YCP Counter Letter: వైఎస్ఆర్ ఆస్తుల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. విజయమ్మ రాసిన లేఖకు వైసీపీ కౌంటరిచ్చింది. ఈ వ్యవహారంలో పార్టీ నేతలు మాట్లాడిన దానికి సపోర్టుగా ఆ లేఖ ఉన్నట్లు కనిపిస్తోంది. జరుగుతున్న వ్యవహారాన్ని పట్టించుకోకుండా బెయిల్ రద్దు విషయాన్ని పదే పదే ప్రస్తావించింది.
దీనిని రాజకీయాలకు ముడిపెట్టే ప్రయత్నం చేసింది వైసీపీ. ఒక్క ముక్కలో చెప్పాలంటే షర్మిల-విజయమ్మ ఒక్కరే అనే విషయాన్ని బయట పెట్టింది. ఫైనల్‌గా దీనికి ముగింపు న్యాయస్థానం ఇస్తుందని తేల్చేసింది వైసీపీ.
వైఎస్ షర్మిల రాసిన లేఖ బయటకు వచ్చిన తర్వాత వైసీపీ అలర్ట్ అయ్యింది. ముఖ్యంగా మీడియా ముందుకొచ్చిన ముగ్గురు నేతలు వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విజయసాయిరెడ్డి కలిసి మాట్లాడిన పాయింట్ ఒక్కటే. జగన్ బెయిల్ రద్దుకు కుట్ర పన్నుతున్నారనేది ప్రధాన పాయింట్.
వైసీపీ విడుదల చేసిన లేఖలో కూడా అదే ప్రస్తావించింది. రెండో పాయింట్.. 2024 ఎన్నికల్లో షర్మిలకు ఓటు వేసి గెలిపించాలని విజయమ్మ వీడియో సందేశాన్ని తెరపైకి తెచ్చింది. దీని కారణంగా టీడీపీకి మేలు చేసేలా వ్యవహరించడమేనని ప్రస్తావన.
ALSO READ: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా.. అయితే ఈ సమాచారం మీ కోసమే!
సరస్వతి పవన్ కంపెనీ షేర్ల వ్యవహారం కాగా, షర్మిల రాసిన లేఖ టీడీపీ నుంచి బయటకు రావడం, జగన్‌ను రాజకీయంగా దెబ్బతీసేందుకు వేసిన ఎత్తుగడగా వర్ణించింది. తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీ పెట్టిన నుంచి జగన్‌ను ఇబ్బందిపెడుతున్నారన్నది వైసీపీ మాట. జగన్‌కు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదన్నది వైసీపీ ఆలోచనగా తెలుస్తోంది.
షర్మిల ఒత్తిళ్ల కారణంగా న్యాయాన్ని విజయమ్మ విస్మరించారని తెలిపింది. వైఎస్ఆర్ ఉన్నప్పుడే జగన్ కంపెలు నిర్వహించారని, వైఎస్ఆర్ తన పూర్వీకులు, తాను సంపాదించిన ఆస్తులను ఇచ్చారని తెలిపింది. వైసీపీ నేతలు సైతం ఇదే విషయాన్ని పదేపదే చెప్పుకొంటూ వచ్చారు. జగన్ సొంత ఆస్తుల కావడం వల్లే వాటా ఇవ్వలేదని తేల్చేసింది.
పదేళ్ల కాలంలో 200 కోట్లు రూపాయలు చెల్లికి జగన్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. సొంతంగా సంపాదించిన ఆస్తులను ఉమ్మడి ఆస్తులు చెప్పడం ముమ్మాటికీ ప్రజలను తప్పుదోవ పట్టించినట్టేనని పేర్కొంది. ఇందులో ఒక్క రూపాయి కూడా షర్మిల పెట్టుబడి పెట్టలేదని రాసుకొచ్చింది.
ఈ సమస్యపై ఎవరు మాట్లాడినా బురద జల్లడం అవుతుంది తప్పా, పెద్దగా ఫలితం ఉండదు. ఇప్పుడు ఎవరు చేసింది సరైనదో, ఎవరి వైపు న్యాయం ఉందో కోర్టులే నిర్ణయిస్తాయని ఫైనల్ టచ్ ఇచ్చేసింది. ఈ లెక్కన ఆ పార్టీకి చెందిన త్రిమూర్తులు మాట్లాడిన మాటలనే లెటర్ రూపంలో ప్రస్తావించింది వైసీపీ. ఇందులో కొత్తగా ఏమీ లేదన్నది ప్రజల ఓపీనియన్.