Salaar 2 – NTR 31: ఏకకాలంలో ఒక వ్యక్తి ఒక పని మీద మాత్రమే పూర్తి కాన్సన్ట్రేట్ చేస్తే ఆ పనికి ప్రతిఫలం లభిస్తుంది. అలా కాదని ఒకే సమయంలో రెండు పనులు చేయాల్సి వస్తే ఆ వ్యక్తికి శారీరక శ్రమతో పాటు మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. తద్వారా రెండింటికి న్యాయం చేయలేకపోవచ్చు. అందుకే ఏదైనా ఒక పని మొదలుపెట్టేటప్పుడు ఆ పని పూర్తయిన తర్వాతనే ఇంకో పని చేయాలి అని పెద్దలు చెబుతారు. అయితే ఈ మధ్యకాలంలో ఈ విషయాలకు సినీ డైరెక్టర్లు కాస్త వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఉదాహరణకు ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ (Shankar ) అటు కమలహాసన్ (Kamal Hassan) తో భారతీయుడు -2 (Indian-2), ఇటు రామ్ చరణ్ (Ram Charan) తో గేమ్ ఛేంజర్ (Game changer) సినిమాల షూటింగ్లను ఏకకాలంలో ప్రారంభించారు. దాని ప్రతిఫలం అటు భారతీయుడు -2 సినిమా విడుదలై ఘోర పరాభవాన్ని చవిచూసింది. దాంతో రామ్ చరణ్ అభిమానులలో టెన్షన్ మొదలయ్యింది. ఇటు డిసెంబర్లోనే విడుదల కావాల్సిన గేమ్ ఛేంజర్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి పోస్ట్ పోన్ చేశారు. మరి అక్కడ ఈ సినిమా సంక్రాంతి పోటీని తట్టుకొని ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
శంకర్ లా రెండు సినిమాలు ప్రారంభించిన ప్రశాంత్ నీల్..
ఇలా డైరెక్టర్ ఒకేసారి రెండు పడవల మీద ప్రయాణం మొదలుపెట్టేసరికి ఒక పడవ కాస్తా బోల్తా కొట్టింది. ఇంకో పడవ సక్సెస్ కోసం కొట్టుమిట్టాడుతోంది. ఇంత పెద్ద ఎగ్జామ్ పుల్ ను దృష్టిలో పెట్టుకోకుండా ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కూడా ఇలాంటి తప్పే చేస్తున్నారని సినీవర్గాలు హెచ్చరిస్తున్నాయి. కేజీఎఫ్ చిత్రాలతో పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ (Prabhas ) తో సలార్ -2 (Salaar-2), ఎన్టీఆర్ తో ఎన్టీఆర్ 31(#NTR -31) సినిమా ప్రకటించారు. అంతేకాదు ఎన్ టీ ఆర్ తో సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా పూర్తిచేసి, 2026 జనవరి 9వ తేదీన విడుదల చేస్తామని రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.
నిరాశ వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్..
ఇలాంటి కష్టతరమైన పరిస్థితుల్లో ప్రశాంత్ నీల్ అటు సలార్ -2 ఇటు ఎన్టీఆర్ 31 చిత్రాల షూటింగ్లను పూర్తి చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి ప్రభాస్ వరుస ఫ్లాప్ లతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో సలార్ సినిమా ఆయన కెరీర్ కు మంచి ఊపునిచ్చింది. ఈ క్రమంలోనే సలార్ -2 సినిమా పూజా కార్యక్రమాలకు డార్లింగ్ బర్త్ డే రోజు కొబ్బరికాయ కొట్టేశారు నీల్. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కూడా స్పీడ్ గా జరుగుతోంది. ఇద్దరు ప్రాణ స్నేహితుల కథను సలార్ సీజ్ ఫైర్ లో చూపిస్తే.. ఆ తర్వాత వారు శత్రువులుగా మారిన స్టోరీ తో రెండవ పార్ట్ శౌర్యాంగపర్వం సిద్ధం అవుతోంది. ఇదే స్పీడ్ కొనసాగించి 2025 ఎండింగ్ కి రిలీజ్ చేసే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరొకవైపు 2026 జనవరి 9వ తేదీన ఎన్టీఆర్ సినిమా విడుదల చేస్తామని రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఇలా ఇద్దరు పాన్ ఇండియా హీరోలతో ప్రశాంత్ నీల్ ఒకేసారి సినిమాలు చేయడం ఆరంభించి, రిస్క్ చేస్తున్నాడేమో అని అటు స్టార్ హీరోల అభిమానులు సైతం కలవరపాటుకు గురి అవుతున్నారు. మరి దీనిపై ప్రశాంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఏదిఏమైనా ప్రశాంత్ శంకర్ లా ఆలోచించకూడదని కూడా కోరుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.