Viral Video: ఆయనకు డ్యాన్స్ అంటే ప్రాణం. అలాగే తన డ్రైవర్ వృత్తిని కూడా దైవంగా భావిస్తారు ఆయన. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థుల కోరిక మేరకు నాలుగు స్టెప్పులు వేశారు ఆ ఆర్టీసీ డ్రైవర్. ఇక సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. నేరుగా ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేసి మరీ అభినందించారు. కానీ చివరకు అతడు దైవంలా భావించే ఉద్యోగం నుండి తొలగించారు సంబంధిత ఆర్టీసీ అధికారులు.
కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ డిపో పరిధిలో కాంట్రాక్ట్ డ్రైవర్ గా లోవరాజు గత కొన్నేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఈయనకు బాల్యం నుండే డ్యాన్స్ లు చేయడం, అది కూడా సీనియర్ ఎన్టీఆర్ పాటలకు డ్యాన్స్ చేశారంటే.. ఎవరైనా అభినందించాల్సిందే. అంతే కాదు సోషల్ మీడియాలో సైతం లోవరాజుకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ కూడా ఉంది.
అందుకే కాబోలు తన ఇష్టాన్ని అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటారు లోవరాజు. ఇటీవల ఒక రోజు ఆర్టీసీ బస్సు నడుపుతుండగా, ఎదురుగా ట్రాక్టర్, ఎద్దుల బండి అక్కడే రహదారిపై ఇరుక్కుపోగా కొద్దిసేపు బస్సును నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బస్సు నిండా గల విద్యార్థులు కొత్త సాంగ్స్ కి డ్యాన్స్ వేయడం ప్రారంభించారు. చివరకు ఆ విద్యార్థుల కోరిక మేరకు ఎన్టీఆర్ పాటకు డాన్స్ వేశారు లోవరాజు. వెనుక భాగాన ఆర్టీసీ బస్సు కనిపిస్తున్న క్రమంలో డ్యాన్స్ వేసిన లోవరాజును, ఆర్టీసీ అధికారులు శాఖాపరమైన చర్యలలో భాగంగా ఉద్యోగంలో నుండి తొలగించారు.
డాన్స్ సూపర్ బ్రదర్! Keep it up! 👏🏻👌🏻
I hope the bus passengers had as great a time watching the performance as I did, without any complaints! 😜😂 https://t.co/n8X7TSSKty— Lokesh Nara (@naralokesh) October 26, 2024
అయితే అప్పటికే లోవరాజు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ కాగా, సాక్షాత్తు నారా లోకేష్ రీట్వీట్ చేసి మరీ, ప్రత్యేకంగా అభినందించారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ముగ్గురు పిల్లలు సంతానం గల లోవరాజును ఉద్యోగం లో నుండి తీసివేశారన్న విషయం తెలియని నారా లోకేష్, అతడికి ప్రత్యేకంగా అభినందనలు సైతం తెలిపారు.
చివరకు ఓ నెటిజన్ అసలు విషయాన్ని నారా లోకేష్ కు ట్వీట్ చేశారు. ఇక అంతే మంత్రి నారా లోకేష్ మానవత్వంతో స్పందించి, లోవరాజు ఉద్యోగానికి తాను గ్యారెంటీ అంటూ ట్వీట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న లోవరాజు తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద డ్యాన్స్ తో ఇరగదీసిన లోవరాజు, చివరకు తన డ్యాన్స్ వైరల్ వీడియోతో మళ్లీ ఉద్యోగంలో చేరడం గొప్ప విషయమే కదా మరి. లోవరాజు గారూ.. బెస్ట్ ఆఫ్ లక్ అనేస్తున్నారు ఆయన అభిమానులు. అలాగే మళ్లీ ఉద్యోగ అవకాశం కల్పిస్తానని మాట ఇచ్చిన నారా లోకేష్ కు నెటిజన్లు జేజేలు పలుకుతున్నారు.