Janwada Farmhouse Case: జన్వాడ రాజ్ పాకాల ఫాంహౌజ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. రాజ్ పాకాల ఇంట్లో జరిగింది కేవలం విందు మాత్రమేనా..అని సందేహాలు వస్తున్నాయి. రాజ్ పాకాల పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. మోకిల పోలీస్ స్టేషన్‌కు విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించినప్పటికీ.. ఆయన రాకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. దీంతో పోలీసులు వారెంట్ జారీ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం అందుతోంది. ఈ క్రమంలోనే ఏ తప్పు చేయనప్పుడు.. రాజ్ పాకాల విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక బీఆర్ఎస్ నేతలు అంతా ఆత్మ రక్షణలో భాగంగా సైలెంట్ అయిపోయారని టాక్ నడుస్తోంది. మరోవైపు నేడు పోలీస్ విచారణకు విజయ్ మద్దూరి హాజరుకానున్నారు.
ఫాం హౌస్‌లో జరిగిన పార్టీలో విజయ్ మద్దూరికి ఇప్పటికే కొకైన్ డ్రగ్ పాజిటివ్‌గా తేలింది. తాను డ్రగ్ కన్జూమర్ అని ఆయన పోలీసులకు చెప్పారు. సెక్షన్ 25,27,29 NDPS, 3,4 TSGA యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. రాజ్ పాకాలతో పాటు, ఆయన సోదరుడు శైలేందర్ పాకాల, బంధువు నాగేశ్వర్ రెడ్డి ఇళ్లలో ఎక్సైజ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్‌లో.. విల్లా నంబర్ 5, 40,43లో తనిఖీలు నిర్వహించినట్లు ఎక్సైజ్ శాఖ డీసీ దశరథ్ తెలిపారు. ఈ సోదాల్లో 52 విదేశీ మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఫామ్ హౌస్ లో జరిపిన పార్టీకీ ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా నిర్వహించారన్నారు. అనుమతి లేకుండా ఫారెన్ లిక్కర్ తీసుకొచ్చినట్లు గుర్తించామన్నారు. రాజ్ పాకాలతో పాటు ఆయన సోదరుడు ఇళ్లలో జరిపిన సోదాలపై ఇంకా విచారణ కొనసాగుతోందని.. స్పష్టమైన వివరాలు త్వరలో బయటపెడతామని డీసీ దశరథ్ తెలిపారు.
Also Read: జన్వాడ ఫామ్‌హౌస్ రేవ్ పార్టీపై విజయ్ ఫస్ట్ రియాక్షన్, ఫ్యామిలీతో ఫంక్షన్‌కు వచ్చా
అటు జన్వాడ ఫాం హౌజ్ లో సైతం భారీగా విదేశీ,స్వదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ యాక్ట్ కింద మరో కేసు నమోదు చేశారు. విజయ్ మద్దూరికి రాజ్‌పాకాల డ్రగ్స్ ఇచ్చారని ఎఫ్ఐఆర్ పేర్కొన్నారు.అసలు రాజ్ పాకాలకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎవరిచ్చారన్న తేలాల్సి ఉంది. విజయ్‌తోపాటు పార్టీలో పాల్గొన్న వాళ్లు ఏం చెప్పారన్న ఇంకా బయటకి రాలేదు. సోదాల్లో దొరికిన విదేశీ లిక్కర్ ఎవరు తెచ్చారన్న ఇంకా విచారణలో తేలాల్సి ఉంది. ఇంత జరుగుతుంటే రాజ్ పాకాల అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లారన్నది అంతు పట్టకుండా ఉంది.
ఫామ్‌హౌస్ పార్టీ చుట్టే తెలంగాణ రాజకీయం తిరుగుతున్నది. ఘటనపై లోతుగా విచారణకు కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.రాజకీయ కక్ష సాధింపు చర్య అంటున్న బీఆర్ఎస్ ఆరోపణలకు కాంగ్రెస్ నేతలు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. ప్రభుత్వం చెబితేనే పోలీసులు దాడులు చేయరని హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు. ఫామ్‌హౌస్ ఘటన డ్రగ్స్ మాఫియాను ప్రోత్సహించేలా ఉందని కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. ఇందులో ఎంత పెద్దవారు ఉన్నా కఠినంగా.. శిక్షించాలని హస్తం పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.