ANR National Award 2024.. ఏఎన్నార్ జాతీయ పురస్కార వేడుకల ప్రధానోత్సవం అన్నపూర్ణ స్టూడియోలో అతిరథ మహారథుల సమక్షంలో చాలా అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ఏడాది ఏఎన్ఆర్ (ANR ) జాతీయ అవార్డును మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కి ఇస్తున్నట్లు గతంలోనే హీరో నాగార్జున ప్రకటించారు.. ఇప్పుడు ఆ పురస్కార ప్రధానోత్సవం ఘనంగా జరగబోతోంది. ముఖ్యంగా ఈ పురస్కారాన్ని అందజేయడానికి గత రెండు రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)స్వయంగా వెళ్లి మరీ ఆహ్వానించారు. అంతేకాదు తమ తండ్రి జ్ఞాపకార్థం ప్రతి ఏడాది ఉత్తమ నటీనటులకు అందజేస్తున్న అక్కినేని జాతీయ అవార్డును అందుకోవాల్సిందిగా చిరంజీవిని కోరారు.
జాతీయ పురస్కారాన్ని అందజేయనున్న బిగ్ బీ..
ఈ మేరకు ఈరోజు చాలా ఘనంగా ఈ కార్యక్రమం ప్రారంభం అవ్వగా ఈ కార్యక్రమానికి బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగానే చిరంజీవికి అక్కినేని జాతీయ పురస్కారాన్ని అందజేయనున్నారు. ఇకపోతే అక్కినేని జాతీయ పురస్కార వేడుకలకు నిర్మాత అల్లు అరవింద్, అశ్వినీ దత్, దర్శకులు రాఘవేంద్రరావు , హీరోలు వెంకటేష్, రామ్ చరణ్ , సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. అంతేకాదు ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఏఎన్ఆర్ మాట్లాడిన చివరి ఆడియో సందేశాన్ని కూడా వినిపించడం జరిగింది.
ఐసీయూ లో ఏఎన్నార్ చివరి వీడియో..
అక్కినేని నాగేశ్వరరావు కి సంబంధించిన సదరు వీడియో ఫ్యామిలీ గ్రూప్ లో షేర్ చేయడంతో ఇప్పుడు ఆ వీడియోని మళ్లీ వినిపించారు. అందులో ఏఎన్ఆర్ మాట్లాడుతూ.. నాకోసం మీరంతా కూడా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారని నాకు తెలుసు. నా కుటుంబ సభ్యులు కూడా ఎప్పటికప్పుడు నా ఆరోగ్య సమాచారం గురించి మీకు తెలియజేస్తూనే ఉన్నారు. మీ అభిమానానికి, ప్రేమకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను త్వరలోనే నేను మీ ముందుకు మళ్లీ వస్తానన్న నమ్మకం నాకు ఉంది. మీరు చూపించిన ప్రేమాభిమానాలకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. ఇక సెలవు తీసుకుంటున్నా అంటూ చివరిసారిగా ఐసీయు నుంచి ఆయన సందేశం ఇచ్చారు.
కంటతడి పెట్టుకున్న సెలబ్రిటీలు..
ఇక ఈరోజు శత జయంతి వేడుకలలో అక్కినేని నాగేశ్వరరావు తుది శ్వాస విడిచే ముందు చేసిన ఆడియో సందేశాన్ని వినిపించగా.. ఇది విని ఈ కార్యక్రమానికి హాజరైన రమ్యకృష్ణ, నాని , సుస్మిత, చిరంజీవి ఇలా ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ విషయాలు కాస్త ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక నాగార్జున తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు స్మారకంగా ప్రతి ఏటా చిత్ర పరిశ్రమకు విశిష్ట సేవలు అందించిన వారికి ఏఎన్ఆర్ స్మారక పురస్కారాన్ని అందజేస్తున్నారు. ఇక ఎప్పటిలాగే ఈ ఏడాది 2024 కు గానూ చిరంజీవికి అవార్డును అందజేస్తున్నారు. వందలాది చిత్రాలలో విభిన్నమైన పాత్రలు పోషించి అందరినీ ఆకట్టుకున్న అక్కినేని నాగేశ్వరరావు నేడు మన మధ్య లేకపోయినా ఆయన చిత్రాల ద్వారా ఎప్పటికీ జీవించి ఉంటారు అనడంలో సందేహం లేదు.