KCR on Janvada Farm House Case: హైదరాబాద్ లోని జన్వాడ ఫామ్ హౌస్ రేవ్ పార్టీ కేసుకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ కేసుకు సంబంధించిన విషయాల గురించి స్వయంగా రాష్ట్ర డీజీపీకి కేసీఆర్ ఫోన్ చేసి ఆరా తీశారు. ఉదయం నుండి రేవ్ పార్టీ కేసుకు సంబంధించి ఫామ్ హౌస్ యజమాని రాజ్ పాకాల, అతని కుటుంబ సభ్యుల గృహాలపై పోలీసులు తనిఖీలు కొనసాగిస్తున్నారు.
ఈ తనిఖీలపై డిజిపితో ఫోన్లో కేసీఆర్ మాట్లాడుతూ .. సర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఎందుకు చేస్తున్నారని, వెంటనే సోదాలను ఆపాలని డిమాండ్ చేశారు. అలాగే రాజ్ పాకాల, అతని సోదరుడు శైలేంద్ర గృహాలలో సోదాలను నిర్వహిస్తున్న తీరుపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
అలాగే రేవ్ పార్టీ కేసుపై మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు. బీఆర్ఎస్ పార్టీని, కేటీఆర్ ను ఎదుర్కోలేక, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చౌకబారు రాజకీయాలకు పాల్పడుతుందన్నారు. వ్యక్తులు తమ ప్రత్యర్థులను నేరుగా ఎదుర్కోలేనప్పుడు, వారు తరచుగా వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుంటారన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ క్యాడర్‌ను అక్రమంగా అరెస్టు చేయడంతో సహా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రతీకార రాజకీయాలు, ఫిరాయింపు వ్యూహాలను తాను ఖండిస్తున్నట్లు తన ఎక్స్ ఖాతా ద్వారా హరీష్ రావు స్పందించారు. అంతేకాకుండా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఈ ట్వీట్ ను హరీష్ ట్యాగ్ చేశారు.
న్వాడ ఫామ్ హౌస్ రేవ్ పార్టీకి సంబంధించి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు వెళ్లడయ్యాయి. ఎఫ్ఐఆర్ ద్వారా ఉదయం నుండి డ్రగ్స్ వినియోగంపై అనుమానాలు ఉండగా, తాజాగా ఎఫ్ఐఆర్ లో తెలిపిన అంశాల ఆధారంగా డ్రగ్స్ వాడినట్లు పోలీసులు ధృవీకరించినట్లైంది.
జన్వాడ ఫామ్ హౌస్ రేవ్ పార్టీ కేసు అంతు తేల్చేందుకు పోలీసులు పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రేవ్ పార్టీలో పాల్గొన్న ఏ ఒక్కరిని వదిలి పెట్టకూడదన్న లక్ష్యంతో దర్యాప్తును ఎస్ఓటి పోలీసులు వేగవంతం చేశారు.
అయితే పలువురు బీఆర్ఎస్ నేతలు, రాజ్ పాకాల ఇంటి వద్ద పోలీసులకు అడ్డు తగలగా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి, చివరకు తనిఖీలు కొనసాగించారు. కాగా కేసీఆర్ స్వయంగా డీజీపీకి ఫోన్ చేయడంపై బీఆర్ఎస్ నేతలు వివాదం సద్దుమణుగుతుందా.. లేక కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారోనంటూ చర్చలు సాగిస్తున్నారు. పోలీసులు మాత్రం చట్టం తన పని తాను చేసుకొని పోతుందన్న తరహాలో దర్యాప్తును వేగవంతం చేశారు.
విజయ్ మద్దూరిని విచారించిన పోలీసులు..
డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపితమైన వ్యాపారవేత్త విజయ్ మద్దూరిని మోకీలా పోలీస్ స్టేషన్ లో విచారించారు. ఈ సంధర్భంగా రేవ్ పార్టీకి సంబంధించిన పలు అంశాలను ప్రశ్నించి వివరాలు పోలీసులు రికార్డ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.