World’s fattest cat| ప్రపంచంలోనే అత్యంత లావుగా, బరువుగా ఉన్న పిల్లి గా పేరుగాంచిన మార్జాలం పేరు క్రంబ్స్. ఇది రష్యాన్ పిల్లి కావడంతో దీన్ని రష్యన్ భాషలో క్రోశిక్ అని పిలుస్తారు. దీని బరువుగా 17 కేజీలు. అంటే ఒక మూడు, నాలుగేళ్ల పిల్లాడి బరువంత ఉంటుంది. అయితే ఈ పిల్లి ఇటీవలే చనిపోయింది. ఈ వార్త విని ప్రపంచంలోని పిల్లి ప్రేమికులుందరూ బాధపడుతున్నారు. ఇక్కడ మరో విశేషమేమిటంటే ఈ పిల్లి డైట్ కంట్రోల్ చేయడం ప్రారంభించిన వారం రోజుల తరువాతనే మరణించింది.
వివరాల్లోకి వెళితే.. రష్యాలో కొన్ని నెలల క్రితం ఒక ఆస్పత్రి బేస్మెంట్లో క్రోషిక్ పిల్లి ఒక వ్యక్తికి కనిపించింది. క్రోషిక్ చాలా అందంగా బొద్దుగా ఉండడంతో దాన్ని ఒక జంతు ప్రేమికుడు దత్తత తీసుకున్నాడు. అప్పటికే క్రోషిక్ వయసు 13 సంవత్సరాలు. దాని బరువు 17 కేజీలుగా ఉంది.
దత్తత తీసుకునే ముందు క్రోశిక్ రోడ్డుపై పడి ఉన్న చెత్త, బిస్కెట్స్, విస్కీ, సూప్ లాంటివి తిని కడుపునింపుకునేది. దీంతో అది బరువు బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ఆ పిల్లి ప్రేమికుడు క్రోశిక్ని దత్తత తీసుకున్నాక కూడా అది సరిగా నడవలేకపోయేది. కాస్త దూరం నడవగానే అలసిపోయి కూర్చునేది. క్రోశిక్ ఆరోగ్య సమస్యలను గమనించిన ఆ జంతు ప్రేమికుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. క్రోశిక్ చేత డైటింగ్, ఎక్సర్సైజ్ చేయించడం మొదలుపెట్టాడు. అయితే ట్రెడ్ మిల్ పైన క్రోశిక్ వాకింగ్ చేయలేకపోయేది. దీంతో క్రోశిక్ కోసం నీటిలో ట్రెడ్ మిల్ ఏర్పాటు చేశారు. నీటిలో అయితే క్రోశిక్ బరువు తేలికగా అవుతుంది. అప్పుడు క్రోశిక్ నడవగలుగుతుందని ఐడియాతో అలా చేశారు.
దాంతోపాటు క్రోశిక్ కు ఆరోగ్యకరమైన డైట్ ఇచ్చేవారు. అలా మూడు నెలల్లోనే క్రోశిక్ 6.5 కేజీలు బరువు తగ్గింది. క్రోశిక్ చాలా ఫిట్ గా ఉండడం చూసి దాన్ని ఓనర్ చాలా సంతోష పడ్డాడు. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. గత శనివారం అక్టోబర్ 26, 2024న క్రోశిక్ అనుకోకుండా చనిపోయింది. క్రోశిక్ అంత ఆరోగ్యంగా కనిపించేది.. కానీ అలా ఒక్కసారిగా చనిపోయేసరికి.. క్రోశిక్ మృతదేహానికి పోస్ట్ మార్టం చేశారు.
Also Read: సహజీవనం చేసిన వ్యక్తిపై రేప్ కేసు పెట్టిన యువతి.. ఈజీగా బెయిల్ తెచ్చుకున్న నిందితుడు.. ఎలాగంటే?
పోస్ట్ మార్టం రిపోర్ట్ లో చాలా షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. క్రోశిక్ సంవత్సర కాలంగా క్యాన్సర్ తో బాధపడుతోంది. క్రోశిక్ కడుపులో, ప్రేగుల్లో, లివర్ పై క్యాన్సర్ ట్యూమర్లు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఇక్కడ విచిత్రమేమిటంటే శరీరం లోపల అంత క్యాన్సర్ ఉన్నా క్రోశిక్ ఎప్పుడూ అనారోగ్యంగా కనిపించలేదట. దీనికి కారణం పిల్లులకు ఎక్కువ రోగనిరోధక శక్తి ఉండడమే.
క్రోశిక్ క్యాన్సర్ గురించి ముందే తెలిసి ఉంటే దానికి చికిత్స చేయించే వాడినని దాన్ని దత్తత తీసుకన్న వ్యక్తి తెలిపాడు. అయినా క్రోశిక్ ఎక్కువ అనారోగ్యంగా కాకుండా హాయిగా ఆడుతూ పాడుతూ ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయినందుకు తనకు సంతృప్తిగానే ఉన్నట్లు చెప్పాడు.