Janvada Farm House Case : జన్వాడా ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ ఘటనపై రాష్ట్రంలోని ప్రధాన పార్టీల మధ్య మాటలు మంటలు రేగుతున్నాయి. ఈ విషయమై ఇప్పటికే.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ఆరోపణలు చేసుకుంటుండగా.. ఇప్పుడు బీజేపీ రంగ ప్రవేశం చేసింది. మొదటి నుంచి కేటీఆర్ వ్యవహార శైలిపై, మత్తు మందుల వినియోగంపై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చిన బీజేపీ నేతలు.. తాజా సంఘటనల పై విమర్శలు గుప్పించారు.
జన్వాడా ఫామ్ హౌస్ పార్టీలో అక్రమ మద్యం, డ్రగ్స్ వినియోగించారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు రాజ్ పాకాల, శైలేంద్ర ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ విషయమై బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా స్పందించి.. రాష్ట్ర డీజీపీకి ఫోన్ చేశారు. సంఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్న కేసీఆర్.. సెర్చ్ వారెంట్ లేకుండా వారి ఇళ్లలో ఎందుకు తనిఖీలు చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే సోదాలు ఆపాలని డీజీపీని కేసీఆర్ కోరారు. ఈ ఘటనపై ఆదిలాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత పాయల్ శంకర్ తీవ్రంగా స్పందించారు. ఇన్నాళ్లు ప్రజలకు అందుబాటులో లేని కేసీఆర్ ఇప్పుడు రేవ్ పార్టీ కేసుల నుంచి తన కుటుంబాన్ని రక్షించాలంటూ డీజీపీ కి ఫోన్ చేయడాన్ని తప్పుబట్టారు. కేసీఆర్ వంటి నేతలు ఇంతకంటే సిగ్గుచేటు మరోకటి లేదంటూ వ్యాఖ్యానించారు.
గతంలో ఇంతకంటే దారుణమైన ఘటనలు అనేకం జరిగాయన్న పాయల్ శంకర్.. 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో పోలీసు లాఠీల దెబ్బలకు రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలు విలవిల్లాడారని మండిపడ్డారు. అప్పుడు ఎప్పుడూ కనికరించని కేసీఆర్.. కనీసం నోరు కూడా మెదపలేదని అన్నారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై కొట్లాడిన ఉద్యమకారులపై లాఠీ దెబ్బలు ఝుళిపించినప్పుడు కేసీఆర్ ఏనాడూ నోరు మెదపలేదని.. పోడు భూములపై గిరిజనుల పోరాటం సమయంలో గర్భిణీలను జైలుకు పంపినప్పుడు కేసీఆర్ స్పందించలేదని గుర్తుచేశారు.
అనేక మంది విద్యార్థులు కేసీఆర్ పాలనా కాలంలో ఆత్మహత్యలకు పాల్పడితే కనీసం పరామర్శకు కూడా వెళ్లని కేసీఆర్.. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల లోని నేరెళ్ల ఘటనలో దళితులపై పోలీసులు దారుణానికి ఒడిగట్టినప్పుడూ మాట్లాడలేదని అన్నారు. కానీ… ఇప్పుడు మాత్రం ఏం జరిగిందని పోలీసులకు కేసీఆర్ ఫోన్ చేశారని ప్రశ్నించారు.
తెలంగాణాలో జరిగిన అనేక ఘటనలపై ఎప్పుడూ, ఏనాడూ స్పందించని కేసీఆర్.. ఇప్పుడు ఏకంగా డీజీపికి ఫోన్ చేయడం ద్వారా ప్రజలకు ఏం సందేశమిస్తున్నారో తెలపాలన్నారు. కేసీఆర్ కు తెలంగాణ ప్రజల ప్రాణాల కంటే తన కుటుంబమే ఎక్కువైందా.? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకోవడం, అక్రమ మద్యం తీసుకోవడం వంటి వాటిపై డీజీపీకి ఫోన్ చేసి ఎలా మాట్లాడగలిగారని ప్రశ్నించారు. తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి కొట్లాడినని పదేపదే చెప్పుకునే కేసీఆర్ తప్పు చేసిన వాడిని దండించాలని చెప్పకుండా…. తన కుటుంబాన్ని కాపాడాలని డీజీపీకి ఫోన్ చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.