BIG TV Interview With Sunil: వివేకానంద హత్య కేసు ఎంత వరకు వచ్చింది? ఈ కేసు ఎందుకు సైలెంట్ అయ్యింది? దీనికి ముగింపు లేదా? హత్య కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న సునీల్‌యాదవ్ షాకింగ్ కామెంట్స్‌తో కేసు కదలిక మొదలవుతుందా? దీని వెనుక సూత్రదారులు, పాత్రదారులు త్వరలో అరెస్ట్ ఖాయమా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
వైఎస్ వివేకానంద హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఇందులో చాలామందిని విచారించారు సీబీఐ అధికారులు. చివరకు కడప ఎంపీని అరెస్ట్ చేద్దామని అధికారులు భావించినప్పటికీ, మెల్లగా బయటపడ్డారు. ఈలోగా ఏపీలో ఎన్నికలు రావడం, ఆ కేసు సైలెంట్ అయిపోయింది. దీంతో ఈ కేసులో ఏ2గా భావిస్తున్న సునీల్ యాదవ్ ‘బిగ్ టీవీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు.
వైఎస్ వివేకానందరెడ్డితో చివరి వరకు ట్రావెల్ చేసింది తాననని వివరించాడు సునీల్ యాదవ్. వివేకానంద హత్య జరిగి ఆరున్నర గంటల తర్వాత తనకు తెలిసిందన్నాడు. పోస్టుమార్టం రెడీ అవుతున్న సమయంలోనే తాను వివేక డెడ్ బాడీని చూశానని అన్నాడు. తొలుత గుండెపోటు, తర్వాత హత్య అని తేలిందన్నాడు. న్యాయస్థానం పరిధిలో ఉండడంతో అసలు విషయాలు వెల్లడించలేనన్నది సునీల్ వెర్షన్.
ప్రస్తుతం తాను కండీషన్ బెయిల్ మీద ఉన్నానని తెలిపాడు సునీల్ యాదవ్. విచారణ సమయంలో రక్తం మడుగులో ఆయన ఫోటోలు చూసినప్పుడు చాలా బాధ అనిపించిందన్నాడు. ఆసుపత్రిలో అనాథ శవం మాదిరిగా కనిపించారని, మాజీ మంత్రికి ఇలాంటి పరిస్థితి ఏంటని చాలా బాధ అనిపించిందన్నాడు.
ఆయన్ని ఎవరు చంపారనేది కోర్టు నిర్ణయిస్తుందన్నాడు. దీనివల్ల కొందరు కచ్చితంగా లాభపడే ఉంటారన్నాడు. వైఎస్ వివేకను తాను చంపలేదని కుండ బద్దలు కొట్టేశాడు నిందితుడు సునీల్ యాదవ్. సీబీఐ చెబుతున్నవన్నీ నిజాలా అంటూ ఎదురు ప్రశ్నవేశాడు.
సిట్, సీబీఐ విచారణను ఎదుర్కొన్నానని, తనను విట్ నెస్‌గా పిలిచారని, కొద్దిరోజులపాటు జైలు జీవితం అనుభవించానని గుర్తు చేశాడు. ఆ తర్వాత క్లీన్‌చిట్ ఇచ్చారన్నాడు. తనతోపాటు ఫ్యామిలీ సైతం ఈ కేసు విచారణ ఎదుర్కొందన్నాడు. హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి గోవాకు వెళ్లానని, తాను పారిపోయినంటూ వదంతులు సృష్టించారన్నాడు.
39 నెలలపాటు జైలులో ఉన్నానని, తన అడ్వకేట్ ఇప్పటివరకు ఎలాంటి ఫీజు తీసుకోలేదన్నారు. కేవలం పేపర్లు, స్టాంపులకు మాత్రమే ఇచ్చానన్నాడు. రాయలసీమ హత్యలు ఈ విధంగా ఉంటాయని ఒకనొక సందర్భంలో తన లాయర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశాడు సునీల్ యాదవ్. ఈ లెక్కన వివేక హత్య కేసుకు త్వరలో ముగింపు పలకడం ఖాయమనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.