Best Tourist Place: అక్కడ మొబైల్ సిగ్నల్ దొరకదు. కానీ మొబైల్ పక్కన పడేసేంత ప్రశాంతత దొరుకుతుంది. ఆ చోటులో మన అవసరాల్ని తీర్చేవేవీ ఉండవు. అయినా.. జీవితానికి సరిపడా అందమైన అనుభూతుల్ని పంచుతుంది. మన రోటీన్ ప్రపంచానికి దూరం చేసి.. ప్రకృతికి దగ్గర చేసే అద్భుతమైన ప్రాంతం అది. చుట్టూ పరుచుకున్న పచ్చని అడవి అందాలు ఓ వైపు.. వాటిని చుట్టుముట్టిన కృష్ణా నీళ్ల సోయగాలు మరో వైపు! ఒక్కసారి చూస్తే చాలు.. మళ్లీ తిరిగొచ్చే ఆలోచన లేకుండా చేసే ప్రాంతం అది. ప్రకృతి రమణీయతనంతా.. తనలోనే దాచుకున్న పాలమూరు అమరగిరి అందాల్ని మనమూ చూసొద్దాం!
ఇక్కడి ప్రకృతి రమణీయతను వర్ణించడానికి పదాలు సరిపోవు. ఇక్కడి పచ్చదనాన్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవు. కొండల నడుమ.. కృష్ణమ్మ ఒడిలో సేద తీర్చే.. అద్భుతమైన ప్రాంతం.. ఈ అమరగిరి. ఇప్పుడు.. దీనిమీదే తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇక్కడ.. టూరిజంని డెవలప్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రకృతి అందాల్ని.. పర్యాటకులకు పంచేందుకు సిద్ధమవుతోంది. చుట్టూ.. కృష్ణమ్మ సోయగాలు, పర్యాటకుల మనసును కట్టిపడేసే.. నల్లమల అటవీ అందాలన్నీ కలగలిపి.. అమరగిరి ప్రాంతానికి మరింత శోభను తేనున్నాయ్. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని.. ఈ అమరగిరిని ఇప్పుడు పాలమూరు ఊటీగా పిలుస్తున్నారు.
కొల్లాపూర్ పక్కనుండే సోమశిల గురించి.. చాలా మందికి తెలుసు. కానీ.. దాని పక్కనే ఉండే ఈ అమరగిరి గురించి పెద్దగా ఎవరికి తెలియదు. కానీ.. ఒక్కసారి ఇక్కడికి వెళితే మాత్రం.. చుట్టూ ఉన్న ప్రకృతి అందాలి తిరిగి వెళ్లనివ్వవు. ప్రకృతి ఒడిలో భాగమైపోయిన ఈ ప్రాంతం.. కొల్లాపూర్ నుంచి అతి సమీపంలోనే ఉంటుంది. ఒక్కసారి ఈ ప్రాంతంలోకి ఎంటరైతే.. మొబైల్‌లో సిగ్నల్ కట్ అవుతుంది. బయటి ప్రపంచానికి దూరంగా.. ఆహ్లాదకరమైన ప్రకృతి వాతావరణంలోకి వెళ్లిపోతారు. కళ్ల ముందు కనిపించే నల్లమల అందాలు, కృష్ణా జలాలు.. చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తాయ్.
అమరగిరి.. శ్రీశైలం బ్యాక్ వాటర్‌ని ఆనుకొని ఉంటుంది. ఇక్కడ.. రణగొణ ధ్వనులుండవ్. కాలుష్యం ఆనవాళ్లుండవ్. నల్లమల అడవుల్లో నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలి.. ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఎన్నో ఔషధ గుణాలున్న చెట్ల నుంచి వచ్చే ఆక్సిజన్.. మనసుని తేలికపరుస్తుంది. ఈ గ్రామంలో 2 వందలకు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయ్. వీళ్లందరికీ.. చేపలు పట్టడమే జీవనాధారం. ఊరికి ఆనుకొని ఉండే శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో.. నిత్యం వీరి పడవలు చేపల వేటకు సిద్ధంగా ఉంటాయ్. ఇక్కడ పట్టిన చేపల్ని.. ఇతర ప్రాంతాలకు సప్లై చేస్తూ జీవనం సాగిస్తారు.ఇక్కడికి వెళ్లే వారికి.. బోటింగ్ బోనస్. కొండల మధ్య, కృష్ణా జలాల్లో.. పడవపై ప్రయాణిస్తే వచ్చే కిక్కే వేరు.
Also Read: మురికి నది మురిసే.. ఇదీ చెంగిచియాన్ రివర్ హిస్టరీ, దక్షిణ కొరియాలా మనమూ చేయొచ్చా?
అమరగిరి అంటే.. అడవి అందాలు, కృష్ణమ్మ సోయగాలే కాదు. ఇక్కడికి దగ్గరలో.. చూడాల్సిన ప్రదేశాలు చాలానే ఉన్నాయ్. పడవలో 30 నిమిషాల ప్రయాణం తర్వాత.. పురాతన కాలం నాటి పరమశివుడి దేవాలయాన్ని దర్శించుకోవచ్చు. ఇక్కడ.. పూర్వకాలంలో ఋషులు తపస్సు చేసేవారని పురాణాలు చెబుతున్నాయ్. ఈ శివాలయానికి పక్కనే మల్లయ్య సెల ఉంది. దీనికో ప్రత్యేకత ఉంది. ఎంతటి వేసవికాలంలోనైనా ఇందులో నీళ్లు ఉంటాయి. ఈ సెల నుంచి తీసిన నీళ్లతోనే.. చెంచులు శివుడికి అభిషేకాలు చేస్తారు. కార్తీకమాసంలో అయితే.. ఈ గుడి గురించి తెలిసిన వారంతా ఇక్కడికి వచ్చి.. స్వామివారికి అభిషేకం చేసి వెళతారు. అమరగిరి చుట్టూ ఎన్నో శైవ క్షేత్రాలు వెలిసి ఉన్నాయ్. ఇక్కడికి అతి సమీపంలో.. మహిమగల అంకాలమ్మ కోట ఉంటుంది. ఇక్కడి నుంచి 6 కిలోమీటర్లు పడవలో ప్రయాణిస్తే.. వేములపాయ ప్రాంతంలో దట్టమైన అడవులు కనువిందు చేస్తాయ్.
అమరగిరిని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు.. టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటీవలే.. టూరిజం శాఖ అధికారులతో ఈ ప్రాంతాన్ని సందర్శించారు. అమరగిరిని టూరిజం స్పాట్‌గా డెవలప్ చేస్తే.. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు కొందరు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు.. ఇక్కడ నివసించే కుటుంబాలకు మంచి ఉపాధి కూడా దొరుకుతుందని చెబుతున్నారు. కొల్లాపూర్ సమీపంలో ఉన్న అమరగిరిని.. ఊటీలా మారుస్తామని మంత్రి జూపల్లి చెబుతున్నారు. ఇప్పటికే.. సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణం అందుబాటులో ఉంది. అమరగిరిని కూడా డెవలప్ చేస్తే.. ఈ ప్రాంతం కూడా మంచి టూరిజం స్పాట్‌గా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్.