Formula E Racing Scam: బీఆర్ఎస్ నేతలు కష్టాలు వెంటాడుతున్నాయి. గడిచిన పదేళ్లలో చేసిన అవకతవకలపై రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. లేటెస్ట్‌గా హైదరాబాద్ లో నిర్వహించిన ఫార్ములా ఈ-రేస్ స్కామ్ ఒకటి వెలుగులోకి వచ్చింది.
నిబంధనలకు విరుద్ధంగా 55 కోట్ల రూపాయలను విదేశీ సంస్థకు ముట్టజెప్పారంటూ మున్సిపల్ అధికారులు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో ఈ యవ్వారం వెలుగులోకి వచ్చింది. దీంతో గత పాలకుల చుట్టూ ఉచ్చు బిగుసుకున్నట్లయ్యింది.
హైదరాబాద్‌లో ఫార్ములా ఈ-రేస్ నిర్వహణపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో గొప్పలు చెప్పుకుంది. ఆ తరహా రేస్ దేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉందని, అందులో హైదరాబాద్ ఒకటని ఢంకా బజాయించింది.
ఈ రేసు వెసుక అసలు వాస్తవాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. లేటెస్ట్‌గా ఫార్ములా ఈ-రేస్ నిర్వహణ కోసం నిబంధనలకు విరుద్ధంగా 55 కోట్ల రూపాయలు విదేశీ సంస్థకు చెల్లించినట్లు మున్సిపల్ అధికారులు తేల్చారు. దీనిపై విచారణ జరపాలంటూ అధికారులు ఏసీబీకి లెటర్ రాయడంతో బీఆర్ఎస్ నేతలకు టెన్షన్ మొదలైంది.
ALSO READ: నవంబర్ ఐదు.. తెలంగాణకు రాహుల్‌గాంధీ
గతేడాది హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో ఫార్ములా ఈ-రేస్ జరిగింది. ఈ రేస్ కోసం దాదాపు మూడు కిలోమీటర్ల మేరా ప్రత్యేకంగా ట్రాక్ ఏర్పాటు చేశారు. తొలి రేస్ సక్సెస్ కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించేందుకు ఫార్ములా ఈ-రేస్ నిర్వాహకులతో పట్టణాభివృద్ధి సంస్థ డీల్ కుదుర్చుకుంది.
ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా 55 కోట్ల రూపాయలను ఆ సంస్థకు చెల్లించింది. ఈ వ్యవహారమంతా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది. గత డిసెంబర్‌లో తెలంగాణలో ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
ఒప్పందంలోని అంశాలు పాటించకపోవడం వల్ల హైదరాబాద్‌లో నిర్వహించాల్సిన ఫార్ములా ఈ- రేస్ నుంచి తప్పుకుంటున్నామని గత డిసెంబర్‌లో నిర్వాహకులు ప్రకటించారు. దీంతో ఈ ఏడాది జరగాల్సిన రేసు ఆగిపోయింది.
పద్దతి ప్రకారం.. హెచ్ఎండీఏ బోర్డు సభ్యులతోపాటు ఆర్థిక శాఖ అనుమతి తీసుకున్న తర్వాత ఫార్ములా నిర్వహణ సంస్థకు నిధులు చెల్లించాలి. అలాంటిదేమీ జరక్కుండానే నేరుగా నిధులను ఆ సంస్థకు ఇచ్చేశారు.
విదేశీ సంస్థకు నిధులు చెల్లింపులు జరిపేటప్పుడు ఆర్బీఐ అనుమతి తీసుకోవాలి. అవేమీ పట్టించుకోలేదు అప్పటి అధికారులు. దీనిపై అప్పటి అధికారులకు ప్రభుత్వం మెమో జారీ చేసింది. ప్రక్రియ వేగంగా జరగాలనే ఉద్దేశంతో చెల్లింపులు జరిపామన్నది అధికారుల వెర్షన్.
ఈ వ్యవహారమంతా పురపాలక శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ శాఖకు మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. దీనిపై విచారణ చేపట్టాలని మున్సిపల్ అధికారులు ఏసీబీ లేఖ రాయడంతో బీఆర్ఎస్ వెన్నులో వణుకు మొదలైంది. ప్రభుత్వం రేస్ స్కామ్ వ్యవహారాన్ని ఏసీబీకి ఇస్తుందా? లేదా సీఐడీకి ఇస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.