China Jammers in Delhi : దేశంలో వరుసగా బాంబు బెదిరింపులు పెరిగిపోతున్న నేపథ్యంలో.. దేశ రాజధాని దిల్లీలో తీవ్ర భద్రతా ముప్పు బయటపడింది. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేని విధంగా దిల్లీలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కన్నాట్ ప్లేస్‌లోని పాలికా మార్కెట్లో మొబైల్ ఫోన్ల సిగ్నల్స్ ను ఆపేసే 2 చైనీస్ మొబైల్ జామర్లను పోలీసులు గుర్తించారు. వీటితో పాటు 10 యాంటెనాలు, ఎలక్ట్రిక్ కనెక్టర్ కేబుల్‌తో సహా ఇతర పరికరాలను విడి భాగాలను కనుగొన్నారు. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. దేశ అంతర్గాత భద్రతకు ఈ ఘటన ఓ సవాళుగా భావిస్తున్న పోలీసులు, భద్రతా సంస్థలు.. ఈ జామర్లు ఎలా వచ్చాయి.? ఎవరు సమకూర్చారు.? అన్న విషయమై లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి.
పోలీసుల తనిఖీలో స్వాధీనం చేసుకున్న జామర్లు.. 50 మీటర్ల దూరం వరకు మొబైల్ సిగ్నళ్లను జామ్ చేయగలవు. ఈ జామర్లను కలిగి ఉన్న షాపు యజమాని రవి మాథుర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వీటికి ఎలాంటి లైసెన్సు, పత్రాలు లేకుండానే విక్రయిస్తుండగా.. నగరంలోని లజ్‌పతినగర్ మార్కెట్ నుంచి తీసుకువచ్చినట్లు ఒక్కొక్కటి రూ.25 వేలకు కొనుగోలు చేసినట్లు రవి చెబుతున్నాడు. ఒకవేళ ఇవి విద్రోహ శక్తులు, ఉగ్రమూకలకు చిక్కితే ఎలాంటి విపర్కర పరిస్థితులు తలెత్తుతాయోనని భద్రతా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వీటిని ఉపయోగించి ప్రజా కమ్యూనికేషన్ వ్యవస్థను స్తంభింపజేయడంతో పాటు, అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రజలకు సత్వర సేవలు అందకుండా అడ్డుకునేందుకు అవకాశం ఉంది. అందుకే.. టెలికమ్యూనికేషన్ విభాగానికి సమాచారం అందించిన దిల్లీ పోలీసులు.. రాజధాని ప్రాంతంలోని మిగతా మార్కెట్లల్లోనూ విస్తృత తనిఖీలు చేపట్టారు.
భారత్ లో జామర్, ఇతర టెలీకమ్యూనికేషన్ వ్యవస్థలకు అడ్డంకులు సృష్టించే పరికరాల విక్రయాలపై నిషేధం ఉంది. దేశంలో ఇలాంటి పరికరాల్ని పౌరులు కొనుగోలు చేసేందుకు, వినియోగించేందుకు వీలు లేదు. కేవలం అనుమతి పొందిన ప్రభుత్వం సంస్థలు, వ్యవస్థలు మాత్రమే జామర్లు వినియోగించేందుకు అనుమతులు ఉన్నాయి. వీటి వినియోగాన్ని పరిమితం చేస్తూ… కేంద్ర క్యాబినేట్ సెక్రటేరియట్ స్థాయిలో ప్రత్యేక మార్గదర్శక ఉత్తర్వులు ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి పరికరాల్ని వీవీఐపీలు ప్రయాణించే సమయాల్లో భద్రతా సంస్థలు వినియోగిస్తుంటాయి. ఆర్మీ పరిధిలోని ప్రాంతాలు, జైళ్లు, కొన్ని సున్నిత ప్రాంతాల దగ్గర అనుమతి లేని వ్యక్తులు, పౌరుల మొబైల్ సిగ్నళ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు పనిచేయకుండా ప్రభుత్వ రంగంలోని ఆధీకృత సంస్థలు మాత్రమే వీటిని వినియోగిస్తుంటాయి. ఇందుకోసం.. కేంద్ర సెక్రటేరియట్ ప్రత్యేక అనుమతులు, నిబంధనలు రూపొందించింది. ఇంతటి కఠిన ఆంక్షలున్న జామర్ల వంటి పరికరాలు.. విచ్చలవిడిగా మార్కెట్లో లభించడం.. ఎలాంటి పత్రాలు, అనుమతులు లేకుండానే ఇష్టం వచ్చినట్లు విక్రయిస్తుండడం ఆందోళనలు కలిగిస్తోంది.
Also Read : విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు… సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం కీలక అడ్వైజరీ
ఇటీవల దిల్లీలోని రోహిణి ప్రశాంత్ విహార్‌లో జరిగిన బాంబు పేలుడు, ఉగ్రవాద దాడుల ముప్పును నేపథ్యంలో.. ఈ జామర్లు బయటపడడంతో దేశంలో ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయోనని, దీని వెనుక ఎంత పెద్ద నెట్వర్క్ ప్రమేయం ఉందోనని భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ముఖ్యంగా.. పాలికా మార్కెట్, న్యూ లజపత్ రాయ్ మార్కెట్లు… తక్కువ ధరల్లో పైరేటెడ్, నకిలీ ఎలక్ట్రికల్ ఉత్పుత్తులకు ప్రసిద్ధి.