Tips For Eyelashes: పొడవాటి కనురెప్పలు ఉంటే కళ్ల అందం మరింత పెరుగుతుంది. చాలా మంది పొడవాటి కనురెప్పల కోసం మార్కెట్‌లో ఆర్టిఫీషియల్ ఐలాషెస్ కొనుగోలు చేసి ఉపయోగిస్తారు. కానీ అవి సహజంగా కనిపించవు. అందుకే.. కనురెప్పల వెంట్రుకలను పొడవుగా, మందంగా చేసుకోవడం కోసం కొన్ని చిట్కాలను పాటించడం తప్పనిసరి.
కళ్ళు మన ముఖంలో అత్యంత ముఖ్యమైనవి. కను రెప్పల వెంట్రుకలు మందంగా, పొడవుగా ఉంటే, అప్పుడు కళ్ళు చాలా అందంగా కనిపిస్తాయి. అయితే, కొన్నిసార్లు దుమ్ము, కాలుష్యం, రసాయనాల కారణంగా, ఈ వెంట్రుకలు బలహీనంగా మారి విరిగిపోతాయి. ఇదిలా ఉంటే కొంతమందికి కనురెప్పలు పలచగా ఉంటాయి. ఈ కారణంగానే చాలా మంది అమ్మాయిలు కృత్రిమ కనురెప్పలను ఉపయోగిస్తారు.
కళ్ల అందాన్ని కాపాడుకోవడానికి , కను రెప్పల వెంట్రుకలను ఒత్తుగా చేయడానికి కొన్ని చిట్కాలు పాటించాలి. ఆ చిట్కాలేవో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆముదం: కనురెప్పలకు ఆముదం చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్-ఇ , ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. అందువల్ల, ప్రతి రాత్రి నిద్రపోయే ముందు, కనురెప్పలపై ఆముదం నూనెను సున్నితంగా రాయండి . ఇది వెంట్రుకల మూలాలను బలపరుస్తుంది. అంతే కాకుండా వాటి పెరుగుదలను వేగవంతం చేస్తుంది.
కొబ్బరి నూనె: కొబ్బరి నూనెలో యాంటీఆక్సిడెంట్లు, కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి వెంట్రుకలను పోషించి వాటిని మందంగా చేస్తాయి. అందుకే రోజు నిద్రపోయే ముందు కొద్ది మొత్తంలో కొబ్బరినూనెను కనురెప్పలపై రాసుకుని మృదువుగా మసాజ్ చేయాలి. ఇది కనురెప్పలకు తేమను అందించి, బాగా పెరిగేలా చేస్తాయి.
విటమిన్ ఇ ఆయిల్ : విటమిన్ ఇ ఆయిల్ కనురెప్పల కణాలకు పుష్కలమైన పోషణను అందిస్తుంది. అంతే కాకుండా వాటిని పొడవుగా , మందంగా చేయడంలో సహాయపడుతుంది. అందువల్ల, మీరు విటమిన్ ఇ క్యాప్సూల్స్ నుండి నూనెను తీసి మీ వెంట్రుకలపై అప్లై చేయవచ్చు. ఇది కనురెప్పల పగుళ్లను తగ్గిస్తుంది. వాటిని దట్టంగా చేస్తుంది.
Also Read: ఫేస్ క్రీములు అవసరమే లేదు.. ఈ స్క్రబ్‌లతో మీ అందం రెట్టింపు
గ్రీన్ టీ: గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కనురెప్పల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.గ్రీన్ టీలో కాస్త దూదిని ముంచి మీ కనురెప్పల మీద రాయండి . ఇది కనురెప్పల మూలాలను బలపరుస్తుంది. అంతే కాకుండా కను రెప్పలు బాగా పెరిగేలా చేస్తుంది. తరుచుగా ఇవి వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
అలోవెరా జెల్: అలోవెరా జెల్‌లో విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి వెంట్రుకలను తేమగా , పొడవుగా , మందంగా చేస్తాయి. అందుకే రాత్రి పడుకునే ముందు కొద్దిగా విటమిన్ ఇ నూనెలో తాజా కలబంద జెల్ కలిపి కనురెప్పల మీద రాసి ఉదయాన్నే కడిగేయాలి. ఇది కనురెప్పల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.