Diwali Story: దీపావళి ఎందుకు నిర్వహించుకుంటామో చెప్పడానికి అనేక కథలు వాడుకలో ఉన్నాయి. అలాంటి కథల్లో ఆ శ్రీమహాలక్ష్మి పునర్జన్మ పొందిన కథ కూడా ఒకటి. మనుషులకు సంపదను ఇచ్చే అధి దేవత లక్ష్మీదేవి. దేవతలు కూడా లక్ష్మీదేవిని ఎంతో పూజిస్తారు, గొప్పగా భావిస్తారు. ఆమె లేని స్వర్గాన్ని ఊహించలేరు. ఆమె తిరిగి జన్మించిన రోజునే దీపావళిగా నిర్వహించుకుంటున్నట్టు పురాణాలు చెబుతున్నాయి.
దీపావళి పండుగ కోసం భారతదేశ ప్రజలు ఏడాదంతా ఎదురు చూస్తారు. కుటుంబ సభ్యులు అంతా ఒకచోట చేరి ఆనందంగా చేసుకునే పండగ దీపావళి. దీపావళి సందర్భంగా కొత్త వ్యాపారాలను ప్రారంభించే వారు. ఇళ్లను కట్టేవారు, కొత్త ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనేవారు ఎంతోమంది ఉన్నారు. లక్ష్మీదేవి సంపదకు అధిదేవత. అందుకే దీపావళి నాడు ఆమెను ఘనంగా పూజిస్తారు. ఇంటిని దీపాలతో, పూలదండలతో అలంకరిస్తారు. లక్ష్మీదేవి తమ ఇంటికి రావాలని రంగోలీలతో స్వాగతం పలుకుతారు. లక్ష్మీదేవి పాదముద్రలను ఇంటి ముందు వేసి ఆమెను సాదరంగా ఆహ్వానిస్తారు.
లక్ష్మీదేవి మనసు చంచలమైనది. ఆమె ఎక్కువ కాలం ఒకచోట ఉండదనే అనుకుంటారు హిందువులు. అందుకే ఆ దేవతలను శాంతింప చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. ఆ దేవతకు ఇష్టం ఉన్న పనులను ఇంట్లో చేస్తూ ఉంటారు. అయితే ఈ దీపావళి పండుగ వెనక లక్ష్మీదేవి పునర్జన్మ కథ కూడా ఒకటి ఉంది.
ఇంద్రుడిపై కోపం
ఇంద్రుడు చేసిన ఒక పనికి లక్ష్మీదేవి ఎంతో కోపగించుకుందని చెబుతుంటారు. ఒక మహర్షి ఇచ్చిన పవిత్రమైన హారాన్ని ఇంద్రుడు అహంకారంతో పడేస్తాడు. అది చూసిన లక్ష్మీదేవికి విపరీతమైన కోపం వచ్చి స్వర్గాన్ని విడిచి సముద్రంలోకి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి నిష్క్రమించడంతో సంపద, విజయం కోసం దేవతలు గొడవలు పడడం మొదలు పెడతారు. మానవులు కూడా అత్యాశపరులుగా మారిపోతారు. ఇదే సమయం అని భావించి రాక్షసులు తమ ప్రతాపాన్ని చూపించడం మొదలుపెడతారు. దీంతో ఇంద్రుడు విష్ణువు వద్దకు వెళ్లి లక్ష్మీదేవిని తిరిగి స్వర్గానికి తీసుకురావడానికి ప్రయత్నించమని కోరుతాడు. దానికి విష్ణువు.. దేవతలందరూ క్షీర సాగర మధనం చేయాలని చెబుతాడు.
Also Read: దీపావళికి చేసే పూజలో వినాయకుడిని లక్ష్మీదేవికి ఎడమవైపున ఉంచాలా? లేక కుడివైపున ఉంచాలా?
దీంతో సముద్ర మథనం ప్రారంభమవుతుంది. రాక్షసులు, దేవతలు సముద్రం మథనం చేస్తున్నప్పుడు లక్ష్మీదేవి తిరిగి స్వర్గానికి వస్తుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందిన దేవతలు రాక్షసులను ఓడించి విజయాన్ని సాధిస్తారు. లక్ష్మీదేవి ఇలా సముద్రం నుండి తిరిగి వచ్చి పునర్జన్మ పొందిన సందర్భంగా దీపావళి పండుగను నిర్వహించుకుంటారని అంటారు.
అందుకే దీపావళి లక్ష్మీదేవి పూజను ఘనంగా నిర్వహిస్తారు. ఆరోజు గణేశుడుని కూడా లక్ష్మీదేవి పక్కనే ఉంచి పూజిస్తారు. సకల సంపదలు ఇవ్వమని ఆ లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. తాము చేపట్టిన పనులు విజయవంతం అవ్వాలని వినాయకుడిని కోరుతారు.
దీపావళికి ద్వాపరయుగంలోని నరకాసుర వధ కూడా కారణమని చెబుతారు. సత్యభామ వీరోచితంగా నరకాసురుడిని వధించి దీపావళిని తెచ్చిందని అంటారు. అలాగే రాముడు రావణాసురుడిని చంపి అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా కూడా దీపావళిని చేసుకున్నారని అంటారు. అలాగే దీపావళి రోజే రాక్షస రాజైన బలి చక్రవర్తిని వామనుడు తన పాదంతో తొక్కి భూమిలోకి పంపేస్తాడు.