Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ రియాలిటీ షోలో ఆటలో పాల్గొనే వారు ఎంత ముఖ్యమో.. ఆ ఆటకు సంచాలకులుగా వ్యవహరించే వారు కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఆటలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అనే విషయాన్ని సంచాలకులే నిర్ణయించాలి. వారి నిర్ణయం చెప్పిన తర్వాత బిగ్ బాస్ కూడా దానికి అడ్డుచెప్పరు. అలాంటి సంచాలకురాలి స్థానాన్ని గంగవ్వకు అప్పగించారు బిగ్ బాస్. ఇది కంటెస్టెంట్స్‌లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడంతో పాటు ఆడియన్స్ కూడా సహనం కోల్పోయేలా చేసింది. దీనివల్ల టాస్కుల్లో వేగంగా ఆడే కంటెస్టెంట్స్ కూడా స్లో అయ్యారు. ఇక తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్లో తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా వాడుకోవాలని ఫిక్స్ అయ్యింది హరితేజ.
టీమ్స్ విభజన
ప్రస్తుతం బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ అంతా నాలుగు టీమ్స్‌గా విడిపోయారు. రెడ్ టీమ్‌లో ప్రేరణ, గౌతమ్ ఉండగా దానికి యష్మీ కెప్టెన్. బ్లూ టీమ్‌లో ఉన్న నిఖిల్, అవినాష్‌కు హరితేజ కెప్టెన్. గ్రీన్ టీమ్‌లో ఉన్న విష్ణుప్రియా, టేస్టీ తేజకు నబీల్ కెప్టెన్. యెల్లో టీమ్‌లో ఉన్న నయని పావని, రోహిణికి పృథ్వి కెప్టెన్. ఇక ఇప్పటినుండి జరగబోయే బీబీ ఇంటికి దారేది టాస్కుల్లో కెప్టెన్స్ చెప్పిన మాటే టీమ్ వినాలి. గంగవ్వ తన ఇష్టప్రకారంగా బ్లూ టీమ్‌లో చేరింది. ప్రతీ టాస్క్ ముగిసిన తర్వాత విన్ అయిన టీమ్‌కు రెండుసార్లు డైస్ రోల్ చేసే అవకాశం దొరుకుతుంది. దాంతో వారు ఆటలో ముందుకు వెళ్లొచ్చు. అంతే కాకుండా ఒక టీమ్‌కు యెల్లో కార్డ్ ఇచ్చి వారిని ఆటలో వెనక్కి వెళ్లేలా చేయొచ్చు.
Also Read: ఇదేం కరువు రా బాబు.. పృథ్వికి విష్ణు ప్రియ స్ట్రాంగ్ వార్నింగ్..
హరితేజ ఖతర్నాక్
బీబీ ఇంటికి దారేదిలో మొదటి టాస్క్ మొదలయ్యింది. గంగవ్వ ఆటలో పాల్గొనలేదు కాబట్టి తనను సంచాలకురాలిగా వ్యవహరించమన్నారు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో నాలుగు టీమ్స్ విడివిడిగా ఒక స్నో మ్యాన్‌ను తయారు చేయాలి. వేగంగా ఎవరు చేశారు అనేదానితో పాటు కరెక్ట్‌గా ఎవరు చేశారు అనేది కూడా విన్నర్‌ను డిసైడ్ చేస్తుంది. అయితే ముందుగా బ్లూ టీమ్ స్నో మ్యాన్‌ను పూర్తి చేయడంతో అది కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకోకుండా వారే విన్నర్స్ అని ప్రకటించింది గంగవ్వ. గెలిచిన బ్లూ టీమ్.. రెడ్ టీమ్‌కు యెల్లో కార్డ్ ఇచ్చింది. ఆ తర్వాత రెండుసార్లు డైస్ రోల్ చేయగా ఒకసారి 6వ నెంబర్ వచ్చింది, ఒకసారి 3వ నెంబర్ వచ్చింది. ఇదే అవకాశం అనుకున్న హరితేజ 6వ నెంబర్ తను తీసుకొని 3వ నెంబర్ అవినాష్‌కు ఇచ్చింది.
కంటెస్టెంట్స్ గొడవ
గంగవ్వ సంచాలకురాలిగా రెండో టాస్క్ మొదలయ్యింది. ఈ టాస్క్‌లో ఎవరి టీమ్ ట్యాంక్‌లో ఉన్న నీటిని వారు కాపాడుకోవాలి. టీమ్‌లోని ఇద్దరు సభ్యులు ట్యాంక్‌ను కాపాడుకుంటూ ఉండగా.. మరొక సభ్యుడు లైన్ బయట ఉండాలి. బజర్ మోగిన ప్రతీసారి ముందుగా లైన్ లోపల అడుగుపెట్టే ఇద్దరు సభ్యులకే ఇతర టీమ్ ట్యాంక్స్లోని వాటర్‌ను ఖాళీ చేసే అవకాశం లభిస్తుంది. బజర్ మోగిన వెంటనే అసలు లైన్లో ముందుగా అడుగుపెట్టింది ఎవరో గమనించలేని సంచాలకురాలుగా గంగవ్వ.. కన్ఫ్యూజ్ అయ్యింది. దానివల్ల కంటెస్టెంట్స్ మధ్య గొడవలు కూడా అయ్యాయి. మొదటి రౌండ్ ముగిసే సమయానికి బ్లూ టీమ్ ఓడిపోవడంతో గంగవ్వ స్థానంలోకి హరితేజ సంచాలకురాలిగా వచ్చింది.