Vijay vs Udhayanidhi Stalin: తమిళ్ పొలిటికల్ సినిమాలో విజయ్ పాత్ర ఎంతగా ఆకర్షిస్తుందో తెలియడానికి ఇంకా సమయం ఉంది. ఇందులో భాగంగా, తన పొలిటికల్ కెరీర్‌ను సుస్థిరం చేసుకున్న ఉదయనిధిని ఎలా ఎదుర్కోబోతున్నాడన్నదే ఇక్కడ ఇంట్రస్టింగ్ పాయింట్. ఇటీవల, ఎన్నికల ర్యాలీల్లో ఉదయనిధి ప్రజల్లో ఒకడిగా మమేకమై అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు అలాంటి నేతను ఢీ కొనాలంటే, సినిమా ఫ్యాన్స్‌కు మించిన పొలిటికల్ ఫ్యాన్స్ అవసరం ఉంది. దీనికి విజయ్ చేస్తున్న ప్రయత్నాలేంటీ..?
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ వారసుడిగా.. ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎంగా ప్రమోట్ కావడం అధికార పార్టీలో వారసత్వ రాజకీయాలను స్పష్టం చేశాయి. ఇక, తమ తాత, తండ్రిలా డీఎంకే సారథిగా.. పెరియార్ రాజకీయాలకు నిజమైన నీలి వారసుడిని అని నిరూపించుకోడానికి ఉదయనిధి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
పెరియార్ రాజకీయాలకు వారసుడిగా ఉదయనిధి
ద్రవిడ ఓటర్ల పునాదిని మరింత బలంగా ఏకీకృతం చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే.. విజయ్ తన పొలిటికల్ అస్త్రాన్ని ఉదయనిధిపై గురిపెట్టాడు. అవినీతి, వంశపారపర్య రాజకీయాలను పెంచి పోషిస్తున్న డీఎంకే పార్టీనే తమ టివికె పార్టీకి రాజకీయ శత్రువు అని విజయ్ కచ్ఛితంగా చెప్పాశారు. అయితే, పెరియార్ మూలాల నుండే పుట్టిన మరో పార్టీ, ఏఐఏడీఎంకేపైన మాత్రం మౌనం వహించారు. అధికారంలో లేదనో.. ఇకపై, అధికారంలోకి రాదనో కానీ, విజయ్ దాని ఊసే ఎత్తలేదు. తాను ఎంచుకున్న రాజకీయ ఎత్తుగడలో ప్రత్యర్థి ఉదయనిధే అన్నట్లు మాట్లాడారు.
ప్రస్తుతం, ఎడప్పాడి పళనిస్వామి సారథ్యంలో ఉన్న ఏఐఏడీఎంకే బలం చిన్న చిన్నగా సన్నగిల్లుతోంది. జయలలితా మరణం తర్వాత ఆ పార్టీ తమిళనాడులో శక్తిని కోల్పోయింది. ఒకప్పుడు ఎదురులేకుండా వెలిగిన పార్టీ కావడం వల్ల అక్కడక్కడా ఉనికి మిగిలుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఈ పార్టీకి వచ్చిన ఓట్లు కేవలం 23% శాతం. ఒక విధంగా, ఫర్వాలేదు అనుకునేంత ఓట్లు సంపాదించుకున్నా ప్రస్తుతం ఆ పార్టీ దాదాపు ఖాళీ అవుతున్నట్లే కనిపిస్తుంది. అయితే, ఏఐఏడీఎంకేకు కచ్చితంగా నమ్మకమైన ఓటర్లు ఉన్నారనడంలో సందేహం లేదు. అందుకే, విజయ్ ఆ పార్టీని టచ్ చేయలేదు.
చీలిపోయిన ఎఐఎడిఎంకె అనుకూల ఓట్లకు విజయ్ ఎర
ఏఐఏడిఎంకె పార్టీపై దాడి చేయకపోవడం వల్ల చీలిపోయిన ఎఐఎడిఎంకె అనుకూల ఓట్లను.. అలాగే, పెరియార్‌ను వ్యతిరేకిండంతో వచ్చిన మత అనుకూల ఓటర్ల సమూహాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి విజయ్ ప్రయత్నించాడు. తమిళనాడు ఓట్ షేర్లను చూస్తే.. డిఎంకె, ఎఐఎడిఎంకెలకు సంబంధం లేకుండా ఉన్న ఓటు బ్యాంక్ 40% ఉంది. దీని కోసం చిన్నచిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో ఈ ఓటర్లను ఏ పార్టీ ఆకర్షించలేకపోతుంది. కాబట్టి, సరికొత్త ఎత్తుగడతో ఈ ఓట్లను విజయ్ ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: ద్రవిడ రాజకీయాన్ని విజయ్ తిరగరాయగలడా..? తమిళ రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి..?
ఇక, పెరియార్ సిద్ధాంతాలకు అనుకూలమైన డిఎంకెలో… ఎక్కువగా నాస్తికవాదులు, బ్రాహ్మణిజానికి వ్యతిరేకులు ఉన్నారు. అయితే, తమిళనాడులో చెప్పొకోదగ్గ ఓట్ల శాతం ఉన్న మరే ఇతర పార్టీ అలా లేదు. ఒక విధంగా, డిఎంకెలో కూడా బయటకి చెప్పకుండా పెరియార్ సిద్ధాంతాలను వ్యతిరేకించేవారు కూడా లేకపోలేదు. సరిగ్గా, ఈ పరిస్థితినే విజయ్ క్యాష్ చేసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగని విజయ్ పెరియార్‌కు పూర్తి వ్యతిరేకి కాదు. విజయ్ పెరియార్‌ను ఆదర్శంగా తీసుకున్నట్లు తన మొదటి రాజకీయ గర్జన సభ ఎంట్రీ కటౌట్‌లోనే స్పష్టం చేశారు.
విజయ్ పెరియార్‌కు పూర్తి వ్యతిరేకి కాదు
అయినప్పటికీ, నాస్తికత్వం, బ్రాహ్మణ వ్యతిరేకత నుండి దూరంగా ఉన్నట్లు కూడా విజయ్ సంకేతాలు పంపారు. పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగా ఉదయనిధి, మత వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తుంటే.. విజయ్ సంఘ సంస్కర్తగా ఉన్న పెరియార్‌ను మాత్రమే స్వీకరింస్తానని చెబుతున్నారు. దీనితో తన రాజకీయాల పరిధిని పెంచుకుంటున్నారు. తమిళ స్టార్ హీరోగా విజయ్‌కి ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌లో ఈ ప్రభావం ఉండకుండా కూడా జాగ్రత్త పడుతున్నారు. అందుకే, ద్రావిడ రాజకీయాల గమనాన్ని నిర్వచించడంలో కొత్త వైఖరిని చూపిస్తున్నాడు.
అయితే, ఉదయనిధి తమిళనాడు ఉప ముఖ్యమంత్రి అయిన సమయంలోనే.. తన మొదటి రాజకీయ సినిమాను విజయ్ రిలీజ్ చేశారు. తన సొంత రాజకీయ పార్టీని ప్రకటించి, సంచలనం రేపాడు. రాజనీకాంత్, కమల్ హాసన్‌లా కాకుండా.. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి, విజయకాంత్ లాగా.. విజయ్ తమిళ రాజకీయాల్లో ఒక ఒరవడిలా బలమైన పునాదితో వచ్చారు. ‘విజయ్‌మక్కల్ ఇయక్కమ్’ అనే తన అభిమానుల పార్టీ ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి సంచలన విజయం సాధించింది.
తమిళనాడు రాజకీయాల్లో విజయ్‌కి డీఎంకే అతిపెద్ద ప్రత్యర్థి
అందుకే, తమిళనాడు రాజకీయాల్లో విజయ్‌కి డీఎంకే అతిపెద్ద ప్రత్యర్థిగా మారింది. అయితే, అట్టడుగు స్థాయిలో ప్రజలతో మమేకమయ్యేలా ఉదయనిధి స్టాలిన్‌కి అట్టడుగున సంస్థాగత నిర్మాణం ఉంది. కానీ, విజయ్ ఆ స్థాయిలో వ్యవస్థను రూపొందించుకోవడం అంత సులువు కాదు. సినిమా డైలాగులకు ఏ మాత్రం తగ్గని మాస్ స్పీచ్ ఇచ్చినప్పటికీ.. తమిళనాడు నిర్మించుకున్న ద్రవిడ పునాదులపై నిలబడిన జనాన్ని గెలిపించడంలో విజయ్ ఇంతగా రాణించలేదన్నది కొందరు నిపుణులు అంటున్న మాట.
పొలిటికల్ డైలాగుల కన్నా బలంగా విజయ్ పొలిటికల్ ప్లాన్
అయితే, విజయ్ పొలిటికల్ డైలాగుల ప్రభావం కన్నా.. విజయ్ వేసిన పొలిటికల్ ప్లాన్ చాలా సమర్థవంతంగా ఉందనడంలో సందేహం లేదు. రాజకీయాల్లోకి అడుగు పెట్టకముందే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో గ్రౌండ్‌వర్క్‌ను పూర్తి చేసిన ‘విజయ్‌మక్కల్ ఇయక్కమ్’ బలం కావాల్సినంత కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఇక, తమిళనాడులో సినిమాలకు, రాజకీయాలకు మధ్య విడదీయరాని సంబంధం గట్టిగా పెనవేసుకోని ఉంది. అందుకే, విజయ్ ఇచ్చిన సూచనలు, ప్లాన్ చేసిన నేపధ్యం, ప్రస్తుత ఒరవడి ఈసారి తళపతి విజయ్‌కి సీఎం ట్యాగ్ ఇస్తాయేమో చూడాలి. అయితే, అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాదికి పైగా సమయం ఉంది కాబట్టి, విజయ్ తన పార్టీని ఎలా రెడీ చేస్తాడన్నది తెలియాలి. ఏది ఏమైనప్పటికీ… తమిళనాడులో మరోసారి ఇద్దరి కథానాయకులతో నడిచే మాస్ మ్యాట్నీ షో తప్పదు.