Janvada Farm House Case: హైదరాబాదులో ఆదివారం సంచలనంగా మారిన రేవ్ పార్టీ కేసుకు సంబంధించి రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ ప్రకటన విడుదల చేశారు. డీసీపీ ఇచ్చిన ప్రకటన మేరకు.. జన్వాడలోని రాజ్ పాకాలకు చెందిన ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు, తమకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించడం జరిగిందన్నారు. తాము రైడ్ చేసిన సమయంలో 21 మంది పురుషులు, 14 మంది స్త్రీలు ఉన్నట్లు గుర్తించామన్నారు. అయితే రైడ్ కు ముందు అక్కడి నుండి ఎంతమంది బయటకు వెళ్లారన్న విషయంపై ఆరా తీసుకున్నట్లు డీసీపీ ప్రకటించారు.
దాడులు నిర్వహించిన సమయంలో ఏడు విదేశీ మద్యం బాటిళ్లను, పది లోకల్ మద్యం బాటిళ్లను, గేమింగ్ ఐటమ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా విజయ్ మద్దూరి కొకైన్ తీసుకున్నట్లు డ్రగ్స్ నిర్ధారణ టెస్టులో తేలిందని, అతడిని రక్త పరీక్షల కోసం వైద్యశాలకు తరలించామన్నారు. అలాగే ఫామ్ హౌస్ యజమాని రాజ్ పాకాలపై NDPC యాక్ట్ 25, 27, 29, తెలంగాణ గేమింగ్ యాక్ట్ 3, 4 సెక్షన్ల కింద మొకిల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశామని తెలిపారు. అంతేకాకుండా ఎక్సైజ్ శాఖ నుండి అనుమతులు తీసుకోకుండా పార్టీ నిర్వహించినందుకు రేవ్ పార్టీపై ఎక్సైజ్ యాక్ట్ 34ఏ, 34(1) సెక్షన్ల కింద ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు.
అయితే ఈ రేవ్ పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారన్నది మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగా మారింది. కాగా కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఇంటి వద్ద తనిఖీలు నిర్వహించేందుకు వెళ్ళిన పోలీసులకు చుక్కెదురైంది. స్థానిక బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున పాకాల ఇంటి వద్దకు భారీగా చేరుకున్నారు. అంతలో పోలీసులు కూడా రంగప్రవేశం చేయగా, పోలీసులకు నేతలకు కాసేపు వాగ్వివాదం చేసుకుంది. అలాగే నోటీసులు తీసుకొని తనిఖీలకు రావాలని నేతలు కోరారు. ఇది ఇలా ఉంటే రాజ్ పాకాల ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు ఎక్సైజ్ సీఐ శ్రీలత తెలిపారు.