Big Tv news Threat : జన్వాడ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ చిలికిచిలికి గాలి వానలా మారుతోంది. ఈ వ్యవహారంలో బడా నేతలు, వారి బంధువులు పాల్గొన్నట్లు వ్యక్తం అవుతున్న అనుమానాలకు బలం చేకూరుతుంది. కాగా.. అసలు అక్కడ ఏం జరిగింది, ప్రస్తుత పరిస్థితుల ఏంటో తెలుసుకునేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై బీఆర్ఎస్ పార్టీ నేతల, అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. రాజ్ పాకాల ఫామ్ హౌస్ పోలీసుల మోహరింపు, బీఆర్ఎస్ నేతలు వరుస కట్టడం వంటి సంఘటనల్ని కవర్ చేస్తున్న వార్తలను అందిస్తున్న బిగ్ టీవీ మీడియా ప్రతినిధిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ నోరుపారేసుకున్నారు. వార్తలను కవర్ చేస్తున్న ప్రతినిధిని.. తన పని చేసుకోనివ్వకుండా అడ్డుకున్నారు.
రేవ్ పార్టీలోని అంశాల్ని ప్రజలకు ఎప్పటికప్పుడు అందిస్తున్న బిగ్ టీవీకి బీఆర్ఎస్ శ్రేణులు బెదిరింపులకు దిగారు. ఆఫీసును ముట్టడిద్దాం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు.
బిగ్ టీవీని మీరు బద్దలుకొడతారా.. మేము కొట్టాలా అంటూ కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ ఆయన అనుచరులు పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే.. లిక్కర్ మాఫియా, డ్రగ్స్ వంటి విషయాల్లో పార్టీ నేతలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని తీవ్ర అసహనంతో రగిలిపోతున్న బీఆర్ఎస్ అభిమానులు… వారికి వ్యతిరేకంగా జరుగుతున్న వరుస ఘటనలతో మరింత నిరాశలో కూరుకుపోయారు.
బిగ్ టీవీ ఆఫీస్ ను ముట్టడిద్దాం అంటూ, బిల్డింగ్ ను బద్దలు కొడదాం అంటూ ట్విట్టర్ లో పోస్టింగులు పెడుతున్నారు. లక్ష మంది కార్యకర్తలతో బిగ్ టీవీ ఆఫీస్ ను ముట్టడిద్దాం. అటాక్ చేద్దాం అంటూ రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నారు. దీంతో.. బిగ్ టీవ్ ఆఫీస్ దగ్గర కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ.. పరువు నష్టం కేసులతో ప్రయోజనం లేదని, తమకు వ్యతిరేకంగా ఉన్న వారిపై పోరాటాలు, దాడులే సరైన మార్గమంటూ హెచ్చరిక పోస్టులు పెడుతున్నారు.
బిగ్ టీవీ ప్రతినిధికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్షమాపణలు
జన్వాడ ఫామ్ హౌస్ దగ్గర వార్తలు కవర్ చేస్తున్న బిగ్ టీవీ మహిళా రిపోర్టర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారు. పార్టీపై వివరాలు అడిగినందుకు మీ ఇంట్లో మందు తాగరా? అంటూ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ బిగ్ టీవీ రిపోర్టర్‌ను అవమానకరంగా ప్రశ్నించారు. ఈ విషయమై మీడియా ప్రతినిధులు ఆగ్రహించారు. మహిళా రిపోర్టతో ఇష్టం వచ్చినట్లు ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. దాంతో… ఎమ్మెల్యే సంజయ్, బిగ్ టీవీ ప్రతినిధికి క్షమాపణలు చెప్పి, తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు.
Also Read : 21 మంది పురుషులు.. 14 మంది స్త్రీలు.. రేవ్ పార్టీ కేసుపై సంచలన ప్రకటన చేసిన డీసీపీ
మరోవైపు జన్వాడ లోని రాజ్ పాకాల ఫామ్ హౌస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు. పార్టీలో మొత్తం 16 మంది మహిళలు, 22 మంది పురుషులు ఉన్నట్లు గుర్తించగా.. వారికి రక్త పరీక్షలు చేసేందుకు కిట్లను తీసుకువచ్చారు. ఐతే.. పార్టీలో పాల్గొన్న మహిళలు రక్త పరీక్షలకు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలో పాల్గొన్న విజయ్ మర్దూరికి ఇప్పటికే రక్త పరీక్షలు చేసిన పోలీసులు.. కొకైన్ పాజిటివ్ వచ్చినట్లు తేల్చారు.