Baba Vanga Future Predictions: మరో రెండు నెలల్లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నామని ప్రపంచమంతా ఎదురుచూస్తుంటే.. రాబోయే ఏడాది భయంకరంగా ఉండబోతుందని జోస్యాలు చెబుతున్నాయ్. ఇవి, అలాంటి ఇలాంటి జోస్యాలు కాదు. ప్రపంచానికి జోస్యం పవరేంటో చెప్పిన బాబా వంగా, నోస్ట్రడమస్ ఊహించిన విషయాలు. ఖండాలను మసిచేసే యుద్ధాలు, భూమిని ముంచేసే ప్రకృతి విలయం, ఏలియన్స్‌తో సంబంధం, కొత్త శక్తిని కనుక్కోవడం.. ఇలా, 2025 సంవత్సరం మానవ చరిత్రలో సంచలన మార్పులను చూస్తుందట! యుగాంతానికి 2025 ఎంట్రీ పాయింట్ అవుతుందట! ఇవన్నీ నమ్మొచ్చా..? అవి ఒట్టి మాటలేనని కొట్టి పారేయగలమా..? ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఈ జోస్యానికి బలం చేకూరుస్తున్నాయా..? 2025 గురించి వీళ్లిద్దరూ ఏం చెప్పారు..?
2025లో యూరప్‌లో భయంకరైన యుద్ధం
50 ఏళ్ల క్రితమే భవిష్యత్తును ఊహించిన బాబా వంగ.. 450 ఏళ్లకు ముందే ప్రపంచ గమనాన్ని రాసిన నోస్ట్రడమస్.. ఇద్దరి కాలాలు వేరు, ఇద్దరు చెప్పిన అంచనాలూ వేరే… అయితే, 2025 గురించి మాత్రం ఈ ఇద్దరూ ఒకే విధంగా ఊహించారు. రాబోయే విలయం గురించి దాదాపు ఒకే అభిప్రాయాలు వెల్లడించారు. ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని కలవరానికి గురిచేస్తోంది. “ఇలాంటి జోస్యాలు మాములేలే” అని కొట్టిపారేయడానికి వీలు లేకుండా.. గతంలో వీళ్లు చెప్పిన చాలా విషయాలు కళ్లముందు నిజమై కనిపించాయి. అందుకే, వీళ్ల అంచనాలు కొత్త భయాలకు కారణం అవుతోంది. 2025 ఘోర కలిని చూపిస్తుందనే కంగారు పుడుతోంది. మానవులతో గ్రహాంతరవాసుల పరిచయం నుండి రష్యా అధ్యక్షుడి పుతిన్ ప్రపంచాన్ని ఏలతాడనీ.. మనిషి రహస్యమైన ఒక కొత్త ఎనర్జీని కనిపెడతాడని ఇందులో ఉన్నాయి. భారీ షాక్ ఇచ్చే విషయం ఏంటంటే.. బాబా వంగ, నోస్ట్రాడమస్.. ఇద్దరి ఊహల ప్రకారం, 2025లో యూరప్‌లో భయంకరైన యుద్ధం జరుగుతుంది. ఇది చాలా విధ్వంసానికి కారణం అవుతుందని ఈ జోస్యులు అంచనా వేశారు.
