CM Revanth Diwali Wishes : తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ దీపావళిని రాష్ట్రంలోని ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకోవాలని కోరుకున్నారు. దీపాల కాంతులతో ప్రతి ఇంటింటా సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి.. పర్యావరణానికి హాని కలిగించని రీతిలో దీపావళిని నిర్వహించుకోవాలని సూచించారు. చిన్నా, పెద్దా అంతా పండుగలో సంతోషంగా పాల్గొవాలని కోరిన ముఖ్యమంత్రి.. ఇటీవల జరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ, ప్రమాదాలకు తావు లేకుండా దీపాల పండుగను నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
దీపావళి శుభాకాంక్షలు చెబుతూనే.. గత ప్రభుత్వ పాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శాత్మకంగా వ్యాఖ్యాలు చేశారు. గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో విధ్వంసం చోటుచేసుకుందన్న రేవంత్.. దాని తాలుకు చీకట్లు తొలిగిపోయాయని అన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అందరి సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రజా పాలన కొనసాగుతుందని అన్నారు. తమ పరిపాలనలో తెలంగాణ వెలుగులు విరజిమ్ముతుందని ధీమా వ్యక్తం చేశారు.