⦿ రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా ఐఏఎస్‌ల దందాలు
⦿ ఈడీకి వరుసగా అందుతున్న ఫిర్యాదులు
⦿ ఇప్పటికే సంచలనం రేపుతున్న అమోయ్ వ్యవహారాలు
⦿ తాజాగా నవీన్ మిట్టల్, సోమేశ్ కుమార్‌పైనా ఫిర్యాదు
⦿కొండాపూర్‌లో 88 ఎకరాలపై వివాదం
⦿ జీవో 45తో 42 ఎకరాలు ప్రైవేట్ సంస్థకు బదలాయింపు
⦿ ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారని బాధితుల ఆవేదన
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: Complaint to ED Against IAS: రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల అవినీతి డొంక కదులుతోంది. ఇప్పటికే, ప్రభుత్వ భూముల్ని అప్పనంగా ప్రైవేట్ సంస్థలకు అప్పగించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఐఏఎస్ అమోయ్ కుమార్. ఈయనపై ఈడీ విచారణ కొనసాగుతుండగా, వరుసగా బాధితులు బయటకొస్తున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని భూముల్లో జరిగిన అవకతవకలపై ఫిర్యాదులు అందజేస్తున్నారు. తాజాగా అమోయ్ కుమార్ సహా ఐఏఎస్ నవీన్ మిట్టల్, మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌పై ఈడీ అధికారులకు ఫిర్యాదు అందింది. 88 ఎకరాల భూ వ్యవహారానికి సంబంధించి బాధితులు న్యాయం చేయాలని అందులో పేర్కొన్నారు.
కొండాపూర్ భూములను ఖతం పట్టించారు
భూదాన్ భూముల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయి. ధరణిని అడ్డుపెట్టుకుని దందా సాగింది. దీని వెనుక కీలక పాత్రధారిగా అమోయ్ కుమార్ ఉండగా, సూత్రధారులు ఎవరనేది ఈడీ నిగ్గుతేల్చే పనిలో ఉంది. అంతేకాదు, అమోయ్ కుమార్‌కు సంబంధించిన ఫైళ్ల తారుమారు వ్యవహారాలకు సంబంధించి కూపీ లాగుతోంది. ఇలాంటి సమయంలో ఈడీకి వరుస ఫిర్యాదులు అందడం హాట్ టాపిక్‌గా మారింది. కొండాపూర్‌లోని 88 ఎకరాలకు సంబంధించి తాజాగా అమోయ్ కుమార్‌తో సహా ఐఏఎస్ నవీన్ మిట్టల్, మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌పై ఈడీకి కంప్లైంట్ చేశారు. మజీద్ బండిలో సర్వే నెంబర్ 104 నుంచి 108 వరకు ఉన్న 88 ఎకరాలను బాలసాయి ట్రస్ట్‌కు ఓ కుటుంబం దానం చేసింది. దాంట్లో 42 ఎకరాలను భూపతి అసోసియేట్స్ అనే ప్రైవేట్ సంస్థకు బదలాయిస్తూ గత ప్రభుత్వంలో జీవో 45ని జారీ చేశారు. దీనిపై తాజాగా బాధితులు ఈడీకి ఫిర్యాదు చేశారు. తమకు చెందిన భూమికి సంబంధించి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి అప్పటికప్పుడు జీవో ఇచ్చేసి ముగ్గురు మోసం చేశారని ఆరోపించారు. వారి దగ్గరున్న ఆధారాలను కూడా ఈడీకి సమర్పించారు.
అమోయ్ లీలలు ఇంకెన్ని?
బీఆర్ఎస్ ప్రభుత్వంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పని చేసిన సమయంలో అమోయ్ కుమార్ అనేక అక్రమాలకు పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వివరాలను ‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేషన్ టీం పక్కా ఆధారాలతో బయటపెట్టింది. అంతేకాదు, బినామీ వ్యవహారాలపైనా కథనాలు ఇచ్చింది. ఈడీ ఆ దిశగా ముందుకు వెళ్తే అమోయ్ లీలలపై మరిన్ని లింకులు దొరికే ఛాన్స్ ఉంటుంది. ఇదే సమయంలో అమోయ్ కుమార్ బాధితులు వరుసగా బయటకొస్తుండటం చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వంలోని పెద్దలు, అధికారులు కలిసి తమ భూములను కబ్జా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల దగ్గరికెళితే కోర్టుకు వెళ్లాలని చేతులు దులుపుకున్నట్లు చెబుతున్నారని, అందుకే ఈడీకి ఫిర్యాదు చేస్తున్నట్టు చెబుతున్నారు.
గుట్టల బేగంపేట భూములపై హైకోర్టు కీలక ఉత్తర్వులు
గుట్టల బేగంపేట భూములపై అమోయ్ కుమార్ ఇచ్చిన ఉత్తర్వుల్ని హైకోర్టు కొట్టేసింది. నిషేధిత జాబితాలో సర్వే నెంబర్ 63లోని 52 ఎకరాల విలువైన భూముల్ని 2022లో డీనోటిఫై చేస్తూ నాటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రైవేట్ భూమిగా పేర్కొనడాన్ని సవాల్ చేస్తూ 2022లో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దానిపై ఇప్పుడు తీర్పు వచ్చింది. నాటి కలెక్టర్ అమోయ్ కుమార్ ఉత్తర్వుల్ని తప్పుబట్టింది న్యాయస్థానం. ఇప్పటికే, అక్రమంగా భూ బదలాయింపుల కేసులో అమోయ్ కుమార్‌ను ఈడీ విచారిస్తోంది. ఇదే సమయంలో, మరో ఐఏఎస్, మాజీ సీఎస్‌పై ఈడీకి ఫిర్యాదు అందడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక మీదట ఇలాంటి ఫిర్యాదులు ఇంకెన్ని వస్తాయోననేది హాట్ టాపిక్ అయింది.