ANR National Awards 2024 : అక్కినేని నాగేశ్వరరావు అవార్డుల (ANR National Awards 2024) ప్రదానోత్సవం తాజాగా ఘనంగా జరిగింది. అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు సినీ ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు ఈవెంట్ కు తరలిరాగా, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా చిరు అవార్డును అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాను ఈ అవార్డు అందుకుంటున్న వేళ తన తల్లి ఈ వేడుకకు ఎందుకు హాజరైంది అనే విషయాన్ని చిరు (Chiranjeevi) బయట పెట్టారు.
అవార్డును అందుకున్న సంతోషంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మాట్లాడుతూ ఎప్పుడూ ఎక్కడికి రాని తన తల్లి అంజనమ్మ ఈ వేడుకకు ఎందుకు వచ్చింది అనే విషయానికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ కథను వెల్లడించారు. ఈ విషయం గురించి చిరంజీవి మాట్లాడుతూ “మా అమ్మ ఇక్కడే ఉంది. ఆమె ఈ వేడుకలో గెస్ట్ లలో ఫస్ట్ సీట్ లో కూర్చోవడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. అదేంటంటే అక్కినేని నాగేశ్వరరావు గారికి ఎవరైనా అభిమానులు ఉన్నారంటే వాళ్ళ అందరిలోకెల్లా సీనియర్ ఆమె. మా అమ్మకు అక్కినేని గారు అంటే ఎంత అభిమానం అంటే ఒక కథను చెప్పుకోవాలి’ అంటూ చెప్పుకొచ్చారు చిరు.
“ఆమె 15 ఏళ్ల వయసులో నిండు గర్భిణీ గా ఉంది. అప్పుడు మా అమ్మ కడుపులో ఒక జీవి ఉన్నాడు. అది మరెవరో కాదు నేనే. ఆ టైంలో మా అమ్మ మొగల్తూరులో ఉన్న తన పుట్టింటికి వెళ్ళింది. అయితే మరో రెండు నెలల్లో ప్రసవిస్తుంది అనగా ఆమెకు ఓ కోరిక కలిగింది. అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు సినిమా రిలీజ్ కావడంతో ఎలాగైనా సరే ఆ సినిమాకు వెళ్లాలని పట్టుబట్టింది. అసలే నిండు గర్భిణి… అప్పట్లో రవాణా సౌకర్యాలు పెద్దగా లేవు. గుంతలుగా ఉండే ఆ రోడ్డుపై నరసాపురం దాటి వేరే ఊరిలో సినిమాను చూడడానికి వెళ్లాలి. అయితే అమ్మ పట్టు పట్టడంతో నాన్న తీసుకెళ్లడానికి రెడీ అయ్యాడు. జట్కా బండిని మాట్లాడి వెళ్తూ ఉంటే మధ్యలో బస్సు అడ్డం వచ్చి యాక్సిడెంట్ జరిగింది. జట్కా బండి బోల్తాపడడంతో నాన్న కంగారుపడి అమ్మాయి ఎలా ఉందో చెక్ చేశారు. ఆమె బాగానే ఉండడంతో సరే ఇంటికి వెళ్ళిపోదాం పద అనగానే.. ఆమె లేదు అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాను చూడాల్సిందే అని అప్పటికి కూడా పట్టు వదలకపోవడంతో ఆయన సినిమాను చూపించారు. ఆ తర్వాత అక్కడ నుంచి ఇంటికి వచ్చిన రెండు నెలల తర్వాత ఆమెకు నేను జన్మించాను” అని సినిమా స్టైల్ లో తన తల్లి అక్కినేని (ANR)కి ఎంత పెద్ద అభిమాని అనే విషయాన్ని వివరించారు.
‘అలా వారసత్వంగా తనకు కూడా అక్కినేనిపై అభిమానం వచ్చినట్టుంది’ అంటూ చిరు మరో కొత్త విషయాన్ని చెప్పుకొచ్చారు. ఆయన స్పీచ్ ఇస్తున్న టైం లో అక్కినేని నాగేశ్వరరావు అనడానికి బదులు ఎన్టీఆర్ అనేశారు. వెంటనే సారీ చెప్పేసి మహానుభావుడు ఆయన పేరు కూడా గుర్తు రావడం శుభ పరిణామం అంటూ కవర్ చేసి, తర్వాత ఏఎన్ఆర్ (ANR) నామస్మరణ చేశారు చిరు (Chiranjeevi).