Hyderabad Momos Incident : మీరు స్ట్రీట్ ఫుడ్ ప్రియులా… నోటికి రుచిగా అనిపిస్తుందని ఎక్కడపడితే అక్కడ తినేస్తున్నారా.. ఇక చిన్న వాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకూ ఎంతో ఇష్టంగా తినే మోమోస్ చూస్తే ఎగబడుతున్నారా.. వెజ్, నాన్ వెజ్ తో పని లేకుండా లాగించేస్తున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే.. ఇకపైన అయినా జాగ్రత్తగా ఉండాల్సిందే.. ఎందుకంటే మోమోస్ తో ప్రాణాలు పోతున్నాయి సుమా!
ఎక్కడపడితే అక్కడ మోమోస్ తింటే ఎంత ప్రమాదమో తెలుసా.. తాజాగా కొందరు ఇలా స్ట్రీట్ ఫుడ్ తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇష్టంగా స్ట్రీట్ ఫుడ్ తిన్న పాపానికి హాస్పిటల్ పాలయ్యారు. ఎందరో చిన్నారులు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన ఎక్కడో కాదు. సిటీ నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ బంజారాహిల్స్ నందీ నగర్ లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 50 మందికి పైగా బాధితులు ఆసుపత్రి పాలవ్వగా… ఇందులో ఓ మహిళ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రస్తుతం ఈ ఘటన అందర్నీ కలిచివేస్తుంది. కాగా నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ నందీ నగర్ లో ప్రతీ వారం ఏర్పాటు చేసే మార్కెట్ లో మోమోస్ కౌంటర్ ను ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్ దగ్గరకు వచ్చిన కొందరు ఎంతో ఆతృతగా మోమోస్ ను కొని ఆరగించారు. ఇక అంతే… కాసేపటికే తీవ్ర ఆస్వస్థతకు గురయ్యారు. దీంతో వీరందరిని స్థానికి నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే వీరిలో చికిత్స పొందుతూ రేష్మ (29) అనే మహిళ మృతి చెందింది. ఈమెకు ముగ్గురు పిల్లలు సైతం ఉన్నట్లు తెలుస్తుంది.
ALSO READ : బడాబాబుల సంపాదన.. వారి పిల్లలేమో అలా.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఈ ఘటనపై బాధితుల కుటుంబ సభ్యులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నందినగర్ మార్కెట్లో ఉన్న బస్టాప్ వద్ద మోమోస్ స్టాల్ పెట్టారని.. ఇక్కడ తిన్న ప్రతీ ఒక్కరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. బాధితులు వాంతులతో పాటు విపరీతంగా జ్వరం ఉండటంతో ఆసుపత్రికి తీసుకొచ్చామని.. ప్రతీ ఒక్కరూ ఇదే సమస్యతో రెండు రోజుల నుంచి ఆసుపత్రిలో చేరటంతో అసలు విషయం బయటపడిందని తెలిపారు. ఇప్పటికే 40 నుంచి 50 మంది తీవ్రంగా అనారోగ్యం పాలయ్యారని తెలిపారు. ఓకే కుటుంబానికి చెందిన నలుగురైదుగురు సైతం ఒకేసారి ఆసుపత్రి పాలయ్యారని.. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన మోమోస్ స్టాల్ ఓనర్ పై తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో స్పందించిన డాక్టర్లు సైతం ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. తేలికగా అనారోగ్యాలు ప్రబలుతున్నాయని హెచ్చరిస్తున్నారు. స్ట్రీట్ ఫుడ్ తినే ముందు జాగ్రత్తగా ఉండాలని.. ఎక్కడపడితే అక్కడ కల్తీ ఆహారం తీసుకుంటే అనారోగ్యం పాలవుతారని హెచ్చరిస్తున్నారు. బయట దొరికే మోమోస్ ను ఎక్కువ రోజులు నిల్వ చేయటం లేదా వీటిలో పాడైపోయిన చికెన్ లాంటివి ఉపయోగించటం జరుగుతుందని… వీటిని తింటే ఖచ్చితంగా అస్వస్థత గురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.