గురక ఎందుకు వస్తుంది.
నిద్రలోనే అందరికీ గురక వస్తుంది. నిద్రపోతున్నప్పుడు గొంతు వెనకాల భాగంలో వదులుగా మారుతుంది. ఆ సమయంలో శ్వాస మార్గానికి అడ్డంకి కలుగుతుంది. అప్పుడు ఊపిరాడనట్టు అవుతుంది. శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. శ్వాస తీసుకుంటున్నప్పుడు గురక శబ్దం బయటికి వస్తుంది. అంటే నిద్రలో కాసేపు శ్వాస నిలిచిపోతుందని అర్థం చేసుకోవచ్చు. దీని వల్ల రక్తంలో ఆక్సిజన్ మోతాదులు తగ్గిపోతాయి. అందుకే గురకను తేలికగా తీసుకోకూడదని చెబుతారు. అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా సమస్య వల్ల కూడా గురక సమస్య రావచ్చు.
గురక వల్ల రక్తనాళాల సమస్యలు, నాడీ జబ్బులు, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని చెబుతారు. అలాగే కొన్ని రకాల క్యాన్సర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, జీర్ణకోశ క్యాన్సర్లు ముప్పు పెరుగుతుందని అంటారు.
గురక వల్ల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందో లేదో తెలుసుకోవడానికి ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. పదమూడేళ్ల పాటు దీన్ని పరిశీలించారు. వీరిలో తీవ్రంగా గురక పెడుతున్న వారిలో 181 మంది క్యాన్సర్ల బారిన పడినట్టు గుర్తించారు. దీన్ని బట్టి క్యాన్సర్ కు, గురకకు సంబంధం ఉండే ఉంటుందని తెలిశారు.
స్లీప్ ఆప్నియా సమస్య వల్ల గురక శబ్దం అధికంగా వస్తుంది. ఈ స్లీప్ ఆప్నియాసమస్యతో బాధపడే వారిలో కూడా క్యాన్సర్ కేసులు 26% ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనంలో తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది గురకతో బాధపడుతున్నట్టు అంచనా. ప్రతి పది మందిలో తొమ్మిది మందికి అసలు తాము గురక పెడుతున్నట్టు కూడా తెలియదట.
డీఎన్ఏ దెబ్బతింటే..
గురక వల్ల శ్వాస సాఫీగా తీసుకోలేరు. ఎప్పుడైతే రక్తంలో ఆక్సిజన్ తగ్గుతుందో అప్పుడు డిఎన్ఏ కూడా దెబ్బ తినే అవకాశం ఉంది. దీని వల్ల క్యాన్సర్ ముప్పు పెరిగిపోతుంది. కాబట్టి గురక సమస్యను తేలికగా తీసుకోకుండా దానికి తగిన చికిత్స తీసుకోవడం ఉత్తమం. అలాగే అధిక బరువును కూడా తగ్గించుకోవాలి. బెల్లీ ఫ్యాట్ తో బాధపడే వారిలోనే ఎక్కువగా గురక వస్తుంది. కాబట్టి పొట్ట దగ్గర ఉన్న కొవ్వును తగ్గించుకోవడం ద్వారా శ్వాస మార్గాలు కుచించకపోకుండా అడ్డుకోవచ్చు. దీనివల్ల గురక శబ్దం కూడా రాదు. ఇది మీ ఆరోగ్యానికి ఎంతో అవసరం కూడా.
గురక రాకుండా అడ్డుకోవడం కోసం మీరు ఎత్తుకు తగ్గ బరువు మాత్రమే ఉండాలి. ప్రతిరోజై చిన్న చిన్న వ్యాయామాలైన చేస్తూ ఉండాలి. ముఖ్యంగా అరగంట పాటూ నడవాలి. ఇవన్నీ త్వరలోనే మీ గురక సమస్యను తగ్గించే అవకాశం ఉంది.