North Korea – US : ప్రపంచమంతా యుద్ధ భయాందోళనల్లో ఉన్న సమయంలో ఉత్తర కొరియా మరో దుందుడుకు చర్యకు పాల్పడింది. తన శక్తిసామర్థ్యాలు చాటుతు.. ఓ ఖండాతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్.. నేరుగా ప్రయోగ క్షేత్రానికే వెళ్లి ప్రయోగాన్ని పరిశీలించారు. ఈ ప్రయోగం ద్వారా తమ శత్రు దేశాలకు తమ అధ్యక్షుడు గట్టి హెచ్చరికలు పంపాడని ఉత్తర కొరియా అధికారిక మీడియా వెల్లడించగా, ఇటీవల కాలంలో తమ దేశాన్ని బెదిరించేందుకు ప్రయత్నిస్తున్న వారికి ఇదే తన సందేశమంటూ కిమ్ వ్యాఖ్యానించినట్లు పేర్కొంది.
దక్షిణ కొరియాతో నిత్యం యుద్ధానికి కాలు దువ్వే ఉత్తర కొరియా.. తన తూర్పు సముద్ర జలాల వైపు దీనిని ప్రయోగించినట్లు వెల్లడించింది. కాగా.. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7:10 గంటలకు ఈ ఖండాతర క్షిపణి ప్రయోగం జరిగినట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ (JCS) తెలిపింది. ఇందులో తన దీర్ఘ-శ్రేణి క్షిపణుల కోసం కొత్తగా అభివృద్ధి చేసిన ఘన-ఇంధన బూస్టర్ పనితీరును పరిశీలించినట్లు వెల్లడించింది. ఇప్పటికే.. ఉత్తర కొరియా అనేక సార్లు క్షిపణి ప్రయోగాలు చేసింది, వాటిలో ఇది అత్యధిక ప్రయాణ సమయాన్ని రికార్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని దక్షిణ కొరియా, జపాన్ దేశాల రక్షణ దళాలు రికార్టు చేశాయి. ప్రస్తుత అంతర్జాతీయ యుద్ధ సంక్షోభ సమయంలో ఉత్తర కొరియా తాజా ప్రయోగం.. ఈ ప్రాంతంలో యుద్ధ భయాల్ని మరింత పెంచేస్తోంది.
జపాన్‌లోని ఉత్తర హక్కైడో ప్రాంతానికి పశ్చిమాన జపాన్‌లోని ఓకుషిరి ద్వీపానికి పశ్చిమాన 300 కిమీ దూరంలో ఇది లక్షాన్ని ఢీకొట్టినట్లు వెల్లడించిన పొరుగు దేశాలు.. ప్యోంగ్యాంగ్ గత క్షిపణి పరీక్షల కంటే ఎక్కువ సమయం ప్రయాణించిందని తెలిపాయి. దీని ప్రయాణ సమయం, ప్రయాణ తీరులను పరిశీలించిన తర్వాత ఇది గత ఖండాతర క్షిపణుల కంటే భిన్నమైనదిగా భావిస్తున్నట్లు జపాన్ అధికారులు వెల్లడించారు.
ఉత్తర కొరియా ప్రయోగించిన ఈ క్షిపణిని లోఫ్టెడ్ ట్రాజెక్టరీ కేటగిరికి చెందిందిగా గుర్తించారు. అంటే క్షిపణిని నిలువుగా ప్రయోగించారు. దీంతో.. క్షిపణి చాలా ఎత్తుకు ప్రయాణించి అవతలి వైపు కిందకు పడుతుంది. ఈ కారణంగా.. ప్రయోగ స్థలం నుంచి క్షిపణులు ఢీకొట్టిన దూరం తక్కువగా ఉంటుంది. అయితే.. ఈ ప్రయోగం ద్వారా భూ వాతావరణంలోకి ప్రవేశించిన వార్ హెడ్.. ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుందో అర్థం చేసుకునేందుకు ఉత్తర కొరియా ప్రయత్నించినట్లుగా దక్షిణ కొరియా రక్షణ వర్గాలు అనుమానిస్తున్నాయి.
ఈ క్షిపణి ప్రయాణాన్ని సునిశితంగా ట్రాక్ చేసిన దక్షిణ కొరియా, జపాన్ రక్షణ వర్గాలు.. ఇది దాదాపు 87 నిమిషాల సేపు ప్రయాణించిందని గుర్తించారు. గతంలో.. డిసెంబర్ 2023న ప్రయోగించిన ఓ క్షిపణి 73 నిమిషాలు ప్రయాణించగా.. ఆ రికార్డ్ ను ఇది అధిగమించినట్లు వెల్లడించారు. ఈ ఖండాతర క్షిపణి 7 వేల కిమీ ఎత్తుకు చేరుకోగా, 1,000 కిమీ దూరం ప్రయాణించినట్లు రికార్డ్ అయ్యింది. దీని జపాన్ ప్రభుత్వం ICBM-తరగతి క్షిపణిగా పేర్కొంది. ఇటీవలే ఉత్తర కొరియా ఏడో సారి అణు పరీక్షలు చేసేందుకు సన్నాహాలు చేస్తోందని, వీటి లక్ష్యం అమెరికానే అని సైనికాధికారులు అనుమానిస్తున్న వేళ.. ఈ ప్రయోగం జరిగింది. కాగా.. ఐక్యరాజ్య సమితి అనేక అంక్షలను ఈ ప్రయోగం దిక్కరించిందని, ఆ ప్రాంతంలో శాంతియుత వాతావరణానికి ఆటంకం కలిగించిదని అమెరికా చట్టసభ సభ్యులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
ఉక్రెయిన్‌పై యుద్ధానికి మద్దతుగా రష్యాకు ఉత్తర కొరియా సైన్యాన్ని పంపడంపై ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో.. ప్రపంచ దేశాలను మరింత ఆందోళన కలిగించేలా ఈ ప్రయోగం జరిగింది. ఇప్పటికే.. 11 వేల ట్రాప్ లను రష్యాకు పంపించిన ఉత్తర కొరియా, వారిలో 3 వేల మంది ఇప్పటికే.. యుద్ధ క్షేత్రానికి చాలా దగ్గరగా వెళ్లినట్లు అనుమానాలున్నాయి.
ఈ ప్రయోగ ఫలితాల్ని రష్యా సాయంతో విశ్లేషించాలని కొరియా భావిస్తున్నట్లుగా ప్రపంచ దేశాల రక్షణ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. రష్యా ఆధునిక సాంకేతికతలు వినియోగించుకుని.. ప్రస్తుత బూస్టర్ పనితీరును మరింత మెరుగ్గా తయారు చేసేందుకు ప్రయత్నించే అవకాశాలున్నట్లు చెబుతున్నాయి.