వల్లభనేని వంశీ. ఏపీ రాజకీయాల్లో కాంట్రవర్సీ లీడర్లలో ఒకరుగా పేరు. తెలుగుదేశం పార్టీలో గెలిచి.. తర్వాత జగన్ సైడ్‌కు చేరిన వంశీ.. అప్పట్లో హాట్‌టాపిక్‌గానే మారారు. మాట్లాడే మాట.. తనదైన హావభావాలతో ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. టీవీ డిబేట్లలోనూ ఇతర పార్టీ నేతలపై విరుచుకుపడేవారు. అదంతా గతం. ఎన్నికల్లో కూటమి సర్కారు విజయం సాధించాక సదరు నేత బయటకు రావాలంటేనే భయపడుతున్నారట. సొంత నియోజకవర్గానికి ఇప్పటికే దూరమైన వంశీ.. అప్పుడప్పుడూ జరిగే కార్యక్రమాల్లోనూ పాల్గొనేందుకు ఇబ్బంది పడుతున్నారనే టాక్ నడుస్తోంది.
తాజాగా వంశీ చేసిన పనికి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారట. ఓ కేసులో హజరయ్యేందుకు కోర్టుకు వచ్చిన వంశీ.. తన అనుచరులు కొందరితో న్యాయవాదుల వేషం వేయించి రక్షణగా నియమించుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన.. ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. ఒకే కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గూడవల్లి నరసయ్య.. ఓ కేసు విషయంలో విజయవాడ కోర్టుకు హాజరయ్యారు. కేసు నమోదు చేసిన సమయంలో ఒకే పార్టీలో ఉన్న వంశీ, నరసయ్య ప్రస్తుతం ప్రత్యర్థులుగా ఉన్నారు. ఇరుపక్షాలు దాడులకు తెగబడతారన్న ఉద్దేశంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారట. తనపై ప్రత్యర్థులు దాడి చేస్తారన్న భయంతో వంశీ.. తన ఏర్పాట్లు తాను చేసుకున్నారట. తనకు రక్షణగా ఉన్న బౌన్సర్లు, అనుచరులను కోర్టు ప్రాంగణంలోకి అనుమతించరని భావించిన మాజీ ఎమ్మెల్యే.. కొత్త ఎత్తుతో అందర్నీ బురిడీ కొట్టించారనే వార్తలు గుప్పుమంటున్నాయి.
Also Read: విజయమ్మ ఎంట్రీతో ఆస్తుల్లో జగన్‌కు దక్కేది ఇంతేనా..?
ఇంతకీ.. వంశీ చేసిన పనేంటి అనేగా మీ డౌట్. వైసీపీ నాయకులను లాయర్ల అవతారం ఎత్తించి రక్షణగా తెచ్చుకున్నారట. గన్నవరం నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ నేతలు.. నల్లకోటు, తెల్ల టై ధరించి ప్లీడర్లు మాదిరి కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించారు. వీరిలో రామవరప్పాడు గ్రామ వైసీపీ అధ్యక్షుడు సమ్మెట సాంబయ్య కూడా ఉన్నారట. కేవలం పదోతరగతి చదివిన సాంబయ్య.. వంశీ కోసం లాయర్‌గా మారిపోయారని సోషల్ మీడియాలో వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. వేషాలు వేసే వరకూ అలా ఉంచితే.. లాయర్ డ్రెస్ బాగుంది కదా అని ఫొటో తీసుకుని ఫేస్‌బుక్‌లో పోస్టు చేసుకోవడంతో గుట్టురట్టు అయ్యిందట. ఇదే అంశంపై టీడీపీ నేతలు ఆరాతీసి.. కోర్టు ప్రాంగణంలో తీసిన ఫొటోలు, వీడియోలను పరిశీలించారట. పలువురు వైసీపీ నాయకులు సాంబయ్య తరహాలోనే నల్లకోట్లతో కనిపించడంతో ఏం జరుగుతుందని ప్రశ్నించారట.
లోతుగా ఆరా తీస్తే.. వీరంతా వంశీకి రక్షణ కోసమే లాయర్ల అవతారం ఎత్తారని తెలిసింది. మరోవైపు వంశీకి పోలీసులు భారీఎత్తున బందోబస్తు కల్పించడం కూడా వివాదంగా మారింది. వంశీ కాన్వాయ్‌కు ముందు.. వెనుక పెట్రోలింగ్ జీపులతో రక్షణ కల్పించడం ఏంటని టీడీపీ నాయకులు ప్రశ్నించారట. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారని.. అలాంటి వ్యక్తికి భారీ రక్షణ కల్పించడం ఏమిటని తెలుగుతమ్ముళ్లు ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. కాబట్టి ఎంతటి వారైనా సరే.. ఏదో రోజు చేసిన పాపం అనుభవించక తప్పదంటూ నెటిజన్లు పోస్టులు పెట్టేస్తున్నారట. ప్రస్తుతం ఈ అంశం.. సోషల్ మీడియాలో చక్కెర్లుకొడుతోంది. మరోవైపు.. ఎలా ఉండే వంశీ.. ఎలా అయిపోయారని ఆయన వర్గీయులే చెప్పుకుంటున్నారట.