-కొత్తగా ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-ప్రజల అభీష్టం మేరకు ప్రారంభం
-వైజాగ్ నుంచి విజయవాడ వరకూ
-ఇండిగో విమాన సర్వీసులు
-టికెట్ ధర రూ.3 వేలు గా నిర్ధారణ
-ఒకేసారి రెండు విమాన సర్వీసులు ఇదే తొలిసారి
-త్వరలోనే వైజాగ్-గోవా సర్వీసులు
-భోగాపురంలో అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయం
-ఎయిర్ సర్వీసు యూనివర్సిటీ ప్రతిపాదన
-విమానయానంపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి
వైజాగ్, స్వేచ్ఛ:
Flight Service: ఒకేసారి ఏపీలో రెండు ప్రధాన నగరాల మధ్య విమాన సర్వీసులు ప్రారంభం కావడం ఇదే తొలిసారి అన్నారు కేంద్ర పౌర విమానయాన శాఖామాత్యులు కింజారపు రామ్మోహన్ నాయుడు. ఆదివారం విజయవాడ-వైజాగ్ మధ్య కొత్తగా రెండు విమానయాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. వైజాగ్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమాన సేవలను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. విశాఖలో ఉదయం 9.35కు విమాన సర్వీసు మొదలవుతుంది. తర్వాత 10.35 కు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటుంది. రాత్రి 7.15 కు ఇండిగో సర్వీస్ విజయవాడ నుంచి బయటు దేరి రాత్రి 8.20కి వైజాగ్ కు చేరుకుంటుంది.
తిరిగి ఇదే సర్వీసు రాత్రి 8.45 కు వైజాగ్ బయలుదేరి రాత్రి 9.50కి విజయవాడకు చేరుకుంటుంది. దీనితో విజయవాడ-వైజాగ్ తిరిగే విమాన సర్వీసులు 3కు చేరుకుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. వైజాగ్-విజయవాడ మధ్య ఫైట్ల సంఖ్య పెంచాలని డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ఆ ప్రకారమే ప్రజలంతా కోరుతున్నారు. ఇలా ఒకేసారి రెండు విమాన సర్వీసులను ప్రారంభించడం రాష్ట్రంలో బహుశా ఇదే తొలిసారి అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రజాభీష్టం ప్రకారమే ఈ రెండు సర్వీసులు ప్రారంభించామని మంత్రి తెలిపారు. రెండు నగరాల మధ్య ఎక్కువ సీట్లు అందుబాటులోకి రావడంతో విమాన టికెట్ల ధరలు తగ్గుతాయి. విజయవాడ-వైజాగ్ మధ్య టిక్కెట్ ఫెయిర్ మూడు వేల రూపాయలు ఉంటుందన్నారు.
కనెక్టివిటీ అవసరం
’’విశాఖ ఎంతో అభివృద్ధి చెందుతున్న నగరం. దీనిని మరింత అభివృద్ధి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృతనిశ్చయంతో ఉన్నాయి. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కనెక్టవిటీ ఎంతో అవసరం. విశాఖ-గోవా మధ్య విమాన సర్వీసులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. విశాఖ నుంచి అత్యధిక కనెక్టివిటీలు ఉండేలా కృషి చేస్తాను. భోగాపురంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్‌పోర్ట్ నిర్మిస్తున్నాం. ఎయిర్ సర్వీస్ యూనివర్సిటీని అక్కడ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రంలోని కొత్త ప్రాంతాల్లో విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు వేస్తున్నాం.
చంద్రబాబు ప్రత్యేక దృష్టి
రాష్ట్రంలో విమానయాన రంగం అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. విజయవాడ వేదికగా డ్రోన్ షో నిర్వహించాం. ఈ డ్రోన్ షో ఐదు రికార్డులు నెలకొల్పింది. ఓర్వకల్లు ప్రాంతంలో 300 ఎకరాలు డ్రోన్ సిటీ కోసం కేటాయించాం. విశాఖ నగరం మరింత అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ నగరానికి మంత్రి నారా లోకేష్ టీసీఎస్‌ను తీసుకొచ్చారు. అలాగే వైజాగ్‌ను స్పోర్ట్స్ హబ్‌గా చేయాలని ప్రభుత్వ సంకల్పం అని.. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి అన్నారు.
Also Read: అది ఆస్తి కోసం తగాదా కాదు.. అధికారం కోసం తగాదా: విజయ్ సాయి రెడ్డి
ఆకతాయిలను వదలం
ఇటీవల కాలంలో భారత్‌కు చెందిన విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాని ఆసరాగా చేసుకుని కొందరు ఆగంతకులు ఫేక్ కాల్స్ చేస్తున్నారని.. అంతేగాక విమానానికి బాంబు బెదిరింపులకు పాల్పడుతున్నారని అలాంటి వారిపై ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బెదిరింపులు వచ్చిన ప్రతిసారి అధికారులు విమానాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రయాణికులు బెదిరిపోయారు. మరోవైపు ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూ కూడా నవంబర్‌లో ప్రయాణికులు విమాన ప్రయాణాలు ఉపసంహరించుకోవాలని హెచ్చరించాడు. ఆదివారం విశాఖ – విజయవాడ మధ్య 2 విమాన సర్వీసులను ప్రారంభించిన ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. విమానాలకు వచ్చిన బాంబు బెదిరింపులపై దర్యాప్తు జరుగుతోందన్నారు.
ఏవియేషన్ చట్టాలలో మార్పులు
బాంబు బెదిరింపులపై కేంద్రం చాలా సీరియస్‌గా ఉందని పేర్కొన్నారు. దీనిపై సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారం జరుగుతోందని, బాంబు బెదిరింపుల వెనుక ఎవరున్నారో విచారణలో తేలుతుందని చెప్పారు. అలాగే ఏవియేషన్ కు సంబంధించిన చట్టాల్లో సవరణలు చేస్తామన్నారు. నిందితులు ఎవరైనా వారిని వదలమన్న ఆయన.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే బాంబు బెదిరింపులకు పాల్పడిన వారికి విమానాల్లో ఎంట్రీ ఉండదని, ఈ మేరకు చర్యలు ఉంటాయని, ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక సూచనలు చేశారని తెలిపారు.