Sharmila on Jagan : వైఎస్ జగన్, షర్మిళ మధ్య ఆస్తుల వివాదంలో నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి మీడియా సమావేశంలో షర్మిళపై చేసిన ఆరోపణలపై .. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ ఘాటుగా స్పందించారు. అనేక అంశాల్ని లెవనెత్తిన షర్మిళ.. తనపై విజయసాయి చెప్పినదంతా జగన్ రాసిచ్చిన స్క్రిప్ట్ కాదా అని ప్రశ్నించారు. కాదని ప్రమాణం చేయగలరా.? అని సవాళు విసిరారు. ఆస్తి పంపకాల విషయంలో జగన్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడిన షర్మిళ… ఆస్తుల్లో నలుగురు చిన్న బిడ్డలకు సమాన వాటా ఉండాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్ణయించారని.. కాదని మీరు మీ బిడ్డల మీద ప్రమాణం చేయగలరా? అని విజయసాయి రెడ్డిని ప్రశ్నించారు. ఇప్పటికే.. వైవీ సుబ్బారెడ్డిని జగన్ మోచేతి నీళ్లు తాగే వాడివంటూ విమర్శించిన షర్మిళ.. విజయ సాయిని కూడా జగన్ మోచేతి నీళ్ళు తాగే వాడివంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై విమర్శలు చేస్తున్న వాళ్లంతా రాజకీయంగా, ఆర్థికంగా జగన్ వల్ల బలపడిన వాళ్ళేనని.. అలాంటప్పుడు ఇలా కాకపోతే ఎలా మాట్లాడుతారులే అంటూ వ్యంగ్యంగా విమర్శలు చేశారు.
వైఎస్ మరణానికి వాళ్లు కారణం కాదు
మొదటి నుంచి జగన్, ఆయన అనుచర నాయకులు చెబుతున్నట్లుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానికి కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికీ కారణం కాదని తెల్చిన వైఎస్ షర్మిళ.. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ను రెండు సార్లు అధికారంలోకి తెచ్చిన బంగారు బాతు వైఎస్ఆర్ అని కొనియాడారు. అలాంటి వ్యక్తిని ఎవరు చంపుకోరని, సొంత కళ్లను ఎవరూ పొడుచుకోరంటూ కాంగ్రెస్ పార్టీకి మద్ధతుగా నిలిచారు. ఒకవేళ జగన్ వర్గం చెబుతున్నట్లుగా వైఎస్ఆర్ మరణానికి చంద్రబాబు కారణం అయితే.. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు గాడిదలు కాశారా..? అని ప్రశ్నించారు. మీరు చెప్పేది నిజమే అయితే.. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక విచారణ ఎందుకు జరిపించలేదు..?, దర్యాప్తు చేసి నిజానిజాలు ఎందుకు బయట పెట్టలేదు..?, దోషులను ఎందుకు శిక్షించలేదు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అనుమానం ఉన్నా.. దర్యప్తు జరిపించలేదంటే.. అది మీ చేతకానితనానికి నిదర్శనం కాదా అంటూ ప్రశ్నించారు.
ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ చెరిగిపోరని మాట్లాడుతున్న జగన్ అనుచర నాయకులు.. ఆయన మరణం తర్వాత చార్జిషీట్ లో వైఎస్ఆర్ పేరును చేర్చింది మీ నాయకుడు జగనే అంటూ గుర్తుచేశారు. కేసుల నుంచి బయటపడేందుకు పొన్నవోలుతో కలిసి వైఎస్ఆర్ పేరును ఛార్జిషీట్ లో చేర్చే కుట్ర చేశారని ఆరోపించిన షర్మిళ… ఆ కారణంగానే జగన్ సీఎం అయిన వెంటనే పొన్నవోలుకు అడ్వకేట్ జనరల్ పదవి కట్టబెట్టారని విమర్శించారు. ఇప్పుడు మళ్ళీ తన స్వప్రయోజనం కోసం తల్లిని కోర్టుకి ఈడ్చిన విషపు నాగు జగన్ అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు.
Also Read : నువ్వు జగన్ చెల్లివి అవ్వడం మాకెంతో బాధగా ఉంది.
వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నట్లు తనకు చంద్రబాబుతో ఎలాంటి వ్యక్తిగత సంబంధాలు లేవని స్పష్టం చేసిన వైఎస్ షర్మిళ.. వైఎస్ఆర్ సైతం తన బిడ్డ పెళ్లికి చంద్రబాబును పిలిచారని గుర్తుచేశారు. అలాగే తానూ తన బిడ్డ పెళ్లికి ఆహ్వానించినట్లు చెప్పారు. ప్రతిపక్ష నేతను పెళ్లికి ఆహ్వానిస్తే.. తన చీర రంగు గురించి కూడా విపరీత అర్థాలు తీసే మీలాంటి వాళ్లకు సభ్యతా సంస్కారం ఉందని ఎలా అనుకోవాలి ? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ మోహన్ రెడ్డికి ఇంకా చంద్రబాబు పిచ్చి వీడలేదన్న వైఎస్ షర్మిళ.. ఇప్పటికీ జగన్ అద్దంలో చూసుకుంటే చంద్రబాబే కనిపిస్తున్నట్లుంది అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు కళ్లల్లో ఆనందం చూడటానికో, ఆయన బ్రాండింగ్ ను ఫాలో అవ్వడానికో.. పని చేయాల్సిన అవసరం వైఎస్ఆర్ బిడ్డకు ఎన్నటికీ రాదని మాట ఇస్తున్నా అంటూ తేల్చి చెప్పారు.