన్నికలకు కమలం పార్టీ పాచికలు వేయడం ప్రారంభించింది. త్వరలో ఖాళీ కానున్న రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల స్థానాలపైన కాషాయ పార్టీ ఫోకస్ చేస్తోంది. ప్రస్తుతం శాసనమండలిలో బీజేపీకి ఒక ఎమ్మెల్సీ మాత్రమే ఉంది. ఈనేపథ్యంలో త్వరలో జరగబోయో ఈ మూడు స్థానాల్లో ఎమ్మెల్సీలను కైవసం చేసుకుని బలం పెంచుకోవాలనే ప్లాన్ చేస్తోంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు నలుగురు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలకు టాస్క్ గా మారిందనే చెప్పవచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ర్ట బీజేపీ నాయకత్వం పెద్ద ఎత్తున ఓటర్ ఎన్‌రోల్మెంట్ చేయించాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది.
తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు మార్చి 29 తో ఖాళీ కానున్నాయి. ఇక త్వరలోనే స్థానిక ఎన్నికలకు సైతం గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అప్పటిలోగా ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు పూర్తి చేయడానికి ఎన్నికల కమిషన్ ప్రాసెస్ ప్రారంభించింది. త్వరలో ఓటర్ నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను కూడా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, అదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఖమ్మం,వరంగల్, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. దీంతో ఆశావహులంతా ఓటర్ నమోదుపై దృష్టి కేంద్రీకరించారు. ఎక్కువ సంఖ్యలో ఓటర్ నమోదు చేయించి ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఎవరికివారు ఊవ్విళ్లూరుతున్నారు.
Also Read: దేశాన్ని సంపన్నుల చేతిలో పెట్టారు.. ఎన్నికల ప్రచారంలో భట్టి విమర్శలు
వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిని TSUTF, PRTU ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించాయి. TSUTF నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ప్రాతినిథ్యం వహిస్తున్న అలుగుబెల్లి నర్సిరెడ్డినే మళ్లీ బరిలోకి దింపుతున్నట్లు ఆ సంఘం ప్రకటించింది. PRTU నుంచి శ్రీపాల్ రెడ్డిని ప్రకటించింది. ఈ స్థానంతో పాటు కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వంగా మహేందర్ రెడ్డిని ప్రకటించింది. కీలకమైన సంఘాలు ముందస్తుగానే తమ అభ్యర్థులను ప్రకటించుకుని సమరానికి సై అంటూ సిగ్నల్ ఇచ్చుకున్నాయి. బీజేపీ అనుబంధ ఉపాధ్యాయ సంఘమైన తపస్ ఇంకా తమ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో తలమునకలవుతోంది.
ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ.. ఎన్నికలు జరిగే జిల్లాలకు ఎమ్మెల్సీ కమిటీలను నియమించింది. అభ్యర్థులపై అభిప్రాయ సేకరణకు ముగ్గురితో కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీలో మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ప్రేమ్ సింగ్ రాథోడ్, మరో నేత ప్రేమ్ రాజ్ యాదవ్ ఉన్నారు. ఈ కమిటి ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలతో చర్చలు జరుపుతోంది. ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, ఆయా జిల్లా నేతల అభిప్రాయాలు తీసుకొని పార్టీ నాయకత్వానికి రిపోర్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆ రిపోర్ట్ ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉండనుంది.
మెదక్, నిజామాబాద్, కరీంనగర్, అదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ బీజేపీకి నలుగురు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, గోడం నగేష్ లకు ఈ ఎన్నికలు సవాల్ గా మారాయి. ఆ పార్టీ అక్కడ గెలవాలి అంటే ఓటర్ నమోదు నుండే ప్రత్యేక దృష్టి పెట్టాలని, పార్టీ నేతలు భావిస్తున్నారు. అంతేకాదు అభ్యర్థులను ముందే ప్రకటించాలనే డిమాండ్ పార్టీలో డిమాండ్ బలంగా వినిపిస్తోంది. గత ఎన్నికల మాదిరి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక చివరి క్షణంలో అభ్యర్థులను ప్రకటిస్తే ఫలితం ఉండదని పార్టీ శ్రేణులు చెప్పుకొస్తున్నాయి. అయితే ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా AVN రెడ్డి కొనసాగుతున్నారు.
ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి TSUTF, PRTU అభ్యర్థులను ప్రకటించడంతో బీజేపీ అప్రమత్తమైంది. ఎంపీ ధర్మపురి అర్వింద్ నేతృత్వంలో రాష్ట్ర నాయకత్వం కమిటీని నియమించింది. అందులో ప్రధానంగా MLA పాల్వాయి హరీశ్ బాబు, ఎమ్మెల్సీ AVN రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, పార్టీ ప్రధాన కార్యదర్శులు దుగ్యాల ప్రదీప్ కుమార్, కాసం వెంకటేశ్వర్లు ఉన్నారు. అంతేకాదు ఇప్పటికే ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం కూడా ఆ పార్టీ నిర్వహించింది. ఎన్నికలు జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో రెండు బీజేపీ బలంగా ఉన్న చోటనే ఉండటంతో ఈ ఎన్నికలు కమలం పార్టీకి సవాల్ గా మారాయి. ఇక ఈ ఎన్నికల్లో పలువురు పార్టీ నేతలు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే తమ సన్నిహితుల వద్ద తమ తమ అభిప్రాయాలను బయటపెట్టుకుంటున్నారు.
ఒకవైపు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతల తీరు మాత్రం అస్సలు మారడం లేదనే టాక్ వినిపిస్తోంది. గత ఎన్నికల్లో అనుకున్న లక్ష్యాన్ని చేదించడంలో విఫలమయినప్పటికి కాషాయ పార్టీ నేతలు తమ తమ వైఖరినీ మార్చుకోలేకపోతున్నారనే చర్చ సైతం ఆ పార్టీలో జరుగుతోంది. ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో పాటు గత బీఆర్ఎస్ వైఫల్యాలపై పోరాటం చేయాలని అధిష్టానం రాష్ట్ర నాయకత్వానికి మార్గనిర్దేశం చేసినప్పటికీ బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆ దిశగా అడగులు వేయకుండా తలోదారి అన్నట్లు వ్యవహరించడం పట్ల ఆ పార్టీ శ్రేణుల్లో అసహనం వ్యక్తమవుతోంది. హిందుత్వ సిద్ధాంతం కలిగిన జాతీయ పార్టీలో సఖ్యత లేకుండా గ్రూప్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిందనే చెప్పుకోవచ్చు. కేవలం హిందుత్వ ముసుగును రెచ్చ గొట్టి వచ్చే స్థానిక సంస్థలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మైలేజ్ పెంచుకోవాలని చూస్తున్న పరివారుల స్కెచ్ ఫలిస్తుందా లేదా అనేది చూడాలి.