Tirumala Updates: తిరుమల మాడవీధులు గోవిందా నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. ఎటుచూసినా భక్తజనసందోహం తిరువీధులలో కనిపిస్తోంది. అలిపిరి నుండి గల కాలినడక దారి భక్తులతో నిండుగా కనిపిస్తోంది. శ్రీ శ్రీనివాసా శరణు.. శరణు అంటూ భక్తులు కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడి దర్శనం కోసం బారులు తీరుతున్నారు. దీనితో భక్తుల సేవలో తరించే టీటీడీ, ఎటువంటి అసౌకర్యం కలుగకుండా.. అన్ని చర్యలు చేపట్టింది. అసలే దీపావళి పర్వదినం రాబోతోంది. దీపావళి ఆస్థానం సైతం స్వామి వారి సన్నిధిలో నిర్వహించడం ఆనవాయితీ. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా ఇప్పటికే టీటీడీ పూర్తి చేసింది. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా, దేశ విదేశాల నుండి స్వామి వారి దర్శనార్థం తిరుమలకు చేరుకుంటున్నారు.
శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. అలాగే సోమవారం స్వామి వారిని 59140 మంది భక్తులు దర్శించుకోగా.. 16937 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాదు స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 3.31 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
దీపావళి శుభాకాంక్షలు తెలిపిన టీటీడీ ఈవో
ఈనెల 31వ తేదిన దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ ఈవో జె.శ్యామలరావు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవమని శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. చెడుపై సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటారని తెలిపారు. అందరూ ధర్మమార్గంలో నడవడం ద్వారా శ్రీవారి కృపకు పాత్రులు కావాలని టీటీడీ ఈవో కోరారు.