Hero Darshan: అభిమాని రేణుకా స్వామి (Renuka Swamy) హత్య కేసులో ప్రముఖ హీరో దర్శన్ (Darshan) అరెస్ట్ అయి జైలుకెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఆయనకి బెయిల్ మంజూరు అయింది. వైద్య చికిత్సల కోసం ఆరు వారాలపాటు బెయిల్ మంజూరు చేస్తూ కర్ణాటక హైకోర్టు సింగిల్ జడ్జ్ బెంచ్ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ విషయం తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. గత కొంతకాలంగా వెన్ను నొప్పితో తీవ్రంగా బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మధ్యంతర బెయిల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా నటుడి దర్శన్ కు జైలు జీవితం నుంచి కొద్ది రోజులు విముక్తి కలగడంతో కుటుంబ సభ్యులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
క్షీణించిన ఆరోగ్యం..
రేణుకా స్వామి హత్య కేసులో దాదాపు 5 నెలలుగా జైలు జీవితం గడుపుతున్నారు కన్నడ నటుడు దర్శన్. ఎట్టకేలకు ఆయనకు బెయిల్ మంజూరు అవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే దర్శన్ ఆరోగ్య సమస్యను పరిగణలోకి తీసుకున్న కర్ణాటక హైకోర్టు ఆరు వారాలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో పాటు మధ్యంతర బెయిల్ కి తగిన షరతులను కూడా న్యాయస్థానం విధించింది.
ఇకపోతే దర్శన్ కి ఇలా కర్ణాటక హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో నెటిజన్స్ కూడా షాక్ అవుతున్నారు. ఇంత సడన్ గా బెయిల్ ఎందుకు మంజూరు చేయవలసి వచ్చింది అంటూ కొంతమంది కామెంట్లు చేయగా.. ఆయనకు తీవ్రమైన వెన్నునొప్పి ఉందని, అలాగే శస్త్ర చికిత్స అవసరమని, చికిత్స ఆలస్యం అయితే పక్షవాతం వస్తుందేమో అనే అనుమానం ఉందని డాక్టర్లు నివేదిక ఇవ్వగా.. ఆ నివేదికను దర్శన్ తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు.
మెడికల్ బోర్డ్ ఏర్పాటు..
ఇక దర్శన్ ఆరోగ్య సమస్యలపై నివేదిక ఇవ్వడానికి.. మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసన్నకుమార్ కోర్ట్ ముందు వాదించినట్లు సమాచారం. ఇప్పుడు సమర్పించిన డాక్టర్ రిపోర్టులో కూడా దర్శన్ కు చేయాల్సిన సర్జరీ అలాగే ఆయన కోలుకోవడానికి పట్టే సమయం గురించి కూడా సరిగ్గా వివరణ ఇవ్వలేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. దీంతో ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి విశ్వేశ్వర్ భట్ ఇప్పుడు విచారణలో ఉన్న ఖైదీకి వైద్యం చేయించుకునే హక్కు ఉంది అని పేర్కొంటూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. మొత్తానికైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలను పక్కనపెట్టి ఆయన ఆరోగ్యమే ప్రధానమని భావించిన న్యాయమూర్తి ఈయనకు మధ్యంతర బెయిల్ ప్రకటించారు.
దర్శన్ చేసే మొదటి పని అదే..
ఇకపోతే అభిమానిని అనవసరంగా హత్య చేశానని జైల్లో ఉన్నప్పుడు దర్శన్ పశ్చాతాప పడ్డారట. ఈ క్రమంలోనే బెయిల్ మీద బయటకు వచ్చిన వెంటనే రేణుకా స్వామి కుటుంబ సభ్యులను కలిసి వారికి కొంచెం ఆర్థిక సహాయం చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.