Eluru News: టపాసులతో వెళ్తున్న బైక్ అదుపుతప్పి కింద పడగా, టపాసులు పేలిన ఘటనలో ఒకరు మృతిచెందగా, మరికొందరికి తీవ్ర గాయాలైన ఘటన దీపావళి పండుగ రోజే జరిగింది. ఈ ఘటన ఏపీలోని ఏలూరులో గురువారం జరగగా, ఒకరు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఏలూరుకు చెందిన సుధాకర్ అనే వ్యక్తి మరొకరితో కలిసి, హోండా యాక్టివా వాహనంపై ఉల్లిపాయ బాంబుల బస్తాను తీసుకువెళ్తున్నారు. అయితే ఏలూరులోని తూర్పు వీధి గంగానమ్మ గుడి వద్దకు రాగానే రహదారిపై గల గుంతలను గమనించి, బైక్ స్పీడును నియంత్రించే క్రమంలోనే అదుపు తప్పింది. దీనితో బైక్ పై తీసుకెళ్తున్న ఉల్లిపాయ బాంబుల బస్తా బలంగా నేలపై పడడంతో, ఒక్కసారిగా టపాసులు పేలాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతం లో దట్టమైన పొగ, భీకర శబ్దాలు దద్దరిల్లాయి. అసలు ఏం జరిగిందో తెలుసుకునే లోగానే, బైక్ పై గల సుధాకర్ అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు, పోలీసులు వారిని ఏలూరు వైద్యశాలకు తరలించారు. ఈ ప్రమాదంలో బైక్ సైతం పూర్తిగా కాలిపోయింది.
Also Read: MLA Raja Singh: ఆ టపాసుల వెనుక కుట్ర.. అస్సలు కొనుగోలు చేయవద్దు.. ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరిక
ఈ ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, వన్ టౌన్ సీఐ సత్యనారాయణ, ఎస్సై మదీనా భాష ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. బైక్ పై దీపావళి సందర్భంగా టపాసులను తీసుకు వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరగడంతో, మృతి చెందిన సుధాకర్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దీపావళి పండుగ రోజే ఏలూరులో విషాదకర ఘటన జరగగా, స్థానికులు పెద్ద ఎత్తున ఘటనా స్థలికి చేరుకున్నారు.
కాగా టపాసులు కింద పడిన సమయంలో, సుధాకర్ తేరుకొనేలోగానే ఒక్కసారిగా టపాసులు పేలడంతో సుధాకర్ శరీరంపై తీవ్ర గాయాలు కావడం, అక్కడిక్కడే మృతి చెందడం భాదాకరమని స్థానికులు అన్నారు. అలాగే డీఎస్పీ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. పండుగ రోజు ఇటువంటి ఘటన జరగడం కలచి వేసిందన్నారు. టపాసులు కాల్చే సమయంలో అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పిల్లలు తప్పనిసరిగా పెద్దల సమక్షంలో టపాసులు కాల్చాలని సూచించారు. ఏదైనా అగ్నిప్రమాదం సంభవిస్తే వెంటనే డయల్ 100, 112, 101, 1070 టోల్ ఫ్రీ నెంబర్లకు సమాచారం అందించాలన్నారు.