KTR On KCR Health : బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంత వరకు ప్రజల ముందుకు రాలేదు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత నుంచి కేసీఆర్ గురించి ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఎన్నిసార్లు అడిగినా సరైన జవాబు దొరకలేదు. ఈ క్రమంలోనే కేసీఆర్ ఆరోగ్యంపై వస్తున్న వదంతులపై.. ఆయన కుమారుడు, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని, త్వరలోనే ప్రజల మధ్య కు వస్తారని వెల్లడించారు. తాను, తమ పార్టీ నేతలు రోజూ కేసీఆర్ మార్గనిర్దేశంలోనే పనిచేస్తున్నామని వెల్లడించారు.
ఎన్నికల్లో ఫలితాలు వెలువడిన తర్వాత రోజుల వ్యవధిలోనే కేసీఆర్ ఇంట్లో కాలు జారి కిందపడడంతో కాలు విరిగింది. యశోధ ఆసుపత్రిలో చికిత్స పొందిన కేసీఆర్ కు..తొంటి భాగంలో ఆపరేషన్ నిర్వహించారు. ఆ తర్వాత రెండు నెలలకు కానీ కేసీఆర్ బయటకు రాలేదు. ఎమ్మెల్యేగా గెలిచి కూడా ప్రమాణ స్వీకారం చేసేందుకు అసెంబ్లీకి రాలేదు. ప్రతిపక్ష నేతగా ఎన్నికైన రెండు నెలలకు కేసీఆర్ బయటకు వచ్చారు. మళ్లీ అప్పటి నుంచి పెద్దగా ప్రజలకు కనిపించింది లేదు. దాంతో.. వివిధ సోషల్ మీడియాల్లో కేసీఆర్ ఆరోగ్యంపై వదంతులు వస్తూనే ఉన్నాయి. వాటిపై ఎవరూ పెద్దగా స్పందించలేదు. తాజాగా.. కేసీఆర్ ఆరోగ్యం గురించి కేటీఆర్ ఇప్పుడు స్పందించారు.
కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో ట్విట్టర్ లో చాలా యాక్టీవ్ గా ఉండేవారు. అప్పట్లో నిత్యం ప్రజలతో ట్విట్టర్ వేదికగా ఇంటరాక్ట్ అవుతుండే వాడు. “# ఆస్క్ కేటీఆర్” పేరుతో నిత్యం అభిమానులకు అందుబాటులో ఉండే కేటీఆర్.. వారడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుండే వారు. కానీ.. ఏడాది నుంచి ఆయన ట్విట్టర్ లో నేరుగా అందుబాటులో లేరు. తాజాగా.. అక్టోబర్ 30న మళ్లీ “# ఆస్క్ కేటీఆర్” అంటూ ప్రజల ముందుకు వచ్చారు. ఈ సమయంలో అభిమానులు, వివిధ వర్గాల వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అందులో ఓ యూజర్ కేసీఆర్ ఆరోగ్యం గురించి ప్రశ్నించగా.. కేసీఆర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారంటూ కేటీఆర్ బదులిచ్చారు.
తన అధినేత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తున్నారంటూ చెప్పుకొచ్చిన కేటీఆర్.. బాధ్యత గల ప్రతిపక్షంగా కావాలనే ప్రభుత్వానికి సమయం ఇస్తున్నామన్నారు. తమ నాయకుడు కేసీఆర్ 2025 తర్వాత ప్రజల్లోనికి వస్తారని వెల్లడించారు. తప్పకుండా ప్రజలు తమకు అప్పగించిన బాధ్యతల్ని నెరవేరుస్తామన్న కేటీఆర్.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు పోరాడతామని ప్రకటించారు.
ఇటీవల కాలంలో అనేక అంశాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు ఆరోపణలు చేసుకున్నారు. ఆయా సందర్భాల్లో కేటీఆర్, హరీష్ రావులే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ముందుండి పోరాటాలు నడిపారు. బీఆర్ఎస్ పార్టీకి మంచి అసెంబ్లీ స్థానాలు కట్టబెట్టిన హైదరాబాద్ నగరం చుట్టూ అనేక సమస్యలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తలపడుతున్నా.. ఇంత వరకు కేసీఆర్ బయటకు వచ్చింది లేదు. రాష్ట్రంలోని ఏ సమస్యపైనా స్పందించలేదు. ఈ కారణంగానే.. కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉంది.? పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకువస్తారా.? అంటూ అనేక సందేహాలున్నాయి. వాటికి కేటీఆర్ ట్విట్టర్ లో డైరెక్ట్ ఇంటరాక్షన్ సందర్భంగా వివరణ ఇచ్చారు.