TGSP Constable Row: గత కొన్ని రోజులుగా తెలంగాణ స్పెషల్ పోలీసులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.. టీజీఎస్పీ కానిస్టేబుళ్లు, వారి కుటుంబ సభ్యులు, బెటాలియన్ పోలీసుల ఎస్పీ కార్యాలయం ఎదుట నిరసనలు తెలుపుతున్నారు. “ఒకే రాష్ట్రం- ఒకే పోలీసు విధానం” అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆందోళన చేస్తున్న కానిస్టేబుళ్లపై పోలీసులు కఠిన వైఖరి అవలంబించేందుకు పోలీసు శాఖ సిద్దమైంది. ఆదివారం నాడు నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో 39 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ తరుణంలో తాజాగా తెలంగాణ పోలీసు డిపార్ట్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆందోళనకు దిగిన పది మంది బెటాలియన్ పోలీస్ సిబ్బందిని విధుల నుంచి తొలిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డిస్మిస్ అయిన వారిలో మూడో బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ రవికుమార్, ఆరో బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ కె.భుషన్ రావు, 12వ బెటాలియన్‌కి చెందిన హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణతో పాటు పలువురు ఉన్నారు. వీరందరిని విధుల నుంచి తొలగిస్తూ ఏడీజీ సంజయ్ ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read: జన్వాడ ఫాంహౌజ్ కేసు.. తీగలాగుతున్న పోలీసులు
మరో వైపు ఒకే రాష్ట్రం- ఒకే పోలీసు విధానం అమలు చేయాలంటూ స్పెషల్ పోలీసులు ఆందోళన కొనసాగుతోంది. పలు జిల్లాలో టీజీఎస్పీ కానిస్టేబుళ్లు, వారి కుటుంబ సభ్యులతో రోడ్లపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 39 మంది కానిస్టేబుళ్లపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.