EPAPER

Amoy Kumar IAS: పొలిటికల్ బాంబ్ 3: ఈడీకి అప్రూవర్‌‌గా అమోయ్ కుమార్? 3 రోజుల విచారణ అందుకేనా?

Amoy Kumar IAS: పొలిటికల్ బాంబ్ 3: ఈడీకి అప్రూవర్‌‌గా అమోయ్ కుమార్? 3 రోజుల విచారణ అందుకేనా?

అమోయ్.. ది అప్రూవర్..?
పొలిటికల్ బాంబ్ 3
⦿ ఆ బడా లీడర్లకు ఇక బ్యాండ్ బాజా!
⦿ ఆనాడు కీ రోల్ పోషించిన ఆఫీసర్ల తంటా
⦿ స్వేచ్ఛ ఎక్స్‌క్లూజివ్ స్టోరీ


⦿ ఈడీకి అప్రూవర్‌‌గా మారిన అమోయ్ కుమార్?

⦿ మూడు రోజుల విచారణ జరిపింది అందుకేనా?


⦿ ఒక్కొక్కటిగా బయటకొస్తున్న ల్యాండ్ స్కాములు

⦿ బడా కంపెనీలకు అప్పనంగా భూముల అందజేత

⦿ ధరణి మాటున దర్జాగా సాగిన భూ దోపిడీ

⦿ అమోయ్ అప్రూవర్ అయితే ఉచ్చు బిగుసుకునేది ఎవరికి?

⦿ కేసీఆర్ ఫ్యామిలీ, బడా కంపెనీలకు ఈడీ సెగ తగలనుందా?

⦿ విచారణ నేపథ్యంలో ఢిల్లీకి చక్కర్లు కొడుతున్న మాజీ సీఎస్ సోమేష్

⦿ కీలకంగా వ్యవహరిస్తున్న మరో సీనియర్ అధికారి

⦿ హస్తినలో లాబీయింగ్ చేస్తూ కేసు తమవైపు రాకుండా ప్రయత్నాలు

⦿ అమోయ్ లావాదేవీలు, ఆస్తులు, బినామీ లింక్స్‌పై ఈడీ ఫోకస్

⦿ ఫోన్ కాల్ డేటాపైనా ఆరా

⦿ దీపావళికి పేలుతున్న మూడో బాంబ్ ఇదేనా?

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809

స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చింది. భూ వివాదాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో ధరణిని తీసుకొచ్చినట్టు చెప్పుకొచ్చింది. కానీ, అనుకున్నదొక్కటి, అయినదొక్కటి అన్నట్టు ధరణి మాటున జరిగిన కబ్జాలు కోకొల్లలు. ధరణి వచ్చాకే లిటిగేషన్ భూములకు రెక్కలొచ్చాయి. చాలా ప్రభుత్వ భూములు పట్టా భూములుగా మారిపోయాయి. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దదే ఉంటుంది. ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ఐఏఎస్ అమోయ్ కుమార్, ధరణి పేరుతో సాగించిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడంతో మరోసారి ధరణిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో ఈడీకి అమోయ్ అప్రూవర్‌గా మారినట్టు సమాచారం. ఇదే నిజమైతే, కేసీఆర్ ఫ్యామిలీకి, బడా కంపెనీలకు ఈడీ సెగ తగిలే ఛాన్స్ ఉంటుంది. దీపావళి సందర్భంగా పొలిటికల్ బాంబులు పేలతాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగా, ధరణి, అమోయ్ రూపంలో బాంబ్ పేలనుందని అంతా అనుకుంటున్నారు.

మూడు రోజుల సుదీర్ఘ విచారణ

భూదాన్ భూముల వ్యవహారానికి సంబంధించి నమోదైన కేసుల నేపథ్యంలో ఈడీ ఎంటర్ అయింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా అమోయ్ ఉన్న సమయంలో జరిగిన ఈ భూ స్కాం వెనుక చాలా తతంగం నడిచింది. తాను రూల్ ప్రకారమే అంతా చేశానని అమోయ్ అంటుండగా, అతని ఆస్తులు, లావాదేవీలపై గుచ్చి గుచ్చి అధికారులు ప్రశ్నించడంతో, అప్రూవర్‌గా మారినట్టుగా సమాచారం. అందుకే మూడు రోజులపాటు విచారణ జరిగినట్టు తెలుస్తోంది. కేసుకు సంబంధించిన వివరాల్ని, ఒకటి లేదా రెండు రోజుల్లో విచారణ పూర్తి చేయొచ్చు. కానీ, అమోయ్ చిట్టా చాలా పెద్దగా ఉండడంతో, ఎవరి ప్రోద్బలంతో ఇదంతా చేశారనే అంశంలో కూపీ లాగేందుకే ఈడీ సుదీర్ఘ విచారణ జరిపిందని, ఈ క్రమంలోనే అమోయ్ అప్రూవర్‌గా మారినట్టుగా తెలుస్తోంది.

కేసీఆర్ ఫ్యామిలీకి, బడా కంపెనీలకు చిక్కులే!

కేసీఆర్ ప్రభుత్వంలో భూముల ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా పరిధిలో భూముల పందేరం కొనసాగింది. లిటిగేషన్ భూముల కబ్జాలు, బెదిరింపులు ఎక్కువయ్యాయి. అదే సమయంలో ధరణి పేరుతో దర్జాగా బడా కంపెనీలకు భూములు అధికారంగా, అనధికారికంగా చేరాయి. దీని వెనుక అమోయ్ కీలక పాత్ర పోషించారు. ఇష్టం వచ్చినట్టు అప్రూవల్ ఇచ్చేసి చాలామందిని ముంచేశారు. ఎన్ని విమర్శలు వచ్చినా ఆనాటి ప్రభుత్వం పట్టించుకున్నది లేదు. దీంతో ప్రభుత్వ పెద్దల పాత్రపై అనుమానాలున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ ఫ్యామిలీని కేటీఆర్, కవిత, సంతోష్, హరీష్ రావు రంగారెడ్డి జిల్లా భూముల వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయినట్టు ప్రచారం ఉంది. ఇప్పుడు అమోయ్ అప్రూవర్ అయితే వీరందరికీ ఉచ్చు బిగుసుకునే ఛాన్స్ ఉంది. అలాగే, బడా కంపెనీలకు కూడా ఈడీ సెగ తగలడం ఖాయం.

ఈడీకి అమోయ్ కండిషన్స్?

విచారణ సందర్భంగా వందల ప్రశ్నలు వేశారు ఈడీ అధికారులు. ముందు ఎంత కవర్ చేసుకున్నా, తర్వాత అమోయ్ ఓపెన్ కావాల్సి వచ్చింది. గోపాన్‌పల్లి భూ వ్యవహారాలు, బినామీల రూపంలో ఉన్న నగదుపై ఈడీ ఫోకస్ చేసింది. దానికి సంబంధించిన వివరాలతో గుచ్చి గుచ్చి ప్రశ్నించింది. అంతేకాదు, అమోయ్ ఆస్తుల చిట్టాను కూడా అతని ముందు ఉంచి, ఆనాడు జరిగిన నగదు లావాదేవీలపై వివరాలు అడిగినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో చేసేదేం లేక అమోయ్ అప్రూవర్ అయినట్టుగా తెలుస్తోంది. ఎలాంటి ఆస్తులు అటాచ్ మెంట్ చేయకుండా, తనను ఇబ్బంది పెట్టకుండా, తాను నామమాత్రంగా ఉన్నానని, అందరికీ లబ్ధి చేకూర్చి తాను ఎలాంటి తప్పు చేయలేదని ఈడీ ముందు వాపోయిన అమోయ్, పూర్తి సహకారం అందిస్తానని చెప్పినట్టుగా సమాచారం.

ఢిల్లీలో ఆ ఇద్దరు

ఓవైపు అమోయ్‌ని ఈడీ విచారిస్తుండగా, గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మాజీ సీఎస్ సోమేష్ కుమార్, మరో అధికారి ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారు. హస్తినలో లాబీయింగ్ చేస్తూ కేసును తమ వైపు రాకుండా చూసుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. వీరిద్దరూ భూముల వ్యవహారాల్లో తలదూర్చి సెటిల్మెంట్లు చేసినట్టుగా ఆరోపణలున్నాయి. అమోయ్‌ను వెనుకుండి నడిపించారని, అతను నోరు విప్పితే, తమకు చిక్కులు తప్పవని లాబీయింగ్‌లకు పాల్పడుతున్నట్టు సమాచారం. ఈడీ వారి దాకా వెళ్తే గత ప్రభుత్వ పెద్దలకు ఉచ్చు బిగుసుకోవడం ఖాయమని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Also Read: PAC Meeting : పీఏసీ సమావేశంలో రసాభాస.. అరెకపూడి గాంధీని నిల‌దీసిన బీఆర్ఎస్

అమోయ్ అవినీతి లీలలు

1. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేట్ గ్రామం సర్వే నెంబర్ 63లో ప్రభుత్వానికి 42 ఎకరాల సర్కార్ భూమి ఉండేది. ఈ ప్రాంతంలో ఎకరం భూమి సుమారు రూ.50 కోట్లు ఉంటుంది. అంటే, ఈ మొత్తం భూమి విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.2,100 కోట్లు ఉంటుంది. సెత్వార్ రికార్డులను పరిశీలిస్తే ఇప్పటికీ ఈ భూమి ప్రభుత్వ ల్యాండ్‌గానే రికార్డుల్లో నమోదై ఉంది. దీనిపై ప్రస్తుతం ఓ ప్రైవేట్ కంపెనీ తరపున కోర్టులో కేసు నడుస్తోంది. ఈ పంచాయితే కోర్టులో ఉండగానే అప్పటి కలెక్టర్ అమోయ్ 2022 డిసెంబర్‌లో దీనికి పట్టాలిచ్చేశారు.

2. శేరిలింగంపల్లి మండలం గోపన్ పల్లిలోని సర్వే నెంబర్ 124/10, 11లలో ప్రభుత్వానికి 50 ఎకరాల భూమి ఉంది. దీని విలువ బహిరంగ మార్కెట్‌లో ఎకరం రూ.40 కోట్ల చొప్పున పలుకుతుంది. ఈ లెక్కన ల్యాండ్ రూ.2 వేల కోట్ల వరకూ ఉంటుంది. ఇంతటి విలువైన భూమికి తమకు ఎన్వోసీ ఇవ్వాలని గతంలో సిరిస్ అనే కంపెనీ సీసీఎల్ఏకు దరఖాస్తు పెట్టుకోగా, అప్పట్లో ఆ కంపెనీ అప్లికేషన్‌ను రిజెక్ట్ చేశారు. కానీ, అమోయ్ కుమార్ దీన్ని పట్టా భూమిగా మార్చేసి వారికి ఆయాచిత లబ్ధి చేకూర్చారు.

3. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం శేరిలింగంపల్లి గ్రామం సర్వే నెంబర్ 90, 91 టు 102లోని 110 ఎకరాల భూమిని 1964, 65లో అప్పటి ప్రభుత్వం అలూమిని కంపెనీకి కేటాయించింది. ఈ భూమి ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో ఎకరం రూ.50 కోట్లు పలుకుతోంది. దీనిపై ప్రభుత్వం అలూమిని కంపెనీ, అబుబకర్ అనే వ్యక్తుల మధ్య సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తోంది. ఈ వ్యవహారాన్ని పరిష్కారించాలని సుప్రీం ఓ కమిషన్ ఏర్పాటు చేసి, దాని బాధ్యతలను జస్టిస్ నర్సింహారెడ్డికి అప్పగిస్తూ రిపోర్టు సబ్మిట్ చేయాలని ఆదేశించింది. అయితే, కొన్ని అనివార్య కారణాల రీత్యా ఇప్పటి వరకూ ఈకేసులో జస్టిస్ నర్సింహారెడ్డి సుప్రీంకు నివేదికను అందజేయలేదు. సుప్రీంలో పెండింగ్‌లో ఉండగానే ఈ వ్యవహారంలో అమోయ్ కుమార్, తహశీల్దార్ వంశీ మోహ‌న్, అప్ప‌టి రంగారెడ్డి జిల్లా స‌ర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ ఏడీ శ్రీనివాస్‌లు క‌లుగ‌జేసుకొని ఓ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు.

4. శేరిలింగంపల్లి మండలం మాదాపూర్‌లో సర్వే నెంబర్ 68లో సుమారు 5ఎకరాల ప్రభుత్వ భూమిని పట్టాగా మార్చారు. దీని విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు ఎకరానికి రూ.60 కోట్లు, మొత్తం భూమి విలువ రూ.300 కోట్లు. ఇంత విలువైన భూమిని బాధత్య గల కలెక్టర్ హోదాలో ఉన్న అమోయ్ కుమార్, శేరిలింగంపల్లి తహశీల్దార్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు స్వార్థ ప్రయోజనాల కోసం ఇతరులకు దారాదత్తం చేశారు.

5. హఫీజ్ పేట్ గ్రామంలోని సర్వే నెంబర్ 80లోని భూమి ప్రభుత్వానికి సంబంధించింది. ప్రస్తుతం ఈ భూమిపై కోర్టులో కేసు నడుస్తోంది. ఈ భూమితో పాటు కొండాపూర్ గ్రామ శివారులోని సర్వే నెంబర్ 87, 88ల్లోని భూమి కలుపుకొని పట్టాలు మంజూరు కావడం విస్మయం కల్గించే విషయం. ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్‌లో ఎకరం రూ.50 కోట్ల చొప్పున మొత్తం రూ.500 కోట్లు పలుకుతోంది. ఇంత విలువైన భూమికి అమోయ్ కుమార్, ఆయన తాబేదారు ఆఫీసర్లు పట్టాలిచ్చేశారు.

6. శంకరపల్లి మండలం మోకిల – కొండాపూర్ గ్రామాల మధ్య 150 ఎకరాల భూమి వివాదాస్పదంగా ఉంది. ఈ భూమి ఏ గ్రామ పరిధిలోకి వస్తుందనే అంశంపై క్లారిటీ లేదు. వాస్తవానికి సర్వే నెంబర్స్ లేని భూములను బిల్లా దాఖల ల్యాండ్స్ అని పిలుస్తుంటారు. వీటిపై హక్కు రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. కానీ, ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోకుండా అమోయ్ కుమార్ ఓ ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టారు. ఈ భూమికి 555 అనే సర్వే నెంబర్‌ను క్రియేట్ చేసి ప్రైవేట్ వ్యక్తులు ప్లాట్లు చేసుకునేందుకు దారి చూపించారు.

7. వట్టినాగులపల్లి గ్రామం సర్వే నెంబర్స్ 186, 187లలో 20 ఎకరాల భూదాన్ భూములుండేవి. ఈ భూమి బహిరంగ మార్కెట్‌లో సుమారు ఎకరాకు రూ.30 కోట్ల వరకూ పలుకుతోంది. అయితే ఇంతటి విలువైన ల్యాండ్‌ను అమోయ్ కుమార్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, హరీష్ రావు అనుయాయులకు కట్టబెట్టారు. అమోయ్ నిర్ణయం వల్ల సుమారు రూ.600 కోట్ల స్కాం జరిగినట్లు ఆరోపణలున్నాయి.

8. గండిపేట్ మండలం ఖానాపూర్ గ్రామంలోని 150 ఎకరాల బిల్లా దాఖలు భూమి ఉంది. దీని విలువ బహిరంగ మార్కెట్లో రూ.6,000 కోట్లుంటుంది. కానీ, ఇంతటి విలువైన ల్యాండ్‌కు 65 అనే సర్వే నెంబర్‌ను క్రియేట్ చేసి ప్రతాప్ జంగలే, ఇతరులకు పట్టా చేశారు. వాస్తవానికి 65 సర్వే నెంబర్ అదే గ్రామంలోని ఓ కుంటకు సంబంధించింది.

9. శేరిలింగంపల్లి మండలం మియాపూర్ సర్వే నెంబర్ 69లో 27 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీని విలువ బహిరంగ మార్కెట్‌లో ఎకరం రూ.50 కోట్లు పలుకుతోంది. ఓపెన్ మార్కెట్‌లో దీని వాల్యూ రూ.1,350 కోట్లన్న మాట. ఇంతటి విలువైన సర్కారీ భూమిలో బిల్డింగ్స్ కట్టుకునేందుకు అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్ అనుమతులు ఇచ్చేశారు. దీనికి జీహెచ్ఎంసీ అధికారులు, అప్పటి శేరిలింగంపల్లి తహశీల్దార్, సర్వే అధికారులు జీ హుజూర్ అనడం చకచకా జరిగిపోయాయి.

10. గచ్చిబౌలిలోని సర్వే నెంబర్స్ 38, 54 ల్యాండ్స్ సీలింగ్ సర్ ప్లస్ భూములు. మొత్తం 76 ఎకరాల వరకు ఉంటుంది. ఈ భూమి బహిరంగ మార్కెట్‌లో ఎకరం రూ.50 కోట్ల చొప్పున రూ.3,800 కోట్ల వరకు ఉంటుంది. ఇంతటి విలువైన ప్రభుత్వ భూమిలో ఇప్పటికే ఫినిక్స్, అయోధ్య రామిరెడ్డి, శిల్పా నాగిరెడ్డి, మినాక్షి సంస్థలు, తిష్ట వేశారు.

11. గోపన్ పల్లి గ్రామం సర్వే నెంబర్స్ 36, 37లోని భూములు పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించినవే. ఈ రెండు సర్వే నెంబర్స్‌లో కలిపి సుమారు 600 ఎకరాలుంటుంది. ఈ భూమిలో నర్సింగరావు అతని బ్రదర్స్‌కు రెవెన్యూ అధికారులు 90 ఎకరాల భూమిని స్వాధీనంలోకి తీసుకునేందుకు అప్పగించారు. సర్వే నెంబర్ 36లో మరికొంత ల్యాండ్‌ను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేశారు.

12. మహేశ్వరం – తుమ్మలూరు మధ్య ప్రభుత్వానికి 70 ఎకరాల భూమి ఉంది. దీని విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.210 కోట్ల వరకూ ఉంటుంది. దీన్ని అమోయ్ కుమార్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుయాయులకు కట్టబెట్టే యత్నం చేశారు.

13. రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లోని భూదాన్ భూముల్లో ప్రహరీ నిర్మాణం జరిగింది. 200 కోట్ల విలువైన 39.18 ఎకరాల భూమికి రెక్కలొచ్చాయి. దీనికి కారణం కూడా అమోయ్. ధరణిలో లొసుగులతో రికార్డుల్లో పట్టా భూములుగా మార్చేశారు. దాంతో ఇంకో 71 ఎకరాలకు స్కెచ్ వేశారు. చుట్టూ ప్రహరీ నిర్మాణం చేశారు. ఇలా మొత్తంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పని చేసిన అమోయ్ కుమార్, ఆయన తాబేదారు ఆఫీసర్లు కలిసి సుమారు రూ.25 నుంచి రూ.30 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను బీఆర్ఎస్ పెద్దల అండతో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి.

Related News

Salvo industries : అనామక కంపెనీకి బడా టెండర్.. కథంతా నడిపించిన ఆ లీడర్

Congress : మరో ఎన్నికల హామీ అమలుకు సర్కారు రె’ఢీ’

Janwada Farm House : సరే ఏం జరగలేదు.. డ్రగ్స్ పరీక్షలకు సిద్ధమా? – బీఆర్ఎస్ కు ఎంపీ అనిల్ కుమార్ సవాల్

CM Revanth Reddy: గృహ ప్రవేశాలు ఇలా కూడా చేస్తారా? తప్పేలేకుంటే ఎందుకు పారిపోయారు? కేటీఆర్‌పై సీఎం రేవంత్ సెటైర్లు

Rice Distribution In TG: తెలంగాణ ప్రజలకు తీపికబురు.. ఆ పథకం జనవరి నుండే ప్రారంభం.. ఇక వారికి పండగే!

KTR Tweet: ప్రత్యర్థి పార్టీలతో టీడీపీ కలిసింది.. అస్సలు నమ్మవద్దు.. గురి తప్పవద్దంటూ కేటీఆర్ సంచలన ట్వీట్

Bandi Sanjay – KTR: 7 రోజుల్లో సారీ చెప్పాలి.. రివర్స్ షాకిచ్చిన బండి సంజయ్.. కేటీఆర్ రిప్లై ఎలా ఉండెనో?

×