Taliban New Rule : “దేశంలోని ఆడవాళ్లు బిగ్గరగా మాట్లాడకూడదు, ప్రార్థనలు చేయకూడదు. ఒకరితో ఒకరు మాట్లాడినా పాపమే.. అందుకే దేశంలో ఆడవాళ్లు మాటలు వినిపించకుండా నిషేధిస్తున్నాం” ఇది అప్ఘనిస్థాన్ లో తాలిబన్లు ఆడవాళ్లకు విధించిన కొత్త నిషేధం. 2021లో అధికారం చేజిక్కించుకున్న తాలిబన్లు…అక్కడి ఆడవాళ్లు, చిన్నారులపై కఠిన ఆంక్షలు విధిస్తూ నిత్య నరకం చూపిస్తున్నారు. వారి ఛాందస విధానాలతో మహిళలను బానిసలకన్నా హీనంగా చూస్తూ.. వారిపై ఎప్పటికప్పుడు సరికొత్త ఆంక్షలు విధిస్తూ, వేధిస్తున్నారు. తాజాగా ఆడవాళ్ల మాటలు వినిపించవద్దని చేసిన నిషేధంపై అంతర్జాతీయంగా అనేక విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
అప్ఘాన్ లో అంతర్గత భద్రతా పరిస్థితులు దారుణంగా ఉన్నా, దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతున్నా.. అవేవి పట్టనట్లు ఆడవాళ్ల గొంతు వినిపించవద్దు అంటూ హుకం జారీ చేశారు తాలిబన్ నేతలు. ఈ నిబంధనల ప్రకారం.. దేశంలోని మహిళలు బిగ్గరగా ప్రార్థనలు చేయకూడదు, వేరే మహిళల ముందు ఖురాన్ చదవకూడదు. పురుషులతో కాదు.. మహిళలతో మహిళలు సైతం మాట్లాడవద్దని.. అఫ్ఘాన్ తాలిబన్ ధార్మిక మంత్రిత్వ శాఖ మంత్రి ఖలీద్ హనాఫీ స్పష్టం చేశారు. దేశంలో మహిళలు వేరే వారికి వినిపించేలా మాట్లాడడాన్ని నిషేధించినట్లు వెల్లడించారు.
కేవలం మాట్లాడడమే కాదు.. దైవాన్ని స్మరించుకోవడం, దేవున్ని గుర్తు చేసుకునే మాటలు, “అల్లాహు అక్బర్”, “సుబానల్హా” వంటి దైవ సంబంధ మాటలు సైతం ఆడవారి నోటి నుంచి రావద్దని సూచించారు. ఆ దేశ ధార్మిక శాఖ మంత్రి చెప్పిన సమాచారం మేరకు.. మహిళల గొంతు అవ్రాహ్, అంటే వారి విశ్వాసాల ప్రకారం తప్పనిసరిగా కప్పి ఉంచుకునేది, బహిరంగంగా వినకూడదనిది, ఇతర మహిళలలు కూడా వినకూడనిది అని అర్థం. అందుకే ప్రస్తుత నిషేధం అమలు చేస్తున్నట్లు ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
దీనిపై మానవ హక్కుల కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒక మహిళ ఇంకొకరితో మాట్లాడడాన్ని నిషేధించడం దారణమంటున్నారు. ఇతరులతో మాట్లాడకుండా ఎలా ఉండగలరని ప్రశ్నిస్తున్నారు. కనీసం.. మహిళలు, మహిళలతో కూడా మాట్లాడవద్దంటే ఎలా అంటున్నారు. మహిళలుగా తాలిబన్ల పాలనలో ఉండడం చాలా బాధాకరమని.. అక్కడి మహిళలు కొంతమంది వ్యాఖ్యానించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. తాలిబన్లు మహిళలను నిత్యం ఏదో ఓ తీరుగా హింసిస్తున్నారని, మానసికంగా బాధలు పెడుతున్నారని వారు వాపోయారు. అసలు తమపై ఈ నిషేధాలు ఎందుకని, ఇవ్వన్ని ఎవరు చెప్పారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి దారుణమైన నిబంధనలు చేయమని ఏ దేవుడూ చెప్పడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు.. ప్రభుత్వ చట్టాలు, నిబంధనలు, నిషేధాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుు దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ప్రజా రవాణాను ఉపయోగించడం, సంగీతం, షేవింగ్ చేసుకోవడం సహా.. అనేక అంశాలపై ఆంక్షలు విధిస్తూ వస్తున్న తాలిబన్లు.. ఆఫ్ఘన్లు చట్టాలను ఉల్లంఘించారని తేలితే కఠిన శిక్షలను అమలు చేస్తున్నారు. ఇటీవల ఓ చిన్నారి.. ప్రార్థనల సమయంలో సంగీతం విన్నాడని, అందరి సమక్షంలో బహిరంగంగా తల నరికారు.
అఫ్ఘాన్ ధార్మిక మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు.. ఇక్కడి మహిళలు ఇతరుల్ని ఆకర్షించకూడదు. అందుకే.. వారు ఎల్లప్పుడూ శరీరాన్ని వదులుగా ఉండే దుస్తులతో కప్పేసుకోవాలి. వారి ముఖం సైతం కనిపించేందుకు వీలు లేదు, చివరికి.. కళ్లు కూడా కనిపించకూడదు. అందుకే.. కళ్ల దగ్గర జాలీ వంటి అడ్డు ఉండాలని తాలిబన్లు నిబంధన విధించారు. అఫ్ఘాన్ లో స్త్రీలు రక్తసంబంధికులు, భర్తను తప్పా మిగతా ఏ పురుషుడిని చూడకూడదనే నిబంధన అమల్లో ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో.. అవివాహితులైన ఆఫ్ఘన్ మహిళలు భర్త, కుటుంబ సభ్యుల్లోని మగవారి తోడు లేకుండా బయటకు వెళ్లొద్దని సూచించింది. కాదని ఎవరైనా బయట కనిపిస్తే.. బహిరంగంగా కొరడా శిక్షలు విధిస్తోంది.
Also Read : ‘ఇజ్రాయెల్‌తో సంధికి మేము రెడీ.. కానీ’.. హిజ్బుల్లా కొత్త చీఫ్ ప్రకటన
వైద్య రంగంలో సేవలందించే యువతులు.. త్వరగా పెళ్లి చేసుకోవాలని, లేదంటే పని చేయొద్దని హెచ్చరించిన తాలిబన్లు.. మరింత దారుణంగా.. ఆరోగ్య సేవల్లో పనిచేసే మహిళలు, మగవారైన రోగులను తాకవద్దని, వారి వద్దకు వెళ్లవద్దనే నిబంధన విధించింది. దేశంలో షరియా చట్టాలను అమలుచేస్తున్నట్లు చెబుతున్న తాలిబన్లు.. తమ సిద్ధాంతాల మేరకే ఇలాంటి నిబంధనల్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. తాలిబన్ల ఈ నిబంధనలపై అంతర్జాతీయ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.