Babu Mohan: తెలంగాణలో టీడీపీ బలోపేతం అవుతుందా? కారు పార్టీ ఖాళీ అవుతుందా? తెలంగాణలో నేతలు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారా? టీడీపీ హైకమాండ్‌తో కొందరు టచ్‌లో ఉన్నారా? పార్టీ మెంబర్‌షిప్ నేపథ్యంలో నేతలు బయటకు వస్తున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
మాజీ మంత్రి, నటుడు బాబు మోహన్ టీడీపీలో చేరారు. ఆందోల్ నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు మెంబర్‌షిప్‌తో తీసుకున్న ఫోటోను విడుదల చేశారు.
గతంలో బాబుమోహన్ బీజేపీలో ఉండేవారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కొద్దిరోజుల కిందట హైదరాబాద్ వచ్చిన టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబును పార్టీ ఆఫీసులో కలిశారు. అప్పుడే పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
రెండురోజుల కిందట సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది టీడీపీ పార్టీ. సీఎం చంద్రబాబు పిలుపు మేరకు ఏపీలోని అన్ని జిల్లాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. తెలంగాణలోనూ సభ్యత్వం నమోదు కార్యక్రమం ఊపందుకుంది. పలువురు కీలక నేతలు సభ్యత్వం తీసుకున్నారు. మున్ముందు వారి జాబితా పెరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ALSO READ: నోరు జాగ్రత్త.. హైకమాండ్ నుంచి బీఆర్ఎస్ నేతలకు వర్తమానం..
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు నేతలు టీడీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్‌లో సగానికి పైగా ఉన్న నేతలంతా టీడీపీకి చెందినవారే. తమకున్న పాత పరిచయాల నేపథ్యంలో ఆయా నేతలు మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు హంగామా చేస్తున్నాయి.
గతంలోకి ఒక్కసారి వెళ్తే.. ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న సీఎం చంద్రబాబును మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా మాటల సారాంశాన్ని తీగల మీడియాతో పంచుకున్నారు. తెలంగాణలో కూడా టీడీపీ మరింత బలోపేతం కావాలన్నది బాబు ఆలోచనగా పేర్కొన్నారు.
తాను టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారాయన. టీటీడీపీని మరింత పటిష్టం చేసేలా, బాబు ఆలోచనలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. తెలంగాణలో టీడీపీకి బలమైన కేడర్ ఉంది. ఈ నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయడానికి కీలక నేతలు రంగంలోకి దిగినట్లు సమాచారం. గతంలో మాదిరిగా కాకుండా ఉనికి కాపాడుకొనేందుకు ప్రయత్నిస్తోందన్న వాదన కూడా లేకపోలేదు.