Janvada Farm House Case: హైదరాబాద్ లోని జన్వాడ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ నిర్వహిస్తుండగా సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు దాడులు చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే రేవ్ పార్టీలో పాల్గొన్న విజయ్ మద్దూరికి డ్రగ్స్ పాజిటివ్ గా తేలడంతో, పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఈ ఫామ్ హౌస్ యజమాని, మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలపై కూడా సెక్షన్ 34, ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు, ముమ్మర దర్యాప్తు సాగిస్తున్నారు.
పార్టీలో కేటీఆర్ పాల్గొన్నారా?
జన్వాడ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో వదంతులు వ్యాపిస్తున్నాయి. పోలీసుల రైడ్ కి ముందుగానే కేటీఆర్ తో పాటు సతీమణి శైలిమా అక్కడి నుండి వెళ్లినట్లు, అలాగే మరికొందరు కూడా జారుకున్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇందులో ఎంత వాస్తవం ఉందో కానీ, పోలీసులు కూడా ఇదే రీతిలో దర్యాప్తు సాగిస్తున్నారట. అసలు విషయం బయటకు రావాలంటే పోలీసులు, సీసీ కెమెరాలలో నమోదైన వీడియోలను విడుదల చేయాలని బీజేపీ, కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు.
కాగా కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల, అతని సోదరుడి గృహాలలో తనిఖీలు నిర్వహించేందుకు వెళ్ళిన పోలీసులకు చుక్కెదురైంది. స్థానిక బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున పాకాల ఇంటి వద్దకు భారీగా చేరుకున్నారు. అంతలో పోలీసులు కూడా రంగప్రవేశం చేయగా, పోలీసులకు నేతలకు కాసేపు వాగ్వివాదం చేసుకుంది. అలాగే నోటీసులు తీసుకొని తనిఖీలకు రావాలని నేతలు కోరారు.
తమ వద్ద సెర్చ్ వారెంట్ ఉందని పోలీసులు తెలిపినా, ఎమ్మెల్యే వివేక్ గౌడ్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, బాల్క సుమన్ లు అడ్డగించే ప్రయత్నం చేయగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిస్థితుల్లో పోలీసులు చివరకు ఇంట్లోకి ప్రవేశించారు. కాగా వీరి గృహాలలో డ్రగ్స్, పెద్ద ఎత్తున విదేశీ మద్యం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఓవైపు పోలీసుల తనిఖీలు సాగుతుండగా, మరో వైపు బీఆర్ఎస్ నేతలు డౌన్ డౌన్.. అంటూ నినాదాలు చేస్తున్నారు. అయితే ముందస్తు చర్యగా పోలీసులు పెద్ద ఎత్తున వారి నివాసాల వద్దకు చేరుకున్నారు.
తాజాగా సంచలనం కలిగిస్తున్న రేవ్ పార్టీ కేసుకు సంబంధించి, కేటీఆర్ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయకపోవడం విశేషం. ఏ చిన్న విమర్శ వచ్చినా, ఎదురుదాడికి దిగే కేటీఆర్, ఈ విషయంలో సైలెంట్ గా ఉండడంతో, ఎప్పుడు ఏ ప్రకటన చేస్తారోనన్న సంశయం నెలకొంది. కేటీఆర్ ప్రకటనతోనే ఈ వదంతులకు ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది.