HC on Rash Driving: బడాబాబులు సంపాదిస్తున్నారు. వారి పిల్లలు మాత్రం సరదా పేరుతో ర్యాష్ డ్రైవింగ్ లు చేస్తూ.. ప్రమాదాల బారిన వారు పడడమే గాక, ఎదుటివారిని కూడా అదే స్థితికి తీసుకెళ్తున్నారు. ఇప్పటికైనా అటువంటి ప్రమాదాలపై దృష్టి సారించండి. బడాబాబుల పిల్లల హంగామాను అరికట్టండి. ఈ మాటలన్నది సాక్షాత్తు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి.
ఇటీవల హైదరాబాద్ లో చోటు చేసుకుంటున్నా రోడ్డు ప్రమాదాలపై జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల హైదరాబాద్ కేంద్రంగా ర్యాష్ డ్రైవింగ్ కారణంగా జరుగుతున్న ప్రమాదాలపై, న్యాయస్థానం విచారం వ్యక్తం చేసింది. హైదరాబాద్ లో అర్ధరాత్రి వేళ పలువురు యువకులు ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో, ఆ వీడియోలు సోషల్ మీడియాలో కూడా ఇటీవల వైరల్ అవుతున్నాయి. పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటున్నా, అక్కడక్కడా పలువురు యువకులు బైక్స్ తో హల్చల్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో వారు ప్రమాదాల బారిన కూడా పడుతూ.. ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న ఘటనలు సైతం చోటు చేసుకుంటున్నాయి.
ఇటువంటి రోడ్డు ప్రమాదాలపై జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రమాదాలపై న్యాయమూర్తి మాట్లాడుతూ.. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో 55 నుండి 60 వరకు పబ్బులు ఉన్నాయని, పబ్ లో బయట డ్రైవ్ లు పెట్టి, ప్రమాదాలను నివారించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లో ప్రతిరోజు ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతుందని, అటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బడా బాబులు సంపాదిస్తుంటే, వారి పిల్లలు పబ్బులలో హంగామా చేస్తూ.. ర్యాష్ డ్రైవింగ్ కు పాల్పడుతున్నట్లు తమ అభిప్రాయాన్ని న్యాయమూర్తి వెల్లడించారు. పబ్ లకు కొన్ని నిబంధనలు విధించాలని న్యాయమూర్తి, అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ కు సూచించారు.
Also Read: Viral News: 24 గంటల్లో 10వేల దోసెలు.. బాబాయ్ ప్లాన్ పెద్దదేనండోయ్!
న్యాయమూర్తి వ్యాఖ్యలను గమనిస్తే.. తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో పిల్లల నడవడికపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సరదాల పేరుతో యువకులు ప్రమాదాల బారిన పడకుండా చూడాల్సిన భాద్యత కూడా తల్లిదండ్రులపై ఉందన్న విషయాన్ని గుర్తించాలి. మనం చేసే తప్పిదంతో ఇతరులను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నామన్న విషయాన్ని నేటి యువకులు కూడా గమనించాల్సిన అవసరం కూడా ఉంది.