⦿ మార్చిలోనే సంచలన కథనం
⦿ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వారితో లింకులు
⦿ తాజా కేసుతో బయటపడ్డ మరిన్ని బాగోతాలు
⦿ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాంహౌస్‌పై పోలీసుల దాడి
⦿ డీజే సౌండ్స్‌తో ఫారెన్ లిక్కర్ పార్టీ
⦿ డ్రగ్స్ పార్టీగా అనుమానాలు
⦿ పరీక్షలు చేయగా ఓ వ్యక్తికి పాజిటివ్
⦿ డ్రగ్స్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు
⦿ రాజ్ పాకాల ఫాంహౌస్‌పై ఈనెల 8న స్వేచ్ఛ – బిగ్ టీవీ ప్రత్యేక కథనం
⦿ విలాసవంతమైన ఫాంహౌస్‌పై డీటెయిల్డ్ రిపోర్ట్
⦿ గతంలో డ్రగ్స్ లింకులపై ఎక్స్‌క్లూజివ్ కథనాన్ని ప్రచురించిన స్వేచ్ఛ
⦿ అసలు ఎవరీ రాజ్ పాకాల?
⦿ 2014కు ముందు చిన్న చిన్న ఈవెంట్స్ చేసుకుంటూ జీవనం
⦿ బీఆర్ఎస్ ప్రభుత్వంలో బడా కాంట్రాక్టులు.. బినామీ వ్యవహారాలు
⦿ స్వేచ్ఛ – బిగ్ టీవీ ఎక్స్‌క్లూజివ్ స్టోరీ
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: Janvada Farm House Case: బీఆర్ఎస్ బినామీ వ్యవహారాలకు సంబంధించి పలు సంచలన కథనాలు ప్రచురించింది ‘స్వేచ్ఛ’. పక్కా ఆధారాలతో డీటెయిల్డ్‌గా జనం ముందు ఉంచింది. ఈ లిస్టులో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల వ్యవహారాలు ప్రత్యేకం. ఇతని చుట్టూ బినామీ వ్యవహారాలే కాదు. డ్రగ్స్ లింక్స్ కూడా ఉన్నాయి. వీటిపై పక్కా ఆధారాలతో మార్చి 1న ‘కేదార్.. రాజ్.. డీలింగ్స్ అండ్ డౌట్స్’’ పేరుతో సంచలన కథనాన్ని ఇచ్చింది ‘స్వేచ్ఛ’. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వారితో రాజ్ పాకాలకు ఉన్న సత్సంబంధాలను బయటపెట్టింది. ఇప్పుడు మరోసారి ఈ వ్యవహారాలు హాట్ టాపిక్‌గా మారాయి. దానికి కారణం, రాజ్ పాకాల ఫాంహౌస్ జరుగుతున్న పార్టీపై పోలీసులు దాడులు జరిపి, కొందరికి పరీక్షలు జరపగా ఒకరికి పాజిటివ్ వచ్చింది.
పోలీసుల తనిఖీలు.. కేసు నమోదు
జన్వాడ రిజర్వ్ కాలనీలోని రాజ్ పాకాల ఫాంహౌస్‌లో స్పెషల్ పార్టీ జరిగింది. దీనిపై పక్కా సమాచారంతో సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు దాడులు జరిపారు. భారీ శబ్ధాలతో పార్టీ జరుగుతుండగా, భారీ ఎత్తున ఫారిన్ మద్యం బాటిళ్లను గుర్తించారు. ఎలాంటి అనుమతులు లేకుండా పార్టీ జరుగుతుండడంతో డ్రగ్స్ అనుమానాలు కలిగాయి. దీంతో పోలీసులు అక్కడున్న వారికి పరీక్షలు జరిపారు. ఓ వ్యక్తికి కొకైన్ పాజిటివ్ వచ్చింది. దీంతో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అంతేకాదు, సెక్షన్ 34, ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు పెట్టారు.
డ్రగ్స్ కేసులో నిందితులతో రాజ్ పాకాలకు డీలింగ్స్
ఫిబ్రవరిలో డ్రగ్స్ కేసులో సినీ నిర్మాత కేదార్ దొరికాడు. ఇతనికి రాజ్ పాకాలకు దగ్గరి సంబంధాలు ఉన్నాయి. బినామీగా పెంచి పోషించాడనే ప్రచారం ఉంది. న్యూజెర్సీలో మిర్చి రెస్టారెంట్‌లో పని చేసేందుకు లేబర్‌ని అక్రమంగా తరలించాడనే ఆరోపణలతో కేసులు నమోదు అవుతాయని కేదార్ హైదరాబాద్‌కు పారిపోయి వచ్చాడు. ఇక్కడకు రాగానే బఫెలో వైల్డ్ వింగ్ పేరుతో బీఆర్ఎస్ బినామీగా ఎదిగి 7 రెస్టారెంట్స్ ప్రారంభించాడు. హైలైఫ్, జూబ్లీ 800 పేరుతో పబ్స్ నడిపించాడు. వీటితో పాటు ఈవెంట్స్ నౌ కంపెనీతో రాజ్ పాకాల నిర్వహించే ఈవెంట్స్‌ని దగ్గరుండి చూసుకునేవాడు. తర్వాత, సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా పేరొందాడు. సినిమాలతో నష్టాలు వచ్చినా విమానాలను అద్దెకు తీసుకొని నడిపించాడు కేదార్. ఇతని వెనుక రాజ్ పాకాల ఉన్నాడని అనుమానాలున్నాయి. దీనిపై మార్చి 1న ‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేషన్ కథనాన్ని ఇచ్చింది. గతంలో డ్రగ్స్ కేసులో ఈడీ, సిట్ విచారణను ఎదుర్కొన్న వారితో పాటు కేదార్‌తో కలిసి రాజ్ పాకాల ఉన్న ఫోటోలు బయటపడ్డాయి. అంతేకాదు, కేదార్ పార్ట్‌నర్ అశ్విన్ జైన్ కారునే రాజ్ పాకాల వాడుతుండటంతో వీరి చీకటి ఆర్థిక బంధం బట్టబయలు చేసింది ‘స్వేచ్ఛ’.
ఫాంహౌస్ నిర్మాణం వెనుక కూడా అక్రమాలే
కేసీఆర్ హయాంలో 111 జీవో ఎత్తివేస్తామని చెప్పగానే జన్వాడలో లిటిగేషన్ ఉన్న 7 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నాడు రాజ్ పాకాల. సర్వే నెంబర్ 691లో ఇది ఉంటుంది. 1999లో కొనుగోలు చేసిన ఎస్ లక్ష్మీ ప్రభాకర్, కేఎస్ఎన్ ఫిన్ కాప్ ప్రైవేట్ లిమిటెడ్‌కి విక్రయించారు. ఈ కంపెనీలోని డైరెక్టర్స్ 2016లో మరో కంపెనీకి అమ్మినట్లు సెల్ డీడ్ ఉంది. తర్వాత, శ్రీమాతే ప్రాపర్టీస్ డెవలపర్స్ లిమిటెడ్ కంపెనీకి బదులాయించారు. ధరణిలో శ్రీమాతే పేరుపై క్లియర్ కాలేదు. దీంతో తనకి అనుకూలమైన వ్యక్తులైన రావు గురుప్రసాద్ కృష్ణ రంగారావు, రావు శ్రీ రాజరాజేశ్వరీ దేవి పేర్ల మీదకి 2021న కంపెనీని మార్చేశారు. ట్విస్ట్ ఏంటంటే, రాజ్ పాకాల ఫాంహౌస్ ఉన్న భూమికి ఇంకా మ్యూటేషన్ కాలేదు. 6500 గజాల ప్రాంతంలో 17 వేల స్క్వేర్ ఫీట్లతో వివిధ నిర్మాణాలు చేపట్టారు. 15 కోట్ల రూపాయలు నిర్మాణానికే ఖర్చు పెట్టారంటే ఎంత కాస్ట్లీ, ఇంపొర్టెడ్ వస్తువులను వాడారో అర్ధం చేసుకోండి. స్విమ్మింగ్ పూల్‌తో పాటు లాంజ్‌లు, లావిష్ ఎంట్రెన్స్‌లతో అత్యంత విలాసవంతంగా ఈ ఫాంహౌస్ నిర్మాణం జరిగింది.
Also Read: Janvada Farm House Case: కేటీఆర్ స్పందించరేమి? ఫ్యామిలీతో రేవ్ పార్టీలో పాల్గొన్నారా?
ఇంతకీ, ఎవరీ రాజ్ పాకాల?
రాజేంద్రప్రసాద్ పాకాల. అలియస్ రాజ్ పాకాల. ఈ పేరు డ్రగ్స్ ఈవెంట్స్ నడిపించే వారి నోట్లో నానుతూ ఉంటుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రకరకాల పేర్లతో గచ్చిబౌలిలో పార్టీలు చేసేవారు. యువతీ, యువకులకు డేటింగ్ ఏర్పాట్లు సమకూర్చేవారు. వాళ్ల బావ పార్టీ ప్రభుత్వం ఉండటంతో ఏం చేసినా అడిగే వారు ఉండేవారు కాదు. కానీ, ప్రతిపక్ష నేతలు అప్పట్లోనే రాజ్ పాకాల పాపాల చిట్టాను ప్రెస్ మీట్లు పెట్టి కడిగిపారేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐదేళ్ల క్రితమే ఆధారాలతో సహా ఇతని వ్యవహారాలన్నీ గాంధీభవన్ సాక్షిగా బట్టబయలు చేశారు. అయితే, గచ్చిబౌలి డ్రగ్స్ కేసు సందర్భంగా రాజ్ పాకాల పేరు మార్మోగింది. కేదార్ అరెస్ట్ కావడంతో అతనితో ఉన్న డీలింగ్స్ వెలుగులోకి వచ్చాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఈవెంట్స్ చేసుకుంటూ మధ్య తరగతి కుటుంబంలో బతికిన రాజ్ పాకాల, పదేళ్లలో 14 కంపెనీలను ఆర్ఓసీలో ఏర్పాటు చేసుకున్నాడు. చిన్న చిన్న ఈవెంట్స్ కాస్తా, వరల్డ్ వైడ్ ఈవెంట్స్‌గా మారాయి. విమర్శలు రావడంతో వివిధ రంగాల్లోకి అడుగు పెట్టాడు. ప్రస్తుతం పెద్ద పెద్ద విల్లాలో లగ్జరీ లైఫ్ ఎంజాయి చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో అతని ఫాంహౌస్‌లో పార్టీ జరగడంతో, పరీక్షల్లో ఒకరికి పాజిటివ్ రావడంతో మరోసారి రాజ్ పాకాల పేరు మార్మోగుతోంది.