Railway Station Stampede| పండుగ సమయంలో అందరూ సెలవు తీసుకొని కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు. కానీ ఇందుకోసం పట్టణాలు, నగరాల్లో ఉద్యోగాలు చేసేవారు.. తమ గ్రామాలకు వెళ్లేందుకు చాలా ఇబ్బందులు పడతారు. ఈ క్రమంలో కొన్ని సార్లు రైలు ప్రయాణంలో చేసేందుకు తొక్కిసలాట కూడా జరుగుతుంది. తాజాగా అలాటిదే ఒక ఘటన ముంబైలోని ఓ రైల్వే స్టేషన్ లో జరిగింది. ఈ ఘటనలో 9 మందికి తీవ్ర గాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
వివరాల్లోకి వెళితే.. ముంబై నగరంలోని బాంద్రా టర్మినస్ రైల్వే స్టేషన్ నుంచి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం గోరఖ్ పూర్కు బయలుదేరుతున్న 22921 నెంబర్ ట్రైన్ లో ఎక్కడానికి భారీ సంఖ్యలో ప్రయాణికులు ఒక్కసారిగా ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 9 మందికి తీవ్రంగా గాయపడ్డారని స్థానిక మీడియా తెలిపింది. వీరందరినీ రైల్వే పోలీసులు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
బ్రిహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దీపావళి సందర్భంగా ముంబైలో పనిచేసే ఎక్కువ శాతం ఉత్తర్ ప్రదేశ్ కార్మికులు తమ స్వస్థలానికి వెళ్లడానికి బాంద్రా రైల్వే స్టేషన్ లో రాత్రి 3 గంటలకు భారీ సంఖ్యలో వచ్చారు. ఈ క్రమంలో బాంద్రా నుంచి గోరఖ్ పూర్ వెళ్లే వీక్లీ ట్రైన్ 4 గంటలకు ప్లాట్ ఫామ్ నెంబర్ 1 పై వచ్చింది. ట్రైన్ వచ్చీ రాగానే ప్రయాణికులంతా ట్రైన్ ఎక్కడానికి పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట పరిస్థితి ఏర్పడింది.
Also Read: సహజీవనం చేసిన వ్యక్తిపై రేప్ కేసు పెట్టిన యువతి.. ఈజీగా బెయిల్ తెచ్చుకున్న నిందితుడు.. ఎలాగంటే?
ముఖ్యంగా గోరఖ్ పూర్ వెళ్లే వారు ఎక్కువగా రిజర్వేషన్ లేని జెనెరల్ కంపార్ట్మెంట్ లో ప్రయాణించడానికి ప్రయత్నించారు. ఈ కారణంగా ట్రైన్లో సీట్ల సాధించే కంగారులో కొంత మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి వెనెముక ప్రాక్ఛర్ కాగా.. కొందరికి భుజాలు, కాళ్లు ఫ్రాక్చర్ అయ్యాయి. సోషల్ మీడియాలో తొక్కిసలాటకు సంబంధించి ఒక వీడియో కూడా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో దాదాపు 1000 మంది ప్రయాణికులు ప్లాట్ ఫామ్ ట్రైన్ రాగానే పరుగులు తీశరు. కొందరు ప్రయాణికులైతే ట్రైన్ పూర్తిగా ఆగకముందే అందులో ఎక్కడానికి ప్రయత్నించారు.
జనం భారగీ ఉండడంతో 50 మంది రైల్వే పోలీసులు పరిస్థితిని అదుపు చేయడానికి రావాల్సి వచ్చింది. తొక్కిసలాట కారణంగా రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫామ్ పై అంతా రక్తం ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. తీవ్ర గాయాలున్నవారికి సమీప ఆస్పత్రికి తరలించడం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ట్రైన్ గంటకుపైగా ఆలస్యంగా బయలుదేరింది.