Vettaiyan Movie OTT: కరోనా వచ్చినప్పటి నుంచి ఓటీటీ లకు మంచి డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఎంత పెద్ద సినిమా అయినా సరే థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాలు లేదా 10 వారాలలోపే ఓటీటీ లోకి రావాల్సిందే. అటు సినిమా మేకర్స్ కూడా ఓటీటీ డీల్ కుదుర్చుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక అలా థియేటర్లకు వెళ్లి సినిమా చూడలేని వారు హాయిగా కుటుంబ సభ్యులతో ఇంట్లోనే ఓటీటీ సభ్యత్వం తీసుకొని , కుటుంబ సభ్యులతో సినిమాని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఓటీటీ ప్రియులను ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు పెద్దపెద్ద హీరోల సినిమాలు కూడా సిద్ధమవుతూ ఉంటాయి.
వేట్టయాన్ తో రజినీకాంత్ భారీ సక్సెస్..
ఈ క్రమంలోనే సూపర్ స్టార్ హీరో రజినీకాంత్ (Rajinikanth) హీరోగా టీ.జే. జ్ఞానవేల్ (TJ.Gnanavel) దర్శకత్వంలో వచ్చిన వేట్టయాన్(Vettaiyan )సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 10న విడుదలైన ఈ సినిమా పోలీస్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కింది. ఇందులో ఫహద్ ఫాజిల్, అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఒకరకంగా చెప్పాలి అంటే, రజినీకాంత్ అనారోగ్య సమస్యల కారణంగా హాస్పిటల్ పాలవడంతో ఈ సినిమాకి పెద్దగా ప్రమోషన్స్ చేపట్టలేదు. అయినా సరే కంటెంట్ బాగుండడంతో ప్రేక్షకులు సినిమాకు నీరాజనాలు పట్టారు. మొదట కొద్ది రోజులు సినిమాకి కలెక్షన్లు సరిగా రాకపోయినా ఆ తర్వాత పుంజుకొని మరీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
నవంబర్ 8 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..
ఇకపోతే థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కి సిద్ధమవుతోంది. నవంబర్ 8వ తేదీ నుంచి ఈ సినిమాని చూడవచ్చు.ఇకపోతే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయనున్నారు.
వేట్టయాన్ సినిమా కథ..
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అథియన్ పాత్రలో రజనీకాంత్ ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా నటించారు. ఈయనకి నిజాయితీతో పాటు ధైర్యం కూడా ఎక్కువే. న్యాయం కోసం చట్టాన్ని కూడా తన చేతిలోకి తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడని వ్యక్తి. అదే సమయంలో అథియన్ ను శరణ్య అనే ఒక స్కూల్ టీచర్ హత్య కలిచివేస్తుంది. ఈ హత్యకి పాల్పడిన నిందితుడు తప్పించుకోవడంతో అటు ప్రభుత్వం ఇటు పోలీసు అధికారుల పైన ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడిలో హీరో ఏం చేశారు. ముఖ్యంగా ఈ కేసును రజినీకాంత్ రంగంలోకి దిగి ఎలా హ్యాండిల్ చేశారు..? అసలు ఈ హత్య ఎందుకు చేశారు ?ఎవరు చేశారు? అనే కోణంలో సినిమాను తెరకెక్కించారు.
రజనీకాంత్ తదుపరి చిత్రాలు..
రజినీకాంత్ విషయానికి వస్తే.. ప్రస్తుతం కూలీ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున కూడా కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రస్తుతం శరవేగంగా జరుగుతోందని, త్వరలోనే తెరపైకి వచ్చే అవకాశం కూడా ఉందని సమాచారం. ఏది ఏమైనా ఏడు పదుల వయసులో కూడా రజనీకాంత్ వరుస సినిమాలు చేస్తూ ఆడియన్స్ ను విపరీతంగా ఎంటర్టైన్ చేస్తున్నారు.