Rocking Rakesh.. ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఈటీవీలో ప్రసారమవుతున్న కామెడీ షో జబర్దస్త్ (Jabardasth ) ఏ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. దశాబ్ద కాలానికి పైగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ షో ఇప్పటికీ అదే టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. ముఖ్యంగా ఈ షోలో కమెడియన్స్ గా పనిచేసిన ఎంతోమంది నేడు హీరోలుగా, డైరెక్టర్లుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కూడా సెటిల్ అయిపోతున్నారు. ఇటీవల జబర్దస్త్ లో ఒకప్పుడు కమెడియన్ గా అలరించిన వేణు (Venu) ఇటీవల బలగం (Balagam) సినిమా తీసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. దర్శకుడిగా తొలి ప్రయత్నం లోనే సక్సెస్ అయ్యారు.
జబర్దస్త్ ద్వారా తొలి గుర్తింపు..
మరొకవైపు గెటప్ శ్రీను కమెడియన్ గా సెటిల్ అవ్వగా.. ప్రముఖ కమెడియన్ గా, యాంకర్ గా పేరు తెచ్చుకున్న సుధీర్ కూడా హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తోడు చాలామంది జబర్దస్త్ లో పేరు మోసిన వారు అటు సినిమాలలో మంచి ఇమేజ్ దక్కించుకుంటున్నారని చెప్పవచ్చు. అలాగే యాంకర్ గా జబర్దస్త్ లో సత్తా చాటిన యాంకర్ అనసూయ (Anasuya )కూడా ఇప్పుడు పాన్ ఇండియా నటిగా చలామణి అవుతోంది. ఈ క్రమంలోనే జబర్దస్త్ ద్వారా తనకంటూ పేరు సొంతం చేసుకున్న రాకింగ్ రాకేష్ కూడా తాజాగా కేసీఆర్ అనే సినిమాతో హీరోగా మారనున్నారు.
కేసీఆర్ సినిమాతో హీరోగా..
మొదట కొన్ని టీమ్ లలో మెంబర్ గా పని చేసిన రాకేష్.. ఆ తర్వాత చిన్నారులతో కలిసి స్కిట్స్ చేయడం మొదలుపెట్టాడు. పిల్లలతో పండించిన కామెడీ చాలా కాలం పాటు బాగా వర్కౌట్ అయింది. ఎలాంటి ట్రోల్స్ విమర్శలు లేకుండా చాలా క్లీన్ గా స్కిట్స్ చేస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు రాకేష్. ఈ క్రమంలోనే జోర్దార్ సుజాత( Jordar Sujatha)తో జబర్దస్త్ వేదికపై పరిచయమై, ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. ఇటీవల పండంటి బిడ్డకు కూడా జన్మనిచ్చారు ఈ జంట. ఇక ఇప్పుడు కేశవ చంద్ర రమావత్(KCR )అనే సినిమాతో హీరోగా మారనున్నారు. ఈ సినిమాకి హీరో గానే కాదు స్వయంగా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు రాకేష్.
ఈ సినిమా కోసం ఇంటిని తాకట్టు పెట్టాం..
గరుడవేగ లాంటి చిత్రాలకు డీఓపీ గా పనిచేసిన అంజి ఈ సినిమా కు దర్శకత్వం వహించారు. తెలంగాణలో ఓ తండా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో సీనియర్ నటులు కృష్ణ భగవాన్ (Krishna bhagavan) తనికెళ్ల భరణి (Tanikella Bharani) తో పాటు జబర్దస్త్ ఆర్టిస్టులు రచ్చ రవి, రైజింగ్ రాజు, ధనరాజ్, తాగుబోతు రమేష్, జోర్దార్ సుజాత, సన్నీ, ప్రవీణ్ వంటి వారికి అవకాశం కల్పించారు రాకేష్. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో పాల్గొన్న రాకేష్ మాట్లాడుతూ.. నేను సినిమా కోసం ఎదుర్కొన్న కష్టాలు వర్ణనాతీతం. ధైర్యంగా ముందడుగు వేయి నేనున్నాను అని చెప్పిన ఎంతోమంది మధ్యలోనే హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయారు. ఒక పొలిటికల్ పార్టీ వల్ల లబ్ధి పొందానని ఆరోపణలు చేశారు. అయితే నాకు ఎవరి అవసరం రాలేదు. సినిమా తీయాలంటే డబ్బే అవసరం లేదు. అందుకే మా అమ్మకు ఎంతో ఇష్టంగా కట్టించి ఇచ్చిన ఇంటిని కూడా నేను ఈ సినిమా కోసం తాకట్టు పెట్టాను. ఈ విషయం మొన్నటివరకు అమ్మకి కూడా చెప్పలేదు. తెలిసిన తర్వాత ఆమె ఎందుకు? ఏంటి? అని కూడా అడగలేదు. అలాగే నా భార్య సుజాత కారును కూడా నేను అమ్మేశాను. ఇందుకు ఆమెకు ధన్యవాదాలు చెబుతున్నాను అంటూ తెలిపారు రాకేష్ . ప్రస్తుతం రాకేష్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.