Janvada Farm House Case: జన్వాడ ఫామ్ హౌస్ రేవ్ పార్టీకి సంబంధించి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు వెళ్లడయ్యాయి. ఎఫ్ఐఆర్ ద్వారా ఉదయం నుండి డ్రగ్స్ వినియోగంపై అనుమానాలు ఉండగా, తాజాగా ఎఫ్ఐఆర్ లో తెలిపిన అంశాల ఆధారంగా డ్రగ్స్ వాడినట్లు పోలీసులు ధృవీకరించినట్లైంది.
జన్వాడ ఫామ్ హౌస్ రేవ్ పార్టీ కేసు అంతు తేల్చేందుకు పోలీసులు పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రేవ్ పార్టీలో పాల్గొన్న ఏ ఒక్కరిని వదిలి పెట్టకూడదన్న లక్ష్యంతో దర్యాప్తును ఎస్ఓటి పోలీసులు వేగవంతం చేశారు. ఇక పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా రేవ్ పార్టీకి సంబంధించిన ఎన్నో విషయాలు వెళ్లడయ్యాయి.
దీపావళి పార్టీనే.. రేవ్ పార్టీ
ఎఫ్ఐఆర్ ఆధారంగా.. నిన్న రాత్రి జన్వాడలోని తన ఫామ్ హౌస్ లో దీపావళి పార్టీ ఇస్తున్నట్లు రాజ్ పాకాల తన సన్నిహితులకు సమాచారం అందించారు. సుమారు రాత్రి 8.30 గంటల సమయంలో అందరూ ఫామ్ హౌస్ వద్దకు చేరుకున్నారు. అదే క్రమంలో రాజ్ పాకాల కంపెనీలకు సీఈఓ వ్యవహరిస్తున్న విజయ్ మద్దూరి కూడా అక్కడికి చేరుకున్నారు. కొద్ది నిమిషాల్లోనే పార్టీ ప్రారంభం కాగా, ఎస్ఓటీ పోలీసులకు వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు, స్నిఫర్ డాగ్స్ తో రాత్రి 11 గంటల సమయంలో దాడి చేశారు.
కొకైన్ ఇచ్చింది రాజ్ పాకాలనే..
తనకు సన్నిహితుడు, కంపెనీలకు సీఈవోగా వ్యవహరిస్తున్న విజయ్ మద్దూరిని రేవ్ పార్టీకి ఆహ్వానించిన రాజ్ పాకాల, స్వయంగా విజయ్ కు కొకైన్ అందించినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. పోలీసుల తనిఖీ సమయంలో విజయ్ మద్దూరి అనుమానితంగా ఉన్న నేపథ్యంలో, తమ వద్ద గల డ్రగ్స్ డిటెక్టివ్ టెస్ట్ కిట్ ఆధారంగా అక్కడే పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలు పాజిటివ్ వచ్చిన సందర్భంగా పోలీసులు, విజయ్ మద్దూరిని అదుపులోకి తీసుకున్నారు. రేవ్ పార్టీకి సంబంధించిన అన్ని అంశాల గురించి విజయ్ మద్దూరిని పోలీసులు విచారిస్తున్నారు.
కాగా ఉదయం నుండి డ్రగ్స్ తీసుకున్నారా లేదా.. అనే ప్రశ్నలకు ఎఫ్ఐఆర్ లో పోలీసులు నమోదు చేసిన అంశాల ఆధారంగా సమాధానం ఇచ్చినట్లైంది. ఇంతకు కొకైన్, రాజ్ పాకాలకు ఎక్కడి నుండి చేరింది? దీని వెనక ఉన్న ముఠా ఎవరు? ఎన్నేళ్ల నుండి డ్రగ్స్ సరఫరా అవుతుందనే విషయాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా ఎ2గా రాజ్ పాకాలపై కేసు నమోదు చేసిన పోలీసులు, తమ అదుపులో ఉన్న మహిళలకు డ్రగ్స్ డిటెక్టివ్ టెస్ట్ లు నిర్వహించేందుకు ప్రయత్నించగా, వారు నిరాకరిస్తున్నట్లు సమాచారం. ఎలాగైనా అందరికీ డ్రగ్స్ డిటెక్టివ్ పరీక్షలు నిర్వహించేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.