Vizag Steel Plant Issue: విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు నినాదంతో ఏర్పడిన విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాము అధికారంలో వచ్చాక ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ ఉండదంటూ కూటమి నేతలు హామీ ఇచ్చిన నేపథ్యంలో.. ప్లాంట్ బలోపేతానికి పనులు వెంటనే ప్రారంభించాలనే డిమాండ్ పెరిగాయట. కేంద్రంతో స్పష్టమైన ప్రకటన చేయించాలంటూ.. ఉద్యోగులు, కార్మికులు గళమెత్తటంతో.. ఈ అంశం నేతలకు.. తలనొప్పిగా మారిందట. అసలు ప్రైవేటీకరణ నిలుపుదల కోసం చేస్తున్న చర్యలేంటి? ప్లాంట్ అభివృద్ధి కోసం కూటమి పార్టీల చేస్తున్న కృషి ఏంటి? ఓ లుక్కేద్దాం..
కూటమి అధికారంలో ఉండగా ప్రైవేటీకరణ ఉండదని ఎమ్మెల్యే
ఐదేళ్లుగా.. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిలో వెనకబడి. ఆందోళనలతో ముందుకు కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదన తెచ్చిన తర్వాత కార్మికులు, ఉద్యోగులు, నిర్వాసితులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీలోని కేంద్రమంత్రులు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిశీలించి.. ప్రైవేటీకరణ ఉండదంటూ హామీ ఇచ్చారు. కూటమి అధికారంలో ఉన్నంత కాలం ప్రైవేటీకరణ అంశం ఉండదని చెప్పిన స్థానిక ఎమ్మెల్యే.. ఒక అడుగు ముందుకేసి అలాంటి పరిస్థితి వస్తే తాను రాజీనామా చేస్తానని హామీ కూడా ఇచ్చేశారు. స్టీల్‌ప్లాంట్ మళ్లీ పునర్జీవన దిశగా అడుగులు పడుతున్నాయి. అయితే.. దీని వెనుక ఉన్నది కేంద్రమా.. రాష్ట్రమా అనే అంశంపై చర్చ సాగుతోందట.
నేతలకు కంటిమీద కునుకు లేకుండా మారిన ప్రైవేటీకరణ ఇష్యూ..
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం.. పార్టీలతో పాటు నేతలు. ఉద్యోగులు, కార్మికులకూ కంటిమీద కునుకు లేకుండా చేస్తోందనటంతో ఎలాంటి సందేహం లేదు. ఐదేళ్లుగా ఉద్యమాలతో ఉక్కునగరం అట్టడుకుతోంది. ఈ అంశం కొందరికి రాజకీయ అనుకూలంగా మారితే.. మరికొందరికి శాపంగా మారిందనే వాదనలు ఉన్నాయట. గత ప్రభుత్వ హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్.. 2024 ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసి ఘోరఓటమి చెందారు. ప్రస్తుతానికి ఈ అంశం.. గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మెడకు చుట్టుకుందట.
క్లారిటీ ఇవ్వకుంటే.. ఫ్యూచర్ పై ప్రభావమనే వాదనలు
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే పల్లా శ్రీనివాసరావుకి పదవి గండం తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయట. గత ప్రభుత్వాలు మాదిరే.. కూటమి ప్రభుత్వం కూడా ప్రైవేటీకరణపై నాన్చుడు ధోరణి అవలంభిస్తే.. కష్టాలు తప్పవనే టాక్ నడుస్తోంది. సరైన క్లారిటీ ఇవ్వకుంటే.. వచ్చే ఎన్నికల్లో అది.. పార్టీలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయవర్గాలూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. అందుకే.. ఎప్పుడు.. ఏమి జరుగుతుందో తెలియక.. నేతలు భయం గుప్పెట్లో ఉన్నారట. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం… అటు రాజకీయాల్లో కీలకంగా మారగా… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అనేక మందికి ముడిపడి ఉందనే వాదనలు ఉన్నాయి. దీంతో ఈ అంశం.. ఎటు తిరిగి ఎలా వస్తుందోననే నేతలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారట.
Also Read: జగన్‌కు మరో షాక్.. టీడీపీలోకి మరో ఎమ్మెల్యే?
కేంద్రంలో NDA, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఉత్కంఠ ఎక్కువ అయ్యిందనే చెప్పాలి. 2024 ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపుతామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో కూటమి సర్కారు.. అధికారంలోకి రావటంతో ప్రైవేటీకరణ అంశం.. మరోసారి తెరపైకి వచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయబోమని ప్రకటన చేయాలని ఉద్యమం చేస్తున్న ఉద్యోగులు, కార్మికుల నుంచి బలమైన వాదనలు వినిపిస్తున్నాయట. దీనికి తోడు యాజమాన్యం కూడా ప్రైవేటీకరణపైనే మక్కువ చూపుతుందనే వార్తలు… అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్, విశాఖ టీడీపీ ఎంపీ భరత్, గాజువాక ఎమ్మెల్యే, TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు తలనొప్పిగా మారాయట. ప్రైవేటీకరణ చేయబోమంటూ కేంద్రం పెద్దలతో ప్రకటన చేయించాలంటూ కార్మికులు, ఉద్యోగులు, నిర్వాసితులు.. సదరు నేతలపై ఒత్తిడి తేవటంతో ఏం చేయాలో తెలియని స్థితి నెలకొందట.
ఐదేళ్లుగా ఉద్యమాలతో అట్టడుకుతోన్న ఉక్కునగరం
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం కేంద్రంగా గత ఎన్నికలు జరిగాయి అనటంతో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రచారంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో పాటు బీజేపీ అభ్యర్థులు కూడా ప్రైవేటీకరణ జరగదని.. తాము హామీ అంటూ చెప్పుకొచ్చారు. అనకాపల్లి ఎంపీగా ఉన్న సీఎం రమేష్ కూడా ప్రైవేటీకరణ ఉండబోదని.. పదేపదే హామీలిచ్చారు. అయితే.. ఇక్కడ నేతలతో కాకుండా.. కేంద్రం పెద్దలతో మాట్లాడి.. ప్రైవేటీకరణ లేదంటూ ప్రకటన చేయించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారట. తమకు ఎన్నికల్లో మాట ఇచ్చిన నేతలపై ఒత్తిడి తీసుకొస్తున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి.
ప్రైవేటీకరణ జరిగితే పల్లాకు గండం తప్పదనే వార్తలు
ప్రస్తుతానికి స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం.. TDP, BJP నాయకులకు పెద్దగండలా మారిందట. కేంద్రంలో NDA ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉక్కుశాఖామంత్రి కుమారస్వామి.. స్టీల్ ప్లాంట్‌ను సందర్శించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ ఉండదంటూ కార్మికులకు హామీ ఇచ్చారు. ఉక్కు సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ కూడా.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదనే చెబుతూ వస్తున్నారు. కేంద్రంలో NDA ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 500 కోట్లు మంజూరు చేసి.. స్టీల్‌ప్లాంటు కోసం SBI ద్వారా ఖర్చు చేయాలని నిబంధన పెట్టింది. దీంతోపాటు మరో 2వేల 500 కోట్లను.. ప్లాంట్ కోసం ఇస్తామని హామీ కూడా ఇచ్చిందట. హామీలైతే.. చకాచకా వెలువడుతున్నాయి కానీ.. ఆశించిన మేర రిజల్ట్ రావటం లేదు అనేది కార్మికుల వాదనగా తెలుస్తోంది.
అవకాశాన్ని బట్టి… స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేసి.. ప్రభుత్వం రంగ సంస్థగా నడపాలనే ప్రతిపాదన ఉంది. కానీ.. అది నేటికీ అమలు కావటం లేదని ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు ప్రశ్నిస్తున్నారట. మాట అయితే ఇచ్చారు కానీ పనులు మాత్రం జరగటం లేదని.. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలనే డిమాండ్లు భారీగా వినిపించటంతో నేతలకు ఈ అంశం.. తలనొప్పిగా మారిందట.
Also Read: ఆ ఒక్క తప్పు.. నాగం కొంప ముంచింది
స్టీల్ ప్లాంట్ పరిశీలించి ప్రైవేటీకరణ ఉండదన్న కేంద్రమంత్రులు
కార్మికుల ఆందోళనల మధ్యే.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోని బ్లాస్ట్ ఫర్నిస్-1 ను అధికారులు పునర్ ప్రారంభించారు. 300 కోట్లతో ప్రారంభమైన బ్లాస్ట్ ఫర్నిస్‌ను.. ముడిసరుకు అందుబాటులో లేక, నిర్వహణ సరిగ్గా లేక.. ఆరు నెలల క్రితం నిలిపివేశారట. మొత్తం మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌లు ఉండగా.. రెండు సంవత్సరాల క్రితం ఫర్నిస్-3 ని మూసివేశారు. ఆరు నెలల క్రితం బ్లాస్ట్ ఫర్నిస్-1 కూడా మూతపడడంతో ఆఖరి దాంట్లో మాత్రమే ఉత్పత్తి కొనసాగుతోంది. ఉత్పత్తి నిలిపివేసి.. స్టీల్ ప్లాంట్ మూసి వేయడానికి కేంద్రంతో కలసి ప్లాంట్ యాజమాన్యం కుట్రలు చేస్తుందని చేస్తున్న నేపథ్యంలో.. బ్లాస్ట్ ఫర్నిస్-1 ప్రారంభించడం ద్వారా ఉత్పత్తి పెరుగుతుందని కూటమి నాయకులు చెప్పుకొస్తున్నారు. కూటమి చిత్తశుద్ధితో ఉండడం వల్లే… స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా నిలుపుదల చేసేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నది నేతలు వాదనగా తెలుస్తోంది.
ఐదేళ్లుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో.. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒకరిపై ఒకరు తీవ్రపదజాలంతో విమర్శలు కూడా చేసుకున్నారు. ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని ఆలోచనకు వస్తే తీవ్రస్థాయిలో నిరసన దీక్ష చేపడతామని.. వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి ప్రకటన కూడా చేశారు. తాజాగా… బ్లాస్ట్ ఫర్నిస్-1 లో ఉత్పత్తి పునర్ ప్రారంభం కావటంతో.. కూటమి నేతలతో పాటు ప్రతిపక్షంలో ఉన్న వారికి కూడా ప్రైవేటీకరణ అంశంపై.. ఓ క్లారిటీ వచ్చేసిందనే టాక్ నడుస్తోంది. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ భరత్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌కు మాత్రం ఈ అంశం.. గుదిబండేననే టాక్ నడుస్తోంది. ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా నిలుపుదల చేస్తామని ప్రకటనలు చేసిన పార్టీలు…ఆ హామీని ఎంతవరకూ నెరవేర్చుతాయనే అంశం ఉత్కంఠగా మారింది.