Hyderabad Fire Accident: సమయం రాత్రి వేళ 9.00 గంటలు కావస్తోంది. అందరూ దుకాణాలు మూసివేసే క్రమంలో ఉన్నారు. ఒక్కసారిగా ఢాం.. ఢాం.. ఢాం అంటూ శబ్దాలు. దీనితో ఏమి జరుగుతుందో తెలియని దిక్కుతోచని స్థితిలో అక్కడి ప్రజలు భయాందోళన గురయ్యారు. చివరికి అసలు విషయం తెలుసుకున్న ప్రజలు అక్కడి నుండి పరుగులు తీశారు.
దీపావళి పండుగ రాబోతుంది. అందుకే టపాసుల వ్యాపారం నిర్వహించే వ్యాపారస్తులు ఇప్పటికే టపాసులను విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో హైదరాబాదులోని అబిడ్స్ పరిధిలో గల బొగ్గులకుంట వద్ద కూడా ఓ టపాసుల దుకాణం ఏర్పాటు చేయగా, షాక్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా దట్టమైన పొగలు, నిప్పురవ్వలు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళన చెందారు.
హైదరాబాదులోని బొగ్గులకుంటలో దీపావళి పర్వదినానికి పురస్కరించుకొని, మయూర్ పాన్ షాప్ సమీపంలో పారస్ క్రాకర్స్ దుకాణాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. దీపావళి సమీపించిన సమయంలో భారీగా బాణసంచాలను విక్రయించేందుకు అంతా సిద్ధం కూడా చేశారు. అంతలోనే ఆదివారం రాత్రి ఒక్కసారిగా ఢాం.. ఢాం.. అంటూ భీకర శబ్దం షాపులో నుండి స్థానికులకు వినిపించింది. స్థానికులు అప్రమత్తమయ్యే క్రమంలోనే షాపులోని బాణసంచాలు ఒక్కసారిగా పేలాయి. దీనితో ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగ కమ్ముకోగా, భీకర శబ్దాలు, నిప్పు రవ్వలతో భయానకంగా మారింది.
ఈ మంటల ధాటికి పక్కనే గల తాజ్ టిఫిన్ సెంటర్ కు సైతం మంటలు వ్యాపించాయి. టిఫిన్ సెంటర్లో గల ఇరువురు మహిళలు దట్టమైన పొగలు, శబ్దకాలుష్యం ధాటికి అస్వస్థతకు గురికాగా, వెంటనే వారిని వైద్యశాలకు తరలించారు. అయితే స్థానికులు వెంటనే ఫైర్స్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. షాపులో గల బాణసంచా సామాగ్రి మొత్తం ఒక్కసారిగా పేలడంతో, మంటలను అదుపు చేయడం ఫైర్ సిబ్బందికి కష్టతరంగా మారింది. అయితే ఈ అగ్ని ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అంటూ ఫైర్ సిబ్బంది తెలిపారు. ఇప్పటికే 5 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్న సిబ్బంది, స్థానికులను అప్రమత్తం చేసి అక్కడి నుండి పంపించి వేశారు.
దీపావళి పర్వదినం రాకమునుపే బొగ్గులకుంట పరిధిలోగల స్థానికులకు అగ్నిప్రమాదం రూపంలో టపాసుల మోత మోగింది. పోలీసులు సైతం ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే చర్యలలో పాల్గొంటూ, స్థానికులను అప్రమత్తం చేశారు. కాగా ఈ అగ్ని ప్రమాదంలో ఎంత మేరకు ఆర్థిక నష్టం వాటిల్లిందో తెలియాల్సి ఉంది.
అబిడ్స్ లోని ఫైర్ క్రాకర్స్ దుకాణంలో అగ్ని ప్రమాదం pic.twitter.com/LzYBSstmlH
— BIG TV Breaking News (@bigtvtelugu) October 27, 2024