Janvada Farm House Case: కుటుంబంతో కలిసి ఫంక్షన్ జరుపుకుంటే, దానికి రేవ్ పార్టీ అంటారన్న విషయం ఈరోజే తనకు తెలిసిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని జన్వాడ లో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసుపై తాజాగా కేటీఆర్ స్పందించారు. తన నివాసం వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తాము ప్రశ్నిస్తున్నందుకే, కక్షపూరిత రాజకీయాలకు సీఎం రేవంత్ తెర తీశారన్నారు. రాజకీయంగా సమాధానం చెప్పే సామర్థ్యం లేక, తమను తమ కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేసేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారన్నారు. తన బావమరిది రాజ్ పాకాల నివాస గృహంలో దీపావళి సందర్భంగా దావత్ నిర్వహించారని, దావత్ ను రేవ్ పార్టీ అంటారా అంటూ ప్రశ్నించారు. ఆ ఫంక్షన్ లో వృద్ధులు, చిన్నారులు కూడా ఉన్నారని, ఈ కేసు బూచిగా చూపి, కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఉందన్నారు.
కుటుంబం మొత్తం ఒకే చోట కలిస్తే అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంటుందో రాష్ట్ర ప్రజలు గమనించాలన్నారు. ఉదయం ఎక్సైజ్ సీఐ శ్రీలత ఎటువంటి డ్రగ్స్ లభించలేదని ప్రకటించారని, సాయంత్రానికి డ్రగ్స్ కేసుగా ఎలా మారిందన్నారు. అంతమందిలో ఒకరికి డ్రగ్స్ పాజిటివ్ గా వచ్చినట్లు పోలీసులు తెలిపారని, అయితే ఆ డ్రగ్స్ తీసుకున్న విజయ్ బయట కూడా డ్రగ్స్ తీసుకుని ఉండవచ్చని కేటీఆర్ అన్నారు.
తనను ఎదుర్కోలేక అధికారం ఉందని మానసికంగా దెబ్బతీసేందుకు సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారని, ఇటీవల దీపావళికి పొలిటికల్ బాంబ్ అంటూ కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారం చేసి చివరకు ఇదేనా మీ పొలిటికల్ బాంబ్ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. గొంతు నొక్కి రాజకీయంగా వేధించి కాంగ్రెస్ ప్రభుత్వం సాధించేది ఏది లేదని, ఇటువంటి కక్షపూరిత చర్యలను మానుకోవాలన్నారు. ఇక తాను ఆ పార్టీలో పాల్గొన్నట్లు వస్తున్న వార్తలను కేటీఆర్ ఖండించారు. తాను ఆ పార్టీ జరిగే సమయానికి ఎర్రవల్లిలో తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ ను కలిసి ఇంటికి వచ్చినట్లు, ఇటువంటి వార్తలు ప్రసారం చేసే ముందు మీడియా కూడా నిర్ధారించుకోవాలన్నారు.
కేటీఆర్ ప్రకటనతో ఉదయం నుండి వస్తున్న కథనాలకు కొంత ఫుల్ స్టాప్ పడిందని భావించినా, మీడియా సమావేశంలో కేటీఆర్ ను ఓ మీడియా ప్రతినిధి.. డ్రగ్స్ టెస్ట్ లో ఒకరికి పాజిటివ్ వచ్చింది కదా అనే లోగానే కేటీఆర్ ఇక సెలవంటూ వెళ్లిపోయారు. అయితే పోలీసులు మాత్రం ఈ కేసు దర్యాప్తును వేగవంతంగా సాగిస్తుండగా, ఇక పూర్తి విషయాలు పోలీసుల ప్రకటనతో బహిర్గతం కావాల్సి ఉంది.
బిగ్ టీవీ ప్రతినిధిని వెళ్లిపొమ్మన్న కేటీఆర్..
ఉదయం నుండి జన్వాడ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి, పలు వార్తా కథానాలు ఉన్నది ఉన్నట్లుగా ప్రసారం చేసిన బిగ్ టీవీకి తన మీడియా సమావేశంలో పాల్గొనేందుకు అనుమతి లేదని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ స్పందనను ప్రసారం చేసేందుకు బిగ్ టీవీ ప్రతినిధులు అక్కడికి వెళ్లగా, కేటిఆర్ అనుచరులు సైతం మీకు అనుమతి లేదంటూ అడ్డుకోవడం విశేషం. అయినా కేటీఆర్ ప్రసంగాన్ని ఉన్నది ఉన్నట్లు ప్రసారం చేసి, బిగ్ టీవీ తన ధర్మాన్ని పాటించింది.