AP Cabinet Meeting :
⦿ మంత్రి వర్గ సమావేశానికి ముహూర్తం
⦿ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ
⦿ కీలక అంశాలకు ఆమోద ముద్ర పడే ఛాన్స్
⦿ నెల రోజుల్లోనే మూడోసారి సమావేశాలు
⦿ నవంబర్ రెండో వారంలో పూర్తి స్థాయి బడ్జెట్?
అమరావతి, స్వేచ్ఛ : ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం నవంబర్ 6న జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ నిర్వహణ తేదీలు ఖరారయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు పలు కీలక అంశాలకు ఆమోద ముద్ర పడనుందని తెలుస్తోంది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని శాఖల అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. నెల రోజుల వ్యవధిలోనే మూడోసారి కేబినెట్ మీటింగ్ జరగుతోంది. దీంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేబినెట్ భేటీలో పలు బిల్లులకు ఆమోదం లభించనుంది. మహిళలకు ఉచితబస్సు ప్రయాణం, సూపర్ సిక్స్ హామీలు అమలు, రాజధాని నిర్మాణం, పోలవరం విషయాలు, నామినేటెడ్ పదవులపై ముఖ్య నిర్ణయాలు తీసుకునే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. ఇటీవలే ఉచిత ఇసుక, 3 ఉచిత సిలిండర్లు వంటి పథకాలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
ALSO READ : జగన్ ఒళ్లంతా విషమే.. బుసలు కొడుతూ.. కాటేయాలని చూస్తున్నాడు
బడ్జెట్ ఉంటుందా?
నవంబర్ రెండో వారంలో ఏపీ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కేబినెట్ సమావేశంలో ప్రధానంగా బడ్జెట్‌పైనే చర్చ జరుగుతుందని తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు ఆదేశాల మేరకు అధికారులు ఆర్థిక బడ్జెట్‌ను రెడీ చేసే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. మరోవైపు బడ్జెట్ ఎప్పుడు ప్రవేశ పెట్టాలి? కేటాయింపులు ఎలా ఉండాలి? అనే దానిపై ఆర్థిక వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ బిజిబిజీగా ఉన్నారట. వాస్తవానికి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నెల రోజుల వ్యవధిలోనే పూర్తి స్థాయి బడ్జెట్ సమర్పించాల్సి ఉంది. అయితే ఏపీ ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోవడం, అప్పులు ఎన్ని ఉన్నాయనేదానిపై స్పష్టత లేని గందరగోళ పరిస్థితుల్లో శ్వేతపత్రాలను మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. కనీసం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని వైసీపీ నుంచి పదే పదే విమర్శలు కూడా వస్తున్నాయి. దీంతో నవంబర్ రెండో వారంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.