ఉక్రెయిన్-రష్యా మధ్య ఈ యుద్ధం ముగిసి, రెండో సారి యుద్ధం
బాబా వంగ బతికున్న కాలంలో రచయిత వాలెంటిన్ సిడోరోవ్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పుతిన్ ‘కీర్తి’ గురించి చెప్పింది. అతన్ని తాకడం ఎవరి వల్లా కాదని చెప్పింది. ఆమే మాటల్లోనే వింటే.. ‘అన్నీ మంచులాగా కరిగిపోతాయి, ఒక్కటి మాత్రమే ఎవ్వరూ తాకలేరు- అది వ్లాదిమిర్ కీర్తి. రష్యా కీర్తి. అన్నింటినీ రష్యా తన మార్గం నుండి అడ్డు తొలగిస్తుంది. అది ఒక్కటే నిలబడుతుంది. చివరికి, ప్రపంచానికి ప్రభువు అవుతుంది’. ఇదీ, బాబా వంగ చెప్పిన జోస్యం. దీన్ని బట్టి, పుతిన్ నాయకత్వంలో రష్యా.. భవిష్యత్తులో ఎన్ని సవాళ్లు ఎదుర్కున్నప్పటికీ… ప్రపంచ ఆధిపత్య శక్తిగా అవతరిస్తుందని అనుమానం వస్తుంది. అలాగే, ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై నోస్ట్రడమస్ అంచనా ప్రకారం.. ఈ రెండు దేశాల మధ్య ఈ యుద్ధం ముగిసి, రెండో సారి యుద్ధం జరుగుతుందనీ.. 2025లో జరిగే ఈ యుద్ధం అత్యంత భయంకరంగా ఉంటుందని అంచనా వేశాడు. వీళ్లద్దరూ చెప్పిన జోస్యంలో నిజం ఎంతనేది అటుంచితే.. ప్రస్తుతం, అమెరికా, రష్యాల మధ్య ఆధిపత్య పోరు పీక్స్‌లో ఉంది. సెప్టెంబర్ 12న పుతిన్ చేసిన ప్రకటన ప్రకారం, పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌కు ఇచ్చిన ఆయుధాలు రష్యా లోపల ప్రయోగిస్తే అది భయానక యుద్ధానికి దారి తీస్తుందని చెప్పారు. దానికి నాటో దేశాలు, అమెరికా, యూరప్ కంట్రీలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని గట్టి వార్నింగ్ ఇచ్చారు.
Also Read: ఇజ్రాయిల్ మిసైళ్ల వర్షం.. రక్తంతో తడిచిన ఇరాన్
2043 నాటికి ముస్లింల పాలనలోకి యూరప్
ఇక, ఐరోపాలో యుద్ధం గురించి బాబా వంగ అంచనాతో పాటు, 2043 నాటికి యూరప్ ముస్లింల పాలనలోకి వస్తుందని.. 2076 నాటికి ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం తిరిగి వస్తుందని అంచనా వేశారు. అంటే, కమ్యూనిస్ట్ కంట్రీలుగా ఉన్న రష్యా, చైనాలు ప్రపంచాన్ని ఏలతాయనే అనుమానాలకు ఇది బలం చేకూరుస్తుంది. బాబా వంగ, 2025లో ఐరోపాలో క్రూరమైన యుద్ధాలు జరుగుతాయని హెచ్చరించింది. ఇదే విషయాన్ని, నోస్ట్రడమస్‌గా పాపులర్ అయిన, 16వ శతాబ్దానికి చెందిన మిచెల్ డి నోస్ట్రెడామ్ కూడా చెప్పాడు. ఐరోపా భూభాగాలు క్రూరమైన యుద్ధాల్లో పాల్గొంటాయని హెచ్చరించాడు. ఇది భారీ విధ్వంసం, భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగిస్తుందని అంచనా వేశాడు. అయితే, పుతిన్ ప్రారంభించిన ఉక్రెయిన్ యుద్ధం ఈ అంచనాలను నిజం చేస్తున్నట్లు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక, నోస్ట్రడమస్ చెప్పిన విషయాల్లో.. “పురాతన ప్లేగు శత్రువుల కంటే ఘోరంగా నష్టాన్ని కలిగిస్తుందని” కూడా చెప్పాడు. ఇది బ్రెజిల్‌లో అగ్రిపర్వతాల బూడిత, భారీ వరదలతో సహా ఇతర విపత్తులను సూచిస్తుంది. అలాగే, 2043 నాటికి యూరప్ ముస్లీంల వశం అవుతుందనే ఊహకు, బలం చేకూరుస్తూ.. ఇరాన్‌తో పాటు ఇస్లామిక్ దేశాలు మిడిల్ ఈస్ట్ యుద్ధంలో భాగంగా యూరప్‌కు వార్నింగ్‌లు ఇస్తూనే ఉన్నాయి.
2025లో భూమి పైకి గ్రహాంతర జీవులు రాక
బాబా వంగ ప్రవచనాల ప్రకారం, 2025లో భూమి పైకి గ్రహాంతర జీవులు రాబోతున్నారట. ఇది, ప్రపంచంలో కొత్త యుగానికి దారి తీస్తుందనీ… ఈ గ్రహాంతరవాసులు తమ ఉనికిని మానవాళికి తెలియజేస్తారని బాబా వంగ అంచనా వేసింది. ఇది, విశ్వంలో మనిషి స్థానాన్ని పూర్తిగా మారుస్తుందని చెప్పింది. అయితే, గ్రహాంతర జీవులతో మానవుల మొదటి ఎన్‌కౌంటర్ చాలా విచిత్రమైన పరిస్థితులలో జరుగుతుందని తెలిపింది. టెలీపతిలో ఇదొక పెద్ద పురోగతికి కారణం అవుతుందని అంచనా వేసింది. ఈ దశ మైండ్-టు-మైండ్ కమ్యూనియేషన్ టెక్నిక్‌ను పరిపూర్ణం చేసే అవకాశం ఉంది. గ్రహాంతర వాసులు ఏ ఉద్దేశాలతో భూమి పైకి వచ్చినప్పటకీ… 2025లో వారి రాక చరిత్రలో కీలక ఘట్టం అవుతుంది. ఇది మనిషి జాతులపై ఉన్న అభిప్రాయాలను మారుస్తుంది. విశ్వాన్ని మనిషి అర్థం చేసుకున్నదాని కంటే భిన్నంగా తర్వాతి పరిణామాలు కళ్లు తెరిపిస్తాయని ఈ అంచనాల ద్వారా అర్థమవుతుంది. నిజానికి, గ్రహాంతర జీవులను ఎదుర్కొనే ఈ అవకాశం చాలా కాలంగా మనిషి ఎదురు చూస్తోంది. ఇది అంతర్జాతీయంగా ఎప్పుడూ చర్చల్లో నానుతూనే ఉంది. ఈ దశలో, బాబా వంగ అంచనా ఖచ్చితమైనదని రుజువు చేయడానికి ఇప్పటికే చాలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
రహస్యంగా కప్పబడి ఉన్న ఒక కొత్త ఎనర్జీ సోర్స్
బాబా వంగ చెప్పిన గ్రహాంతరవాసుల అంచనాకు బలం చేకూరుస్తూ.. “లివింగ్ నోస్ట్రాడమస్”గా పేరున్న 37 ఏళ్ల, అథోస్ సలోమ్ కూడా ఇదే విషయాన్ని డైలీ స్టార్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 2028లో మానవులు తమ మధ్య జీవిస్తున్న గ్రహాంతర జీవుల ఉనికిని గుర్తిస్తారని చెప్పాడు. దీనికి తగ్గట్లే… ఆధునిక ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న శాస్త్రవేత్తల పరిశోధనలు ఈ అంచనాలకు దగ్గరగా కనిపిస్తున్నాయి. ఇక, 2025వ సంవత్సరంలో గ్రహాంతర జీవుల రాకను మించిన విషయాన్ని కూడా బాబా వంగ వెల్లడించింది. ప్రకృతిపై మన ప్రస్తుత అవగాహనను సవాలు చేసే విధంగా, ఇప్పటి వరకూ మనిషికి తెలియకుండా రహస్యంగా కప్పబడి ఉన్న ఒక కొత్త ఎనర్జీ సోర్స్‌ను మనుషులు కనుక్కుంటారని చెప్పింది. ఈ శక్తి చాలా స్వచ్ఛమైనదనీ.. దీనికి అంతం ఉండదని తెలిపింది. అయితే, ఈ ఎనర్జీని కొందరు దైవిక అంశంతో ముడిపెడుతుండగా… ఇది శాస్త్రీయంగా కనిపెట్టే మరో అద్భుతమని కొందరు నమ్ముతున్నారు. ఇంకొందరు, ఇది భూమి కంటే చాలా అభివృద్ధి చెందిన గ్రహాంతర నాగరికత నుండి భూమికి అందుతుందనీ… సాంకేతిక పురోగతితో ఇది సాధ్యమవుతుందని అంటున్నారు